బెసెంట్ థియొసాఫికల్ కాలేజి
బెసెంట్ థియొసాఫికల్ కాలేజి (దివ్యజ్ఞాన కళాశాల) - మదనపల్లె పట్టణంలో డా.అనీ బిసెంట్ పేరిట స్థాపించిన కళాశాల. దక్షిణాంధ్రంలో మొదటి కళాశాల. దీన్ని మద్రాసు (చెన్నై) లోగల దివ్యజ్ఞాన సమాజం స్థాపించి నడుపుతోంది. ఇది బి.టి. కాలేజిగా ప్రసిధ్ధి చెందింది.
బెసెంట్ దివ్యజ్ఞాన కళాశాల | |
ఇతర పేర్లు | బి.టి.కాలేజి |
---|---|
పూర్వపు నామము | వుడ్ నేషనల్ కాలేజ్ |
నినాదం | Education as Service |
రకం | ప్రైవేటు |
స్థాపితం | 1917 |
అనుబంధ సంస్థ | శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం |
చిరునామ | గిరిరావు స్ట్రీట్, బెంగళూరు రోడ్డు, మదనపల్లె, ఆంధ్రప్రదేశ్, 517325, భారతదేశం |
కాంపస్ | గ్రామీణ |
జాలగూడు | btcollege.org |
చరిత్ర
మార్చుఈ కళాశాల రాయలసీమ విద్యారంగంలో ఒక మైలురాయిగా నిలిచింది. ప్రజా ఉద్యమాలకు, స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తిని అందించిన గొప్ప వేదికగా ఈ కళాశాలను పేర్కొనవచ్చు. దివ్యజ్ఞాన సమాజం ప్రచారానికి అనిబిసెంట్ 1893లో భారతదేశానికి వచ్చింది. బ్రిటిషు ప్రభుత్వ దురాగతాలు, భారతీయుల పేదరికం, నిరక్షరాస్యతను చూసి ఆమె చలించిపోయింది. స్వాతంత్ర్యం కోసం పోరాడాలని ఆమె నిర్ణయించుకుని హోంరూల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. దివ్యజ్ఞాన సమాజం తరఫున పాఠశాల స్థాపన కోసం ఆమె చిత్తూరు జిల్లా మదనపల్లెకు వచ్చింది. ఈ ప్రాంతంలో విద్యావ్యాప్తికి అనిబిసెంట్ చేసిన సేవలు మరువలేనివి. ఈమె రాయలసీమలో మొట్టమొదటి దివ్యజ్ఞాన కళాశాలను 1915, జూలై 19న స్థాపించింది.[1][2]
మొదట ఈ కళాశాల మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది. ఈ కళాశాల కేంద్రంగా అనిబిసెంట్ హోమ్‌రూల్ ఉద్యమాన్ని నడిపింది. ఈ ఉద్యమం నడుపుతున్నందుకు ఆమెను బ్రిటిషు ప్రభుత్వం ఊటీలో అరెస్టు చేసింది. దానికి నిరసనగా మదనపల్లెలో కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఇది, జాతీయోద్యమంలో విద్యార్థులు నేరుగా పాల్గొన్న మొదటి సంఘటన. అనిబిసెంట్‌ను ఆ తర్వాత విడుదల చేసినప్పటికీ కళాశాలను మద్రాసు విశ్వవిద్యాలయం అనుబంధం నుండి తొలగించారు. దీనికి వెరువక అనిబిసెంట్ కళాశాల పేరును ఉడ్ నేషనల్ కాలేజీ అని పేరు మార్చి మద్రాసులో ఆమె స్థాపించిన నేషనల్ యూనివర్సిటీకి అనుబంధంగా చేర్చింది. ఆ యూనివర్సిటీకి రవీంద్రనాధ టాగూరు ఛాన్స్‌లర్‌గా వ్యవహరించాడు.
1919లో టాగూరు ఈ కళాశాలను సందర్శించాడు. ఈ సందర్భంగా ఇతడు ఇక్కడ జనగణమన గేయాన్ని బెంగాలీ భాష నుండి ఇంగ్లీషులోనికి అనువదించాడు. ఈ గేయానికి కళాశాల ప్రిన్సిపాల్, ఐరిష్ కవి జేమ్స్ కజిన్స్ భార్య మార్గరెట్ కజిన్స్ బాణీని కూర్చింది. ఆ విధంగా ప్రస్తుతం మనం ఆలపించే రీతిలో జాతీయగీతం ఈ కళాశాల నుండే పాడటం ప్రారంభమయ్యింది.[3]
1927లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రారంభమైన తర్వాత ఈ కళాశాల ఆ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మారింది. కానీ 1929లో అధికార పరిధి పునర్విభజన కారణంగా ఈ కళాశాల మళ్ళీ మద్రాసు విశ్వవిద్యాలయం పరిధిలోనికి వచ్చింది. 1956 నుండి ఈ కళాశాల తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్నది.
ఈ కళాశాలను సందర్శించిన ప్రముఖులలో హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ, కమలాదేవి ఛటోపాధ్యాయ, సరోజినీ నాయుడు, మహాత్మా గాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణన్, బాబూ రాజేంద్రప్రసాద్, వి.వి.గిరి, సి.వి.రామన్, సి.పి.రామస్వామి అయ్యర్, మీర్జా ఇస్మాయిల్, టంగుటూరి ప్రకాశం మొదలైన వారున్నారు.
పూర్వవిద్యార్థులు
మార్చుపూర్వ అధ్యాపకులు
మార్చు- మార్గరెట్ కజిన్స్
- వల్లంపాటి వెంకటసుబ్బయ్య
మూలాలు
మార్చు- ↑ విలేకరి (14 July 2014). "మదనపల్లె బిటి కళాశాలకు వందేళ్లు" (PDF). విశాలాంధ్ర దినపత్రిక. Retrieved 21 June 2020.[permanent dead link]
- ↑ https://www.thehindu.com/features/friday-review/a-historic-journey/article6245726.ece
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-06-19. Retrieved 2020-06-21.