చందా కాంతయ్య శ్రేష్ఠి

ఆచార్య చందా కాంతయ్య శ్రేష్ఠి (నవంబరు 28, 1904 - ఆగస్టు 26, 1967) సామాజికవేత్త, సంఘసంస్కర్త. వరంగల్లులోని పేద విద్యార్థులకు ఉన్నతవిద్య కోసం చందా కాంతయ్య మెమోరియల్ కళాశాలను, ప్రజలకోసం ఆసుపత్రులు స్థాపించి అనేకమందికి బాసటగా నిలిచాడు.[1]

చందా కాంతయ్య శ్రేష్ఠి
జననంచందా కాంతయ్య శ్రేష్ఠి
నవంబరు 28, 1904
వరంగల్ జిల్లా
మరణంఆగస్టు 26, 1967
వరంగల్ .
నివాస ప్రాంతంవరంగల్లు
ప్రసిద్ధిసామాజికవేత్త, సంఘసంస్కర్త
మతంహిందు
భార్య / భర్తరోహిణమ్మ
పిల్లలుఇద్దరు కుమారులు (విద్యానాథ్, విజయ్‌కుమార్‌), ఇద్దరు కుమార్తెలు
తండ్రిరత్నయ్య
తల్లిజగ్గమ్మ

చందా కాంతయ్య 1904, నవంబరు 28న వైశ్య కుటుంబానికి చెందిన రత్నయ్య, జగ్గమ్మ దంపతులకు వరంగల్లులో జన్మించాడు. రోహిణమ్మతో కాంతయ్య వివాహం జరిగింది.

సామాజికసేవ

మార్చు

పెద్ద కూతురు జననం సమయంలో నిజాం సర్కారియా హాస్పిటల్ ఇప్పటి చందా కాంతయ్య మెమోరియల్ ప్రసూతి దవాఖానలో గర్భిణీలకు కనీస అవసరాలు లేకుండేవి. ఆ పరిస్థితిని చూసిన కాంతయ్య రోగుల కోసం రెండు జనరల్ వార్డులు, నర్సులు, డాక్టర్ల కోసం క్వార్టర్లు కట్టించాడు. 1944లో కాళోజీ సోదరులు, మాదిరాజు రామకోటేశ్వర్‌రావు, వద్దిరాజు రాజేశ్వర్ రావు, తాండ్ర వెంకటరామనర్సయ్యలతో కలిసి యాభైవేల రూపాయలతో ఆంధ్ర విద్యాభివర్ధినీ పాఠశాలను ఏర్పాటుచేశాడు. 1945, నవంబరు 29వ తేదీన ఆంధ్ర విద్యాభివర్థినీ పాఠశాల ప్రారంభోత్సవం జరిగింది. పాఠశాల నిర్వాహణ కోసం ఇరువై వేలు ఇవ్వడంతోపాటు తనకున్న రైస్ మిల్లులో మూడు లక్షల రూపాయల విలువైన స్థిరాస్థిని ఆంధ్ర విద్యాభివర్థినీ సంఘం పేరుతో రిజిష్టర్ చేయించాడు.

నగరంలో భక్తి వాతావరణం ఏర్పాటుచేయడంకోసం బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి వంటి పండితులచేత ఆంధ్ర విద్యాభివర్థినిలోనూ, వరంగల్లుటోని ఇతర ప్రాంతాలలో భారత, భాగవతోపన్యాసాలను చేయించేవాడు. సిద్ధేశ్వర ఆలయంలో జ్ఞానమందిరం, రాధాస్వామి సత్సంగ్‌ కోసం ఒక భవనం కట్టించాడు. 1955లో ఈయన ప్రారంభించిన పోతన ఉత్సవాలు ఏవీవీ వేదికగా నాటినుంచి నేటివరకు ఘనంగా జరుగుతున్నాయి. ఈయన సామాజికసేవను గుర్తించిన నిజాం రాజు స్వయంగా పిలిచి దర్జే అవ్వల్ (నిజాం రాజ్య చంద్రమామ) అనే పురస్కారంతో సత్కరించాడు.

ఈయన వరంగల్ ప్రజలతో కలిసి కాశీయాత్రను చేశాడు. మూడు కంపార్ట్‌మెంట్లలో ప్రజలను తీసుకెళ్లి కాశీలో యాగాన్ని కూడా నిర్వహించాడు. ఆర్యవైశ్య సంఘాన్ని స్థాపించి వైశ్య హాస్టల్ నిర్మించడంతోపాటు వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయానికి ఆర్థిక సహాయం అందించాడు.[2]

ఇతర వివరాలు

మార్చు
  1. కాంతయ్య మరణానంతరం అప్పటి రాష్ట్రమంత్రిగా ఉన్న భారతదేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఈ దవాఖానకు కాంతయ్య పేరును పెట్టించాడు.
  2. గాంధీజీ వరంగల్‌కు వచ్చినపుడు భార్య రోహిణమ్మ వంటిపై ఉన్న నగలను, హైదరాబాదు ఆంధ్ర మహిళాసభలో జరిగిన కార్యక్రమానికి వచ్చిన జవహర్ లాల్ నెహ్రూకు ఐదు వేల రూపాయల విలువ చేసే ముత్యాలహారం విరాళంగా ఇచ్చాడు.
  3. ప్రతి సంవత్సరం వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో చందా కాంతయ్య జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతాయి. ఈసందర్భంగా కళాశాలలోని చందా కాంతయ్య విగ్రహాలనికి పూలమాలలు వేసి, నివాళులు అర్పిస్తారు.[3]

యజ్ఞయాగాదులు, అన్నదానాలు, చెరువులు తవ్వించడాలు, తీర్థయాత్రలు, విద్వద్గోష్ఠులు, వేదాంతసభలు నిర్వహించిన కాంతయ్య 1967, ఆగస్టు 26న మరణించాడు.

మూలాలు

మార్చు
  1. ఈనాడు, వరంగల్ (13 March 2019). "కాంతయ్య సేవలు స్ఫూర్తినీయం". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 5 December 2019. Retrieved 5 December 2019.
  2. నమస్తే తెలంగాణ, సంపాదకపేజీ వార్తలు (27 November 2019). "కర్మయోగి చందా కాంతయ్య". www.ntnews.com. మిద్దెల రంగనాథ్. Archived from the original on 27 November 2019. Retrieved 5 December 2019.
  3. నమస్తే తెలంగాణ (29 November 2019). "చందా కాంతయ్య సేవలు చిరస్మరణీయం". www.ntnews.com. Archived from the original on 5 December 2019. Retrieved 5 December 2019.