దువ్వూరి రామిరెడ్డి
దువ్వూరి రామిరెడ్డి (నవంబర్ 9, 1895 - సెప్టెంబర్ 11, 1947) రైతు కవి.[1] ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు దువ్వూరి రామిరెడ్డి. 'కవి కోకిల' మకుటాన్ని ఇంటిపేరులో ఇముడ్చుకున్న దువ్వూరి శైలి తెలుగు సాహిత్యంలో నవోన్మేషణమై నలుదిశలా వెలుగులు ప్రసరించింది. కలకండ వంటి కమ్మని కావ్యాలు, పలకరిస్తే అశుధారాపాతంగా జాలువారే పద్యపూరిత ప్రబంధాలే కాకుండా సంస్కృత, అరబిక్ భాషల నుంచి ఎన్నో పుస్తకాలను ఆంధ్రీకరించిన నవ్యరీతి దువ్వూరి ప్రత్యేకం. కేవలం కవిగానే కాకుండా గొప్ప విమర్శకులుగా కూడా సమానమైన ఖ్యాతి గడించారాయన. దువ్వూరి కలం నుంచి జాలువారిన సాహితీ సౌందర్యం గురించి వర్ణించి చెప్పడం కష్టం. మచ్చుకు ఒక్క రచన చదివితే తప్పించి ఆయన లోతైన అంతరంగం ఆవిష్కరించడం అంత సులభం కాదు. మృదు మధురమైన మాటలు, గంభీరమైన శైలి, అన్నిటికీ మించి ఆ రచనా చాతుర్యం చదువరులను ముగ్ధలను చేస్తాయి. కళ్ళను అక్షరాల వెంట పరుగులెత్తిస్తాయి. చెప్పవలసిన విషయాన్ని సూటిగా, నాటుకునేటట్టు చెప్పడం వల్ల దువ్వూరి విమర్శలు ఆనాటి యువతలో ఆలోచనాత్మకథోరణిని రేకెత్తించాయి. కవి, విమర్శకులుగానే కాకుండా న్యాయవాదిగా, నాటక రచయితగా, 'చిత్ర నళీయం' చలనచిత్ర సృష్టికర్తగా బహుముఖ కోణాల్లో ప్రతిభను చాటుకోవడం వల్ల దువ్వూరి పేరు సాహితీ పుటల్లో శాశ్వతస్థానం సంపాదించుకుంది. బహుభాషా కోవిదునిగా సంప్రదాయ రీతులను మిళితం చేసి కొత్తతరానికి సాహితీ బాటలు వేసిన దువ్వూరి, ఆధునికాంధ్ర కవుల్లో దువ్వూరి ముందు వరుసలో వుంటారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.
దువ్వూరి రామిరెడ్డి. | |
---|---|
జననం | దువ్వూరి రామిరెడ్డి. నవంబర్ 9, 1895 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గూడూరు]|[పెమ్మారెడ్డిపాళెం |
మరణం | ఏప్రియల్ 11, 1947 |
ఇతర పేర్లు | కవికోకిల "సింహపురి సిరి" |
ప్రసిద్ధి | రైతు, కవి |
సంతకం |
జీవిత విశేషాలు
మార్చుదువ్వూరి రామిరెడ్డి (నవంబర్ 9, 1895 -- సెప్టెంబర్ 11, 1947) కవికోకిల అని ప్రసిద్ధుడైన తెలుగు కవి. రైతు కవి అయిన ఇతనిని "సింహపురి సిరి"గా పండితులు కొనియాడారు. దువ్వూరి రామిరెడ్డి ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గూడూరులో 09-11-1895న జన్మించాడు. 23 సంవత్సరాలనాటికే ఎన్నో రచనలు చేశాడు. స్వయంకృషితోనే అనేక భాషలలో పండితుడయ్యాడు. 11-09-1947న మరణించాడు.
రచన లు
మార్చు- వన కుమారి
- కృషీవలుడు (1924) - వ్యవసాయదారుని గురించిన పద్యకావ్యం.
- పానశాల (1926) - ఉమర్ ఖయ్యామ్ రచించిన రుబాయిత్‌కు స్వేచ్ఛాతెలుగు సేత. ఇది దువ్వూరి రామిరెడ్డి రచనలన్నింటిలోను ప్రసిద్ధము.
- రసిక జనానందము (ప్రబంధం)
- స్వప్నాశ్లేషము (ప్రబంధం)
- అహల్యానురాగాలు (ప్రబంధం)
- కృష్ణరయబారము (ప్రబంధం)
- నలజారమ్మ (కావ్యం)
- కర్షక విలాసం (నాటకం)
- మాతృశతకం
- జలదాంగన (నాటకం)
- యువక స్వప్నము (నాటకం)
- కడపటి వీడికోలు (నాటకం)
- సీతా వనవాసం (నాటకం)
- కుంభరాణా (నాటకం)
- మాధవ విజయం (నాటకం)
- నక్షత్రమాల
- నైవేద్యము
- కవిత్వతత్త్వ నిరూపణము
- రచనలనుండి ఉదాహరణలు
గనిమల తుంగకున్ గఱికకాడల కల్లిన సాలెగూళ్ళ స
న్నని పటికంపుమంచు పడి నాణెపు ముత్తెసరాల పోలికం
గనుగొన రమ్యమయ్యె రవికాంతుల దేలుచు, నిట్టి భావమో
హనపు నిసర్గశిల్పముల, హాలిక, త్రొక్కక దాటిపొమ్మికన్ . -- (కృషీవలుడు)
అంతము లేని యీ భువనమంత పురాతన పాంధశాల, వి
శ్రాంతి గృహంబు, నందు నిరుసంజలు రంగుల వాకిళుల్, ధరా
క్రాంతలు పాదుషాలు, బహురామ్ జమిషీడులు వేనవేలుగా
గొంత సుఖించి పోయిరెటకో పెరవారికి చోటొసంగుచున్ -- (పానశాల)
గతము గతంబె యెన్నటికి కన్నులగట్టదు, సంశయాంధ సం
వృతము భవిష్యదర్ధము, వివేకవతీ! ఒక వర్తమానమే
సతతమవశ్యభోగ్యమగు సంపద, రమ్ము విషాదపాత్రకీ
మతమున తావులేదు క్షణమాత్ర వహింపుము పానపాత్రికన్ -- (పానశాల)
సినిమారంగం
మార్చుఇతడు 1936లో సతీతులసి చిత్రానికి రచయితగా సినిమారంగ ప్రవేశం చేశాడు. చిత్రనళీయం సినిమాకు రచనతోపాటు దర్శకత్వం కూడా చేపట్టి సినీదర్శకుడైన మొదటి తెలుగుకవి అనే ఘనతను సాధించాడు. తరువాత తిరుపతి వేంకటేశ్వర మాహాత్మ్యం, పార్వతీ పరిణయము చిత్రాలకు కొన్ని పాటలను, పద్యాలను వ్రాశాడు. చివరగా సీతారామ జననం సినిమాకు మాటలను సమకూర్చాడు.[2]
సన్మానాలు
మార్చు- 1917లో, అనగా ఇతని 22వ యేటనే, సి.ఆర్. రెడ్డి అధ్యక్షతన జరిగిన ఒక సభలో స్వర్ణపతకం బహూకరించారు
- 1918లో ఇతని కావ్యం "వనకుమారి", విజయనగరం మహారాజు ఆస్థానంలోని కావ్యస్పర్ధలో ప్రధమ స్థానం పొందింది.
- 1929లో విజయవాడ ఆంధ్రమహాసభ ద్వారా కవికోకిల బిరుదు ప్రధానం
మూలాలు, వనరులు
మార్చు- ↑ "సాహితీ లోకంలో 'కవి కోకిల' - కె.వి. నాగేశ్వరరావు". Archived from the original on 2018-08-24.
- ↑ పైడిపాల (2010). "కనిపించని కవి వినిపించిన పాట". తెలుగు సినీగేయకవుల చరిత్ర (ప్రథమ ed.). చెన్నై: స్నేహ ప్రచురణలు. p. 40.
- శత వసంత సాహితీ మంజీరాలు - ప్రచురణ: ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సంఘం, విజయవాడ (2002) - ఇందులో "పానశాల" గురించిన ఉపన్యాసం వ్రాసినవారు కోట రాజశేఖర్.