ప్రతీకవాద ధోరణిలో రాయబడిన గొప్ప నాటిక కళ్ళు. గొల్లపూడి మారుతీరావు ఈ నాటిక రచయిత. రంగస్థలంపై ఎన్నో ప్రదర్శనలు జరుపుకొని, అనేక బహుమతులను పొందింది. 1975లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.[1]

నాటిక ఇతివృత్తం

మార్చు

తోడూ నీడా లేని ఓ అంధ ప్రపంచం. వారి మధ్య అల్లుకున్న అనుబంధాలు ఆప్యాయతలు అభిమానాలకు విలువకట్టే షరాబులేడు. ఎక్కడో పుట్టారు ఎలాగో పెరిగారు భిక్షాటన వృత్తిలో కలిసారు. ఎకరికి బాధ కలిగితే నాలుగు చేతులు కన్నీళ్లు తుడిచే స్థితికి ఎదిగిపోయారు.

పెద్దయ్య, కరీం, రాజీగాడు, రంగడు, సీతాలు కళ్లుండీ పేదలైన ఈ ప్రపంచంలో కళ్లులేని అభిమాన కోటీశ్వరులు. జానెడు పొట్ట నింపుకునేందుకు చేసే ఆకలి పోరాటంలో ఒకరికి మరొకరు కొండంత అండ. వీళ్ల అంధత్వాన్ని ఆసరాగా చేసుకొని వారిని తెలివాగా దోపిడీచేసే పూజారా బసవయ్య, సింహాచలం. ఇలా ఒక్కొక్క పాత్ర మన కళ్లకు కనిపిస్తారు.

భాక్షాటనతో వచ్చిన డబ్బలతో ఒకరికి కళ్లు తెప్పించాలని తద్వారా మిగిలిన జీవితాలను అదుకోవాలని నిర్ణయిస్తారు. వీరి హృదయపు పొరల్లో స్వార్థం ప్రవహించడంలేదు. అందుకే ప్రతావారూ తోటివాడికి కళ్లు రావాలని కోరుకుంటారు తమకు వచ్చిన అవకాశాన్ని తిరస్కరిస్తారు. ఒక్క రంగడికి తప్ప మిగిలిన వారెవరికి కళ్లు వచ్చే అవకాశమే లేదు. అందుకే తమలో ఉత్సాహంగా ఉన్నవాడు, క్షణక్షణం నవ్వుతూ నవ్విస్తూ తమపై కొండంత అభిమానాన్ని కురిపించే రంగడికి కళ్లు తెప్పించడానికి నిర్ణయిస్తారు.

రంగడికి కళ్లు వస్తాయి. దృష్టి పరిసరాలపై పడుతుంది. తమ స్థితి, తిండి, దారిద్ర్యంతాండవిస్తున్న స్థితిని చూస్తే అసహ్యం వేస్తుంది. ఇన్నాళ్లూ ఏ మనుషులతో ఒకటిగా సహజీవనం చేశాడో, ఆ మనుషుల బాహ్యమైన స్థితి ఏవగింపు కలిగిస్తుంది. తాము తినకుండా తనకోసం దాచివుంచే పాచి రొట్టను చూసి వాంతి చేసుకుంటాడు. పూజారి బసవయ్య చేస్తున్న మోసాన్ని చూసి రంగడిలో స్వార్థం మొలకెత్తుతుంది. రంగడి కళ్లతో లోకాన్ని చూడాలనుకునే నేస్తాలు రంగడి తెలివితేటలకు గర్వపడిపోతున్నారు కానీ మోసం కుబుసం విడిచి బుసలుకొట్టబోయే విషయాన్ని పసిగట్టలేకపోతారు. కళ్లున్న రంగడు కళ్లులేని మనుషులను అడ్డంపెట్టుకొని వ్యాపారంచేసే స్థాయికి ఎదుగుతాడు. నాలుగు రాళ్లు వెనకేసుకుంటాడు. అంహంకారం వంటికి పడుతుంది. తోబుట్టువులాగా కష్టసుఖాల్లో తోడుగా ఉన్న సీతను మానభంగం చేయబోతాడు. మానసంరక్షణ కోసం శేలాన్ని రంగడిపై విసురుతుంది. రంగడు తిరిగి గుడ్డివాడైపోతాడు. తాను అసహ్యించుకున్న మనుషులు తనను క్షమించి కలిసిపొమ్మని కోరినా వారి మంచితనాన్ని భరించలేని రంగడు వారినుండి శాశ్వతంగా విడిపోతాడు.

సినిమా

మార్చు

ఈ నాటిక ఆధారంగా 1988 సంవత్సరంలో కళ్ళు సినిమా తీయడం జరిగింది. దీనికి ప్రముఖ ఛాయాగ్రహకులు ఎం.వి.రఘు దర్శకత్వం వహించారు. దీనికి ఉత్తమ సినిమాగా నంది పురస్కారం లభించింది.

మూలాలు

మార్చు
  1. ఆంధ్రభూమి, సాహితి (3 October 2016). "అటకెక్కుతున్న నాటక రచన". andhrabhoomi.net. బి.నర్సన్. Archived from the original on 27 మార్చి 2020. Retrieved 27 March 2020.
  • తెలుగు నాటకరంగం నూతన ధోరణలు - ప్రయోగాలు, డా. కందిమళ్ల సాంబశివరావు