కృష్ణకుమారి (నటి)
కృష్ణకుమారి (మార్చి 6, 1933 - జనవరి 24, 2018) పాత తరం సినిమా కథానాయిక. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 25 సంవత్సరాలకు పైగా 150 పై చిలుకు చిత్రాల్లో నటించింది.[1] మూడు జాతీయ పురస్కారాలు, రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు అందుకుంది. కోల్ కతాలో జన్మించిన ఈమె తండ్రి ఉద్యోగరీత్యా పలుచోట్ల నివాసముంది. చెన్నైలో ఉండగా సినిమా రంగంలోకి ప్రవేశించింది. వివాహం తరువాత భర్తతో కలిసి బెంగుళూరుకు నివాసం మార్చింది.
కృష్ణకుమారి | |
---|---|
జననం | మార్చి 6, 1933 |
మరణం | జనవరి 24, 2018 |
వృత్తి | నటి |
జీవిత భాగస్వామి | అజయ్ మోహన్ |
పిల్లలు | 1 అమ్మాయి-దీపిక |
జీవిత సంగ్రహం
మార్చుతొలిరోజులు
మార్చుఈమె పశ్చిమ బెంగాల్ లోని 1933, మార్చి 6న నౌహతిలో జన్మించింది. వేదాంతం జగన్నాథ శర్మ దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది. షావుకారు జానకి ఈమెకు పెద్దక్క. మరో అక్క దేవకి కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించింది. కానీ ఆమె చిన్న వయసులోనే మరణించింది. నాన్నగారి ఉద్యోగరీత్యా తరచుగా బదిలీల మూలంగా ఈమె విద్యాభ్యాసం రాజమండ్రి, చెన్నై, అస్సాం, కలకత్తా మొదలైన ప్రదేశాలలో జరిగింది. మెట్రిక్ అస్సాంలో పూర్తయిన తర్వాత మద్రాసు చేరిన వీరి కుటుంబం అక్కడే సినీ అవకాశాలు రావడం జరిగింది.
సినీ జీవితం
మార్చుఒకసారి ఆమె తల్లితో సహా స్వప్నసుందరి సినిమా చూడడానికి వెళితే అక్కడకి సౌందరరాజన్ గారి అమ్మాయి భూమాదేవి కూడా వచ్చింది. సినిమా హాల్లో కృష్ణకుమారిని చూసిన ఆమె నవ్వితే నవరత్నాలు సినిమా కోసం అమాయకంగా కనిపించే కథానాయిక కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. తర్వాత రోజే వారు కృష్ణకుమారి ఇంటికి వచ్చి తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆమెకు ఆ పాత్రనిచ్చారు.
అలా తెలుగు సినిమా తెరకు 1951లో నిర్మించిన నవ్వితే నవరత్నాలు సినిమా ద్వారా పరిచయం అయ్యారు. కానీ దానికంటే ముందు మంత్రదండం అనే సినిమా విడుదలైంది. తొలి చిత్రంలో నటిస్తుండగానే ఆమెకు 14 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అప్పటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్ళు మాత్రమే. తర్వాత 1953లో తాతినేని ప్రకాశరావు యన్.ఎ.టి.వారి పిచ్చి పుల్లయ్యలో కథానాయిక వేషం వేయించారు. అందులో మంచి నటన ప్రదర్శించిన కృష్ణకుమారికి పినిశెట్టిగారి పల్లె పడుచు, బంగారు పాప వంటి మంచి చిత్రాలతో పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది.
తరువాత ఇలవేల్పు, జయ విజయ, అభిమానం, దేవాంతకుడు మొదలైన చిత్రాలలో వివిధ కథానాయకుల సరసన నటించినా, తన నటనకు గుర్తింపుతెచ్చిన చిత్రాలు కె.ప్రత్యగాత్మగారి భార్యాభర్తలు (1961), కులగోత్రాలు (1962). భార్యాభర్తలులో అభిమానం గల టీచరు శారదగా ఆమె చూపిన నటన ముఖ్యంగా శోభనం గదిలో భర్త సమీపించినప్పుడు చూపిన అసహనం, ఆ తరువాత వేడుకలో పాల్గొని 'ఏమని పాడిదనో యీ వేళ' అన్న వీణ పాట పాడినప్పుడు చూపిన భావాలు శ్రీశ్రీ పాట భావానికి చక్కని రూపాన్నిచ్చాయి. క్లిష్టమైన పాత్రకు న్యాయం చేసి పరిశ్రమ చేత ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకున్నారు.
1963లో లక్షాధికారి, బందిపోటు, ఎదురీత, కానిస్టేబుల్ కూతురు చిత్రాల్లో వైవిధ్యం ఉన్న పాత్రలు వేశారు. ప్రభుత్వ బహుమతి పొందిన జగపతీ పిక్చర్స్ వారి అంతస్థులులో నాయికగా నటించారు. 1967-68 మధ్యకాలంలో ఉమ్మడి కుటుంబం, భువనసుందరి కథ, రహస్యం, చిక్కడు దొరకడు, స్త్రీ జన్మ వంటి చిత్రాలలో వైవిధ్యమున్న పాత్రలు పోషించారు. వరకట్నంలో నాయికగా గ్లామరస్ పాత్ర తర్వాత చిత్రాలు తగ్గి 1970 దశాబ్దంలో కొన్ని చిత్రాలలో నటించగలిగారు.
మొత్తంగా సుమారు రెండు దశాబ్దాల నటజీవితంలో ఈమె సుమారు 150 సినిమాలలో నటించింది. వీనిలో ఎక్కువగా తెలుగు సినిమాలైతే, 15 కన్నడ చిత్రాలు, కొన్ని తమిళ భాషా చిత్రాలు. మూడు భాషల చిత్రాల్లోనూ ఆమే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఈమె ఆనాటి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, కృష్ణంరాజు, జగ్గయ్య, హరనాథ్, అందరు మహానటులతోను నటించి మెప్పించింది. కాంతారావుతో కలిసి 28 జానపద చిత్రాల్లో నటించింది.
బాలీవుడ్ లో కిశోర్ కుమార్ తో ఒకే ఒక సినిమాలో కథానాయికగా నటించింది. అప్పటికి హిందీ చిత్ర పరిశ్రమలో కృష్ణకుమారి పేరుతో వేరే నటి ఉండటంతో రతి అనే పేరుతో పరిచయం అయింది. దాని తర్వాత బాలీవుడ్ లో పలు అవకాశాలు వచ్చినా తెలుగు సినీ పరిశ్రమను వదిలి వెళ్ళలేదు. 1963 లో కృష్ణకుమారి 16 సినిమాల్లో కథానాయికగా నటించింది. ఒక్క ఏడాదిలో అత్యధిక సినిమాల్లో కథానాయికగా నటించడంలో ఆమె రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. ఇందుకోసం ఈమె మూడు నెలలపాటు మూడు షిఫ్టులు ఖాళీ లేకుండా పనిచేసింది.
వ్యక్తిగత విషయాలు
మార్చుకృష్ణకుమారి బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్‌ను పెండ్లాడింది.[2] ఈమెది ఒక రకంగా ప్రేమ వివాహము. ఈమె భర్త అజయ్ మోహన్ వ్యాపారవేత్త. అతని కుటుంబం వారు రాజస్థానీయులు. స్నేహితుల ద్వారా పరిచయమై అది 1969లో వివాహబంధంగా మారింది. వ్యాపారరీత్యా భర్త బెంగుళూరులో ఉండగా ఈమె కూడా మద్రాసు వీడి బెంగుళూరులో మకాం పెట్టారు. కొంతకాలం విరామం తర్వాత అత్తమామల ప్రోత్సాహంతో తిరిగి నటించడం మొదలుపెట్టింది. కృష్ణకుమారి దంపతులకు సంతానం కలగకపోవడంతో అనాథాశ్రమం నుంచి ఓ ఆడపిల్లను దత్తత తీసుకున్నారు. ఆమె పేరు దీపిక. తాము కొన్న భవంతికి దీపిక పేరే పెట్టుకున్నారు.[3]
బెంగుళూరిలో వీరికి ఐదెకరాల ఎస్టేటు ఉంది. ప్రశాంత వాతావరణం, చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలోని అందమైన ఇంట్లో ఈమె జీవితాన్ని సుఖంగా గడిపింది. వీరి అల్లుడు విక్రం మైయా, మనవడు పవన్. దీపిక తన తల్లి జీవిత చరిత్రను తెలిపే మై మదర్ కృష్ణకుమారి అనే పుస్తకాన్ని ఆవిష్కరించింది.[3]
ఈమెకు చిన్నప్పటినుండి భానుమతి అంటే భలే ఇష్టం. అందువలన ఆమెతో కలిసి కులగోత్రాలు, పుణ్యవతి సినిమాల్లో నటించినప్పుడు ఎంతో థ్రిల్ ఫీలయ్యారు. మహానటి సావిత్రి ఈమెను స్వంత చెల్లెల్లా చూసుకొనేది.
నటించిన కొన్ని సినిమాలు
మార్చు- ఫూల్స్ (2003) - అతిథి పాత్ర
- బంగారు భూమి (1982)
- గుణవంతుడు (1975)
- జేబు దొంగ (1975)
- యశోదకృష్ణ (1975)
- దేవదాసు (1974)
- నేరము శిక్ష (1973)
- మానవుడు - దానవుడు (1972)
- భార్యాబిడ్డలు (1971)
- తల్లా పెళ్ళామా (1970)
- వరకట్నం (1968)
- శ్రీకృష్ణావతారం - లక్ష్మణ (1967)
- చిలకా గోరింక (1966)
- అంతస్తులు (1965)
- చంద్రహాస (1965)
- గుడి గంటలు (1965)
- ఉయ్యాల జంపాల - శశిరేఖ (1965)
- ఉమ్మడి కుటుంబం
- డాక్టర్ చక్రవర్తి - డా. శ్రీదేవి (1964)
- ఆప్తమిత్రులు (1963)
- బందిపోటు (1963)
- చదువుకున్న అమ్మాయిలు - వాసంతి (1963)
- దిల్ ఏక్ మందిర్ (1963)
- ఇరుగు పొరుగు (1963)
- కణ్ కణ్ మే భగవాన్ (1963)
- లక్షాధికారి (1963)
- పునర్జన్మ (1963) -
- తిరుపతమ్మ కథ (1963)
- ఎదురీత (1963)
- కానిస్టేబుల్ కూతురు - జానకి (1962)
- హరియాలీ ఔర్ రస్తా (1962)
- కులగోత్రాలు - సరోజ (1962)
- మోహినీ రుక్మాంగద (1962)
- శ్రీశైల మహత్యం (1962)
- భార్యాభర్తలు (1961) -
- శభాష్ రాజా (1961)
- సంపూర్ణ రామాయణం - మండోదరి (1961)
- వాగ్దానం (1961)
- జబక్ (1961)
- బహానా (1960)
- దీపావళి (1960)
- మడ్ ముడ్ కే న దేఖ్ (1960)
- పెళ్ళి కానుక (1960)
- అభిమానం (1960)
- శాంతి నివాసం (1960)
- కులదైవం - శాంత (1960)
- పెళ్ళి మీద పెళ్ళి - లక్ష్మి (1959)
- గూంజ్ ఉఠీ షహనాయీ (1959)
- సమ్రాట్ చంద్రగుప్త (1958)
- జింబో (1958)
- జనమ్ జనమ్ కే ఫేరే (1957)
- వినాయక చవితి (1957)
- యహుదీకీ లడకీ (1957)
- హీర్ (1956)
- భగవత్ మహిమ (1955)
- షెహజాదా (1955)
- అంతా మనవాళ్ళే (1954)
- లాడ్లా (1954)
- నాగిన్ (1954)
- పిచ్చి పుల్లయ్య (1953)
- బైజూ బావరా (1952)
- జాల్ (1952)
- దామాద్ (1951)
- నవ్వితే నవరత్నాలు (1951)
పురస్కారాలు
మార్చుఈమెకు మూడుసార్లు జాతీయ అవార్డులు, రాష్ట్రస్థాయిలో నంది అవార్డులు వచ్చాయి. ఈమె కాంచనమాల, సావిత్రి, ఎన్టీయార్ అవార్డులు గెలుచుకున్నది. బ్రిటన్ లోని బర్మింగ్ హాం సంస్థ వారి లైఫ్ టైం అచీవ్‍ట్ అవార్డు పోందినది.
మరణం
మార్చుఅనారోగ్యంతో బాధ పడుతున్న కృష్ణకుమారి 2018, జనవరి 24 ఉదయం బెంగుళూరులో మరణించారు.[4]
మూలాలు
మార్చు- ↑ "అందంగా... అమాయకంగా... అభినయంలో అపురూపంగా". eenadu.net. బెంగుళూరు: ఈనాడు. Archived from the original on 25 January 2018. Retrieved 25 January 2018.
- ↑ మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 114.
- ↑ 3.0 3.1 "దివికేగిన అందాల తార". eenadu.net. బెంగళూరు: ఈనాడు. Archived from the original on 25 January 2018. Retrieved 25 January 2018.
- ↑ సాక్షి (24 January 2018). "కృష్ణకుమారి కన్నుమూత". Retrieved 24 January 2018.