నిర్మలా దేశ్ పాండే

భారత రాజకీయ నాయకుడు
(నిర్మలా దేశ్‌పాండే నుండి దారిమార్పు చెందింది)

ప్రముఖ గాంధేయవాది అయిన నిర్మలా దేశ్‌ పాండే (Nirmala Deshpande) (Devanagari: निर्मला देशपांडे) (అక్టోబరు 19 1929, మే 1, 2008) భారతదేశం లోని ప్రముఖ సామాజిక కార్యకర్త, రాజ్యసభ సభ్యురాలు. ఈమె మహారాష్ట్ర లోని నాగపూర్లో జన్మించింది. ఆమె తండ్రి ప్రముఖ మరాఠి రచయిత పి.వై. దేశ్‌పాండే. వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమంలోనూ, భారత్-పాక్ శాంతి యాత్రలోనూ, టిబెట్ సమస్య పరిష్కారంలోనూ చురుగ్గా పాల్గొంది. జీవితాంతం గాంధేయ మార్గానికి కట్టుబడి అవివాహితురాలిగానే కొనసాగింది[1][2]. సుమారు 60 సంవత్సరాలపాటు గాంధేయ భావాలతో కొనసాగి 2008, మే 1న ఢిల్లీలో 79వ యేట తుదిశ్వాస వదిలింది.

నిర్మలా దేశ్ పాండే
జననం(1929-10-19)1929 అక్టోబరు 19 / అక్టోబరు 19, 1929
మరణం2008 మే 1(2008-05-01) (వయసు 78)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సామాజిక సేవ

జీవనం

మార్చు

నిర్మలా దేశ్‌పాండే 1929, అక్టోబరు 29న మహారాష్ట్ర లోని నాగపూర్‌లో విమల, పి.వై.దేశ్‌పాండే దంపతులకు జన్మించింది. తండ్రి ప్రముఖ మరాఠీ రచయిత. విద్యాభ్యాసం స్థానికంగా నాగపూర్‌లోనే కొనసాగింది. నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచే ఎం.ఏ. పట్టా పొందినది.[3] 1997 ఆగష్టులో తొలిసారిగా రాజ్యసభకు నియమితురాలయింది. మళ్ళీ 2004 జూన్లో రెండవ సారి రాజ్యసభ సభ్యురాలిగా నియమించబడింది.[4]

సామాజిక ఉద్యమంలో పాత్ర

మార్చు

1952లో వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమం ద్వారా నిర్మలా దేశ్‌పాండే సామాజిక ఉద్యమంలో అడుగుపెట్టింది. వినోభాతో కలిసి 40,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఈ యాత్ర సమయంలో దాతలనుంచి అనేక వేల ఎకరాల భూములను సేకరించి పేద ప్రజలకు పంచిపెట్టారు.[5]

శాంతి యాత్రలు

మార్చు

కాశ్మీర్‌లో, పంజాబ్లో మతకలహాలు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు నిర్మలా దేశ్‌పాండే ఆ ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు శాంతి సందేశాలు అందించింది. 1996లో భారత్-పాకిస్తాన్ శాంతి సదస్సులో పాల్గొన్నది[6]. టిబెట్టు సమస్య పరిష్కారానికి కూడా తన వంతు కృషిచేసిన మహనీయురాలు నిర్మలా దేశ్‌పాండే.

రచనలు

మార్చు

నిర్మలా దేశ్‌పాండే హిందీలో అనేక నవలలు రచించింది. అందులో ఒకదానికి జాతీయ అవార్డు కూడా లభించింది. వినోబా భావే జీవిత చరిత్ర కూడా లిఖించింది.

  • ముఖ్యమైన రచనలు: [4]
    • వినోభాకే సాథ్ (హిందీ, మరాఠీ, తెలుగు, గుజరాతీ సంచికలు)
    • క్రాంతి కా రాహ్ పర్ (హిందీ, మరాఠీ సంచికలు)
    • చింగ్లింగ్ (హిందీ, మరాఠీ, తెలుగు, ఇంగ్లీష్ సంచికలు)
    • సీమంత్ (మరాఠీ)
    • వినోభా (మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ)
    • సేవాగ్రం తే సేవాగ్రం (మరాఠీ)
    • భగ్నమూర్తి (హిందీ)

అవార్డులు

మార్చు

2006లో నిర్మలా దేశ్‌పాండేను భారత ప్రభుత్వము పద్మవిభూషణ్ పురస్కారముతో సత్కరించింది. రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డు కూడా లభించింది[7].

జీవితమంతా గాంధేయవాదిగా ఉంటూ, సామాజికవాదిగా సేవలని అందించిన నిర్మలా దేశ్‌పాండే 79వ యేట 2008, మే 1న ఢిల్లీలో తుదిశ్వాస వదిలింది.

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Veteran Gandhian Nirmala Deshpande is no more". Indian Express. May 1, 2008. Archived from the original on 2012-10-11. Retrieved 2013-10-13.
  2. "Nirmala Deshpande - a gutsy Gandhian". DNA (newspaper). May 1, 2008.
  3. "Veteran Gandhian Nirmala Deshpande dead". CNN-IBN. May 1, 2008. Archived from the original on 2012-03-20. Retrieved 2013-10-13.
  4. 4.0 4.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-03-07. Retrieved 2008-05-02.
  5. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ 5
  6. [1]
  7. "Padma Awards". Ministry of Communications and Information Technology.