ఆంధ్రప్రదేశ్ తోలు బొమ్మలాట
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
తోలుబొమ్మలాట అనేది భారత దేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జానపద కళారూపం.[1] ఈ తోలుబొమ్మలాటలో చర్మంతో చేసిన వివిధ బొమ్మలతో ఒక కథని తయారుచేసి గ్రామాలలో కళారూపంగా ప్రదర్శిస్తారు. ప్రస్తుత కాలంలో పురాణ గాథలైన రామాయణం, మహాభారతం లోని కొన్ని కథలను టెలివిజన్ లో చూస్తూ ఉంటాము. కానీ పూర్వా కాలంలో మారుమూల గ్రామాలలోని ప్రజలకు ఈ గాథలను తెలియజెప్పే సాధనాలు లేవు. ఆ కాలంలో ఆ కథలను అర్థవంతంగా తెలియజెప్పేందుకు ఈ కళాకారులు వివిధ రకాల పాత్రల యొక్క బొమ్మలను చేసి వాటిని ప్రదర్శించేవారు.[1] తోలుబొమ్మలాట అనగా తోలుతో చేసిన బొమ్మలతో నాట్యం చేయించుట.[2]
ఈ వ్యాసం భౌగోళిక గుర్తింపు (GI) జాబితాలో భాగం | |||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
అన్నిటికన్నా ఇది ప్రాచీనకళ
మార్చుపల్లె వాసులకు వినోదాన్ని పంచి పెట్టిన అతి ప్రాచీన కళల్లో తోలుబొమ్మలాటలు మొదటిది. హరికథలు, బుర్రకథలు, వీధి నాటకాలు మొదలగు వాటి ఉనికి లేనప్పుడే ఈ తోలుబొమ్మలాటలు పల్లెవాసుల కందుబాటు లోకి వచ్చాయి. బహుళ ప్రచారం పొందాయి. ఈనాడు ఆంధ్రదేశంలో ఈ తోలుబొమ్మలాటల్ని, బుట్టబొమ్మలాటల్ని, కొయ్య కావళ్ళవారి ప్రదర్శనలనూ అతి అరుదుగా చూస్తూ వున్నాం. కాని కొయ్య బొమ్మలాటల్ని మాత్రం ఎక్కడా చూడలేక పోతున్నాం.[3]
చరిత్ర
మార్చుఈ ఆట సా.శ. 1700 కాలంలో తోలుబొమ్మలాటలు ఆంధ్రదేశంలో ఎక్కువగా ప్రదర్శింపబడుతుండేవి. ఆ కాలపు జనుల వేడుకలలో తోలుబొమ్మలాట ఒకటి. ద్విపద ప్రబంధాలు వివిధములగు పాటలు, తోలుబొమ్మ లాటలు, మన తెనుగువారిలో ఆదికాలము నుండియు ఉండినట్టివని యిదివరకే తెలుపనైనది. చాలా ప్రాచీనుడగు పాలకురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో ఇట్లు వ్రాసినాడు.[4]
భ్రమరాలుజాళెముల్ బయనముల్ మెఱసి
రమణ పంచాంగపేరణి యాడువారు
ప్రమథపురాతన పటుచరిత్రములు
క్రమమొందు బహునాటకము లాడువారు
అమరాంగనలు దివినాడెడుమాడ్కి నమరంగ గడలపై నాడెడువారు
ఆ వియద్గతి యక్షులాడెడునట్టి భావన మ్రోకులపై నాడువారు
భారతాది కథలు చీరమరుగుల నారంగ బొమ్మల నాడించువారు
నాదట గంధర్వ యక్ష విద్యాధరాదులై పాత్రల నాడించువారు'
భాస్కర శతకకారు డెవ్వడో తెలియదు. అతని కాలములోను తోలుబొమ్మలాట. వ్యాప్తిలో ఉండినది.[4]
ఇంచుక నేర్పు చాలక విహీనత జెందిన నా కవిత్వమున్
మించు వహించె నీకతన మిక్కిలి యెట్లన తోలుబొమ్మలన్
మంచి వివేకి వాని తెరమాటున నుండి ప్రశస్తరీతి నా
డించిన నాడవే జనుల డెందము నింపవె ప్రీతి భాస్కరా
మన వాఙ్మయములో పాలకురికి సోమనాథుని కాలమునుండి తంజావూరి రఘునాథ రాయలవారకు బహుకవులు బొమ్మలాటను పేర్కొనిరి. బొమ్మలాట యనగా తోలుబొమ్మలాట. భారతీయులలో ఏయే ప్రదేశాలలో నిది కలదో తెలియదుకాని తెనుగువారిలోను, కర్ణాటకులలోను ఇది చాలా ప్రాచీనమునుండి వచ్చినట్టి యాట. సన్ననివస్త్రమును తెరగా కట్టి దానిలోపల పెద్ద దివటీలు వెలిగించి తోలుబొమ్మల కాళ్ళకు, చేతులకు, తలలకు దారములు కట్టి మధ్య నొక దబ్బతో అ బొమ్మనుపట్టి నిలబెట్టి అవసరమగు దారములను లాగుతూ వదులుతూ బొమ్మ లాడించెడివారు. ఆట కనుగుణ్యముగా తాళము వాయించుతూ కథకు సంబంధించిన పాట పాడుదురు. రామయణకథకు గోన బుద్ధారెడ్డి రామాయణములోని ద్విపదలను పాడుదురందురు. బొమ్మలను సూత్రములతో నాడించువా రగుటచేత అట్టి ప్రదర్శకుని "సూత్రధారుడు" అని యందురు. సంస్కృత నాటకములలో నాటకమును ప్రారంభించునప్పుడు 'సూత్రధారుడు' ప్రవేశించి ప్రదర్శింపనున్న నాటకము గురించి కొన్ని మాటలు చెప్పిపోవును. కాని తోలుబొమ్మలాటలో ఆదినుండి తుదివరకు సూత్రదారుడు లేనిది బొమ్మ లాటయే యుండదు. కాన నాటకాలకన్న బొమ్మలాటకే సూత్రధార పదము సరిపోవును. అట్లగుచో తోలుబొమ్మలను చూచి నాటకాలవారు సూత్రధార పదమును నాటక నాట్యవిధానమును సవరించుకొనిరా లేక నాటకాలను జూచి బొమ్మలాటగాండ్రు నేర్చుకొనిరా అనునది చర్చనీయాంశమగును.[5]
తోలుబొమ్మలపై వాలిసుగ్రీవులు, రావణుడు, సీతారామలక్ష్మణులు, రాజులు, భటులు, మహాభారత వీరులు, మున్నగు వేషాలన్నియు వివిధ రంగులతో తీర్తురు. ప్రేక్షకులు బొమ్మల చూడగనే ఇది యీ వ్యక్తిని నిరూపించు బొమ్మ అని పోల్చుకొను సాంప్రాదాయ మేర్పడినది. ఈ బొమ్మలలోని వేషాలు పూర్వపు రాజులు రౌతులు మున్నగువారి వేషములను ఊహించుటకు తోడ్పడ వచ్చును. ఈ బొమ్మలాటలో మధ్య మధ్య హాస్యప్రదర్శనము చేయుదురు. అది చాలా అసభ్యముగా నుండును. సినిమా అసభ్యాలను నిషేధించే ప్రభుత్వము వీటిని తొలగించినదికాదు. ఆనాడు జనులెక్కి గిర్రున తిరిగిన రంకురాట్నం నేటికిని ఆదరణీయమై యున్నది.[5]
బొమ్మల తయారీ
మార్చుకొయ్యబొమ్మలకీ తేలికైన చెక్కలను ఉపయోగిస్తారు. బొమ్మల్ని చెక్కడానికి అనువైన తేలికగా చెక్కడానికి వీలుండే కొయ్యను ఎంచుకుంటారు. ప్రదర్శించబోయే బొమ్మ తలకు రెండు సూత్రాలు, ప్రేక్షకులకు కనిపించని నల్లని దారాలు వుంటాయి. ఆధారాలను సూత్రధారుడు తన తలకు కట్టుకుంటాడు. అతడి చేతులకు కొక్కీ లుంటాయి. వాటిని చేతిలో పట్టుకుని హృద్యమంగా జనరంజకంగా ప్రదర్శిస్తారు. ముఖ్యంగా వీరు ప్రదర్శించే కథా ఇతివృత్తాలు భారత రామాయణ గాథలకు సంబంధించినవి. లంకాదహనం, మైరావణ చరిత్ర, ఇంద్రజిత్తు వధ, యయాతి కథ, కీచక వధ, దుశ్శాసన కథ, ప్రహ్లాద చరిత్ర, రంగనాథ రామాయణం మొదలైనవే కాక, దేశీయ కథలైన దేసింగు రాజు కథ, పల్నాటి వీర చరిత్ర, కరెభంటన కథ, కుమార రాముని కథలను కూడా ప్రదర్శిస్తూవుంటారు.[3]
ఇక ప్రదర్శనానికి కావలసిన పరికరాలను, మిగిలిన హంగులన్నింటినీ కూడా తయారు చేసుకుంటారు. రథాలు, గుఱ్ఱాలు, అంబులు, బాణాలు, గదలు, ఈటెలు, సైన్యం మొదలైన వాటినన్నిటినీ కూడా తయారు చేసుకుని ప్రదర్శనం రోజున వివరంగా విడదీసి ప్రదర్శన గమనాన్ని బట్టి ఈ బొమ్మలన్నిటినీ సక్రమంగా, సిద్ధంగా అమర్చి పెట్టుకుని, ఒక బొమ్మ తరువాత మరొక బొమ్మను తెరమీదీకి ఎక్కించి కథను ముందుకు నడుపించుతారు.
ఆటకు తగ్గ పాటలు, పాటకు తగ్గ మోతలు
మార్చుపాట పాడేవారు, హార్మోనియం వాయించే వారూ, తాళం వేసే వారూ, మద్దెల కొట్టేవారూ, అదనపు మోతల్నిచ్చేవారూ, వంతపాటలు పాడేవారూ అందరూ లోపలే కూర్చుంటారు. పిల్లల పడకలూ, వుయ్యాలలూ అన్నీ నేపథ్యంలోనె అమర్చుకుంటారు. వీరికి హార్మోనియం శ్రుతిగా వుంటుంది. తాళాలుంటాయి. హార్మోనియం, తాళాలు, మద్దెల వాయించే వ్వక్తులు కూడా వెనుక వంత పాట పాడుతూ వుంటారు. అంతేకాదు వాళ్ళ కాళ్ళ క్రింద బల్లచెక్కలుంటాయి. ఆ యా ఘట్టాల ననుసరించి ఈ చెక్కలను త్రొక్కుతూ వుంటారు. ముఖ్యంగా రథాలు, గుఱ్ఱాలు, పరుగు లెత్తేటప్పుడూ, యుద్ధ ఘట్టాలలోనూ ఈ చెక్కలు టకటకా త్రొక్కుతూవుంటే బలే రసవత్తరంగా వుంటుంది. అంతేగాక నగరా మోతలకు ఖాళీ డబ్బాలు వుపయోగిస్తారు. పిడుగులు పడ్డట్టూ, వురుములు వురిమినట్టు డబ్బాలను మోగిస్తారు. ఈ విధంగా వారు ప్రదర్శననాన్ని జయప్రదంగా రక్తి కట్టిస్తారు. ఆట ఆడినంతసేపూ పరస్పర సహకారం వారిలో కనబడుతుంది. అందువల్లనే వారి ప్రదర్శనాలు అంత బాగా రక్తి కడతాయి.[3]
ఆటగాండ్లు అష్టావధానం
మార్చుముఖ్యంగా ఏ వ్యక్తి బొమ్మల్ని ఆడిస్తాడో ఆ వ్యక్తి నోటితొ పాట పాడుతూ పాటకు తగిన విధంగా బొమ్మను ఆడిస్తాడు. సంభాషణలకు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తాడు. ఇక రెండు బొమ్మల్నీ ఆడించే సమయంలో బొమ్మల మధ్య వచ్చే పోరంటంలో, రెండు బొమ్మల్ని రెండు చేతులతో కొట్టిస్తాడు. అలా కొట్టడంలో సమయానికి క్రింద బల్ల చెక్క టకామని త్రొక్కుతాడు. నిజంగా పాత్రలు కొట్టుకున్నట్టే వుంటుంది. ఈ సమమంలో ఇతర వంతదారులు కావలసిన అల్లరి, హంగామా చేస్తారు. ఒక యుద్ధ ఘట్టం వచ్చిందంటే, డోళ్ళు, డబ్బాలూ, ఈలలూ కేకలతో వాన కురిసి వెలిసినట్లు చేస్తారు. ఈ విధంగా వారు ప్రదర్శనను సమష్టి కృషితో జయప్రదంగా నిర్వహించి ప్రేక్షకుల్ని మెప్పిస్తారు.[3]
ప్రదర్శనం, ప్రేక్షకుల హడావిడి
మార్చుతోలుబొమ్మలాట ప్రదర్శిస్తున్నారని తెలిస్తే చాలు, గ్రామ చుట్టుప్రక్కలున్న పెద్దలు, పిల్లలూ, స్త్రీలూ అందరూ హెచ్చు తగ్గుల భేదాలు లేకుండా ఒకరికంటే ఒక ముందుకు వచ్చి కూర్చుంటారు. కథా ప్రారంభం నుండి ఆసాంతం వరకూ రెప్ప వాల్చకుండా చూస్తూ కూర్చుంటారు. ప్రతి ఘత్తంలోనూ వారు కదిలి పోతారు. హాస్య ఘట్టాలలో ఎంతగా పగలబడి నవ్వుతారో అలాగే కష్టాలతో కూడుకున్న ఘట్టాల్లో కళ్ళవెంట నీరు కారుస్తారు. ఇక దౌర్జన్యం ఘట్టాలలోనూ, దుర్మార్గపు సన్నివేశాలలోనూ, ఆయా పాత్రలమీద పళ్ళు పటపాటా కొరుకుతారు. ఈ విధంగా పండితుల మొదలు పామరుల వరకు ఆబాల గోపాలం ఆనందంతో మునిగి పోతారు.[3]
జుట్టుపోలిగాడు, బంగారక్క
మార్చుఈ బొమ్మలాట ప్రదర్శనాలను ఇంత ఆపేక్షాగా ప్రజలు చూడడానికి కారణం లేక పోలేదు. తెలుగు నాట బొమ్మల ప్రదర్శనాలలో విచిత్రమైన లాస్య పాత్రలను చూపుతారు. ఈ పాత్రలు కథా ప్రారంభం నుండి కథాంతం వరకూ అడుగడుగునా కథాగమనంతో ఒక ఘట్టం అయిన తరువాతి రెండవ ఘట్టం ప్రారభమయ్యే వ్వవధిలో ప్రత్యక్షమౌతూ వుంటాయి. ఆ పాత్రలే జుట్టుపోలిగాడు, బంగారక్క. ఈ రెండు పాత్రలూ హాస్యం ద్వారా, దీర్ఘ కాలం ప్రదర్శించే ప్రదర్శనంలో మధ్య మధ్య వారిని కడుపుబ్బ నవ్వించి నిద్రమత్తు వదలగొడుతూ వుంటాయి. ఈ పాత్రల హాస్యం బహు మోటుగా వుంటుంది. నవ్వుతో కడుపు చెక్కలయ్యే పనులు ఈ బొమ్మలతో చేస్తారు. సమాజంలో వున్న కుళ్ళును, ఈ బొమ్మలను అడ్డంగా పెట్టుకుని కుళ్ళగిస్తూవుంటారు. మధ్య మధ్య విసుర్లూ విసురుతూ వుంటారు.[3]
మరో బపూన్ అల్లాటప్పగాడు
మార్చుతోలుబొమ్మలాటల్లో హాస్యం ఎంతవర కెళ్ళిందో అల్లటప్పగాడి గురించి తెలుసుకుంటే బోధపడుతుంది. జుట్టుపోలిగాడు, బంగారక్క కాక వీడు మూడవ వాడు. వీడి పాత్ర ఎటువంటిదంటే 'తాడెక్కే వాడుంటే వాడి తలదన్నే వాడుంటాడనే సామెత ప్రకారం పైరెండు పాత్రలనూ తలదన్నేవాడు. ఈ అల్లాటప్పగాడు. ప్రదర్శనంలో బంగారక్కను గడసరి పెండ్లాంగా సృష్టిస్తారు. ఈమెకు, పోలిగాడికి నిరంతరం కయ్యం నడుస్తూ వుంటుండి. కాసేపు రెండు పాత్రలూ అతి విచిత్రంగా అసభ్య శృంగారాన్ని అభినయిస్తాయి. కొంచెంసేపు పోట్లాట, మరల రాజీ, ఇంతలో పోలిగాడు అంతర్థానం. ఈ సమయంలో అల్లటప్పగాడు బంగారక్క దగ్గర ప్రత్యక్షమౌతాడు. బంగారక్కకు, అల్లాటప్పకు సంబంధాన్ని కుదురుస్థాడు. రెండు పాత్రలూ మంచి శృంగారపు పట్టులో వుండగా మరో పాత్ర ప్రవేశిస్తుంది. అది కేతిగాని పాత్ర.[3]
కేతిగాడు
మార్చుకేతిగాడి పాత్ర అతి విచిత్రమైంది. అన్నీ బొమ్మలకన్నా కేతిగాడి బొమ్మ చిన్నది. ఎక్కడ బడితే అక్కడ, ఎప్పుడు బడితే అప్పుడు పానకంలో పుల్లలాగ ఒక అడుగు చోటు తెరమీద వుంటే చాలు హఠాత్తుగా ప్రవేశిస్తాడు. శృంగార ఘట్టంలో వున్న అల్లాటప్పగాణ్ణి టకీమని ఒక్క దెబ్బ కొడతాడు కేతిగాడు. వెంటనే అంతర్ధానమౌతాడు అల్లాటప్పా. ఇంకేముంది కేతిగాడు బంగారక్కను ఏడిపిస్తాడు. ఇలాంటి ఘట్టాలు ప్రదర్శనంలో వచ్చే వ్వవధిని కమ్మివేస్తూ వుంటాయి. చాలమంది ప్రేక్షకులు కథకంటే హాస్య పాత్రల ప్రవేశం కొరకే ఎదురు చూస్తూ వుంటారు. అందువల్లనే ప్రదర్శనం తెల్లావార్లూ ప్రదర్శించినా విసుగుజెందరు.
వానలు రాకపోతే, వాటమైన కిటుకు
మార్చుగ్రామాల్లో ముఖ్యంగా వ్యవసాయ తరుణం అయి పోయిన తరువాత ఈ బొమ్మలాటల ప్రదర్శనాలు జరుగుతూ వుంటాయి. బొమ్మలాటల్ని ప్రదర్శించడంలో జానపదులకు కొన్ని నమ్మకాలు కూడా ఉన్నాయి. వర్షాలు కురవక పోతే భారతంలోని విరాటపర్వం ఘట్టాన్ని హరికథగా గానీ, లేదా శ్రవణం ద్వారా గాని చేస్తే వర్షాలుపడతాయని పల్లె ప్రజల నమ్మకంఇ. ఉత్తర గోగ్రహణం కథ ఆడిస్తే వర్షాలు కురుస్తాయని, వర్షాలు లేని ప్రాంతంలో ఆ ఆటలను ఆడిస్తూ వుంటారు. ఆవిధంగానే పై కథలను తోలుబొమ్మలాట రూపంలో ప్రదర్శిస్తే వర్షాలు కురుస్తాయని పల్లె ప్రజల నమ్మికి.
అరవై దశకంలో తోలుబొమ్మలాట
మార్చుఅరవై దశకంలోనే ఈతోలుబొమ్మలాట అవసాన దశకుచేరుకున్నట్టు అర్థం మౌతూంది. ఎలాగంటే అంతవరకూ తోలుబొమ్మలాటలను మాపల్లెలో ఆడించండంటూ పల్లె పెద్దలు తోలు బొమ్మలాట కళాకారులను అభ్యర్థించేవారు. కొంతకాలానికి తోలుబొమ్మలాట కళాకారులు తమ ప్రయాణ ప్రస్థానంలో తారసపడిన పల్లె పెద్దలను నాశ్రయించి తాము తోలు బొమ్మలాట ఆడించడానికి అనుమతి కోరిన సందర్భాలలో వారి అనుమతి కొరకు వేసి వుండే సందర్భాలకు దిగజారి చాల కాలమే గడిచిపోయింది. ఆ పరిస్థితి కూడా గతించగా తోలుబొమ్మలాట ఆడించనిదే తమ జీవన భృతి లేదనే స్థాయికి దిగ జారి పోయారు ఆ కళాకారులు. అప్పటికే వీధినాటకాలు, డ్రామాలు, సినిమాలు, ఇతర వినోదాన్నందిచే అనేక ప్రక్రియలు మారుమూల నున్న పల్లె ప్రజలకు అతి సమీపంలోకి వచ్చాయి. ఆదరణ పొందాయి. పల్లెప్రజలు కూడా సాంఘికంగా, నాగరికంగా, విద్యావిషయంలో చాల అభివృద్ధి పొందారు. ఆ విధంగా ఆనాటి తోలుబొమ్మలాటలను, అందులోని హాస్యం, శృంగారం, ఇతర సంభాషణ చాతుర్యం చాల మొరటుగాను, జుగుప్సాకరంగాను అపహాస్యంగాను అనిపించ సాగాయి. అభివృద్ధి చెందిన పల్లెవాసులకు, అభివృద్ధి చెందిన ఇతర వినోద ప్రక్రియలు వైపు పల్లె ప్రజలు మొగ్గు చూపారు. పైగా తోలు బొమ్మలాట కళాకారులు అభివృద్ధి చెందుతున్న సమాజాని కనుగుణంగా తమ ఆటలను మార్పు చేయక తమ పాత పద్ధతిలోనే ఆటను కొనసాగించారు. అది పల్లె ప్రజలకు నచ్చక ఆ కళాకారులు నిరాధరణకు గురైనారు.[3]
ఆవిధంగా నిరాదరణకు గురైన కళాకారులు అంతవరకు తమ తోలు బొమ్మలాటకు సకల సౌకర్యాలు అనగా పందిలి, తెరలు, వేదిక, కళాకారుల భోజన సదుపాయాలు పల్లెవాసులే అమర్చిన స్థాయి నుండి కళాకారులే తామె స్వంతంగా తమకు కావలిసిన సరంజామానంత సమకూర్చుకొని ఎక్కడన్నా పెద్ద వేడుకలు, తిరుణాళ్లు, వంటి సందర్భాల ప్రదేశాలలకు వెళ్ళి వారి అనుమతితో అవసరమైతే వారికి కొంత పన్ను కట్టి, తమ స్యంత గుడారాన్ని ఏర్పాటు చేసుకొని అందులో టికెట్టు పెట్టి తమ కళను ప్రదర్శించేవారు. అలా ప్రదర్శింప బడ్డ ఒక తోలుబొమ్మలాట యాబై సంవత్సరాల క్రితమే చూడడం జరిగింది.
ప్రదర్శనా విధానం
మార్చుచిన్న సైజు గుడారాన్ని నిర్మించి, దానిని బట్టతో కప్పుతారు. దానికి ఒక ద్వారం ఉంటుంది. తోలుబొమ్మలాట చూడదలసిన వారు టికెట్టు తీసుకొని లోనికెళ్ళాలి. సుమారు ఇరవై ముప్పై మంది నిలబడడానికి మాత్రమే స్థలం వుంటుంది. కూర్చోడానికి లేదు. సుమారు ఒక గంట ప్రదర్శన. ఆ గుడారంలో ముందు సగ భాగం ప్రదర్శనకొరకు, ప్రేక్షకులకొరకు కేటాయించగా వెనక సగ భాగం ఆ కళాకారుల సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఉంటారు. అప్పట్లో ఆ తోలుబొమ్మలాటకు వచ్చేదెవరంటే కేవలం చిన్న పిల్లలు మాత్రమే. పెద్దలు మచ్చుకైనా ఒక్కరు కూడా రారు. దానిపైన పెద్దవారికి అంత చిన్నచూపు. ఆనాటికే తోలుబొమ్మలాట అంతరించి పోయిందంటే ఇంతకంటే రుజువు ఇంకేం కావాలి.[3]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Puppet Forms of India". Centre for Cultural Resources and Training (CCRT), Ministry of Culture, Government of India. Archived from the original on 2013-05-15. Retrieved 2016-01-27.
- ↑ "Andhra Pradesh". puppetryindia.org. Archived from the original on 2016-03-03. Retrieved 2016-01-27.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 తెలుగువారి జానపద కళారూపాలు (1992 ed.). తెలుగు విశ్వవిద్యాలయం,హైదరాబాదు: మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి. 1992. p. 720. Retrieved 27 January 2016.[permanent dead link]
- ↑ 4.0 4.1 సురవరము, ప్రతాపరెడ్డి (1950). ఆంధ్రుల సాంఘిక చరిత్ర (సాహిత్య వైజయంతి ప్రచురణ ed.). హైదరాబాదు. p. 317. Retrieved 27 January 2016.
{{cite book}}
: CS1 maint: location missing publisher (link) - ↑ 5.0 5.1 ఆంధ్రుల సాంఘిక చరిత్ర. హైదరాబాదు: సురవరము ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి. 1950. p. 54. Retrieved 26 January 2016.
ఇతర లింకులు
మార్చు- A tribute to the art of Indian puppetry and its practitioners
- ‘Tholu Bommalata’ loses sheen
- Tholu Bommalata
- tholubommalata in andhra bulletin
- video in youtube - Tholu Bommalata(Ramayana)
- you tube video - 'Tollu Bommalata'(ramayana)
- #ఫ్రెంచ్ #నిఘంటువు #తెలుగు #నిఘంటువు http://dictionaric.com/dictionary/telugu/french