భారతీయ చిత్రకళ
భారతీయ చిత్రకళ (ఆంగ్లం: Indian Painting) ప్రాచీనమైన చరిత్ర కలది.[1] క్రీ.పూ 5500 లోనే మధ్య ప్రదేశ్ లోని రాయ్‌సేన్ జిల్లాకి చెందిన భీమ్‌బేట్కా శిలా గుహలు పై చిత్రపటాలు మొలచబడ్డాయి.[2] బౌద్ధమత సాహిత్యమంతనూ చిత్రపటాలు గల రాజభవనాలు, సైనిక భవనాలు గురించి వివరించబడిన ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి. అయితే అజంతా గుహలలో గల చిత్రపటాలు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకొన్నవి. మధ్య యుగానికి చెందిన వివిధ రాతప్రతులలోనూ చిత్రకళ ఆనవాళ్ళు ఉన్నాయి. పర్షియన్ సూక్ష్మచిత్రకళ భారతీయ సాంప్రదాయిక చిత్రకళతో సంగమించి మొఘల్ చిత్రకళ అవతరించింది. 17వ శతాబ్దంలో ఈ శైలి దేశంలోని అన్ని మతాలకి చెందిన రాజ్యాలకి విస్తరించి స్థానిక సొబగులని అద్దుకొన్నది. తెల్లదొరల కోసం కంపెనీ కలం అవతరించటంతో బ్రిటీష్ సామ్రాజ్యం 19వ శతాబ్దంలో పాశ్చాత్య ప్రభావం గల కళా విశ్వవిద్యాలయాలని నెలకొల్పినది. ఈ స్థాపనలు ఆధునిక భారతీయ చిత్రకళా శైలికి ప్రాణం పోయటం ఇవి మరల భారతీయ మూలాలకే తిరిగి వెళ్ళటానికి మొగ్గు చూపటం విశేషం.[3]
భారతీయ చిత్రకళ ప్రాచీన నాగరికతకి ప్రస్తుత కాలానికి మధ్య గల వైరుధ్యాన్ని ప్రతిబింబించే ఒక అందమైన కళా స్రవంతి. తొలుత దీని ప్రాథమిక ఉద్దేశం మతమే అయిననూ తర్వాతి కాలంలో ఇది వివివిధ సంస్కృతులు, సంప్రదాయాల కలయికకి నిలువుటద్దంలా నిలచింది.
చరిత్ర
మార్చుభీంబేట్కా శిలా గుహల పై చిత్రలేఖనాలతో భారతీయ చిత్రకళ యొక్క చరిత్ర ప్రారంభం అవుతుంది. ఈ కాలంలో జానపద చిత్రలేఖనాలను లేప్యచిత్రాలుగా, వస్త్రాలపై (రంగులద్దిన) రేఖాచిత్రాలను లేఖచిత్రాలుగా, నేల పై వేసే చిత్రలేఖనాలను ధూళిచిత్రాలుగా వ్యవహరించారు.[1]
సింధు లోయ నాగరికత
మార్చుసింధు లోయ నాగరికత సమయం లోనే కళ, సాంకేతిక పతాక స్థాయిలో విసరించినవి. అప్పటి కుండల పై చిత్రీకరించిన ఆబ్స్ట్రాక్ట్ ఆర్ట్ నగిషీలు, వారి కళా ప్రేమ గురించి, నైపుణ్యం గురించి చెప్పకనే చెబుతాయి.[2]
ఆరు అంగాల చిత్రలేఖన సూత్రాలు
మార్చు7వ శతాబ్దంలో రచించబడ్డ విష్ణు ధర్మోత్తర పురాణం లోని చిత్రసూత్రం అనే విభాగంలో చిత్రలేఖనానికి ఆరు అంగాలు తా తెలుపబడింది. వీటినే షడంగాలు అన్నారు. అవి:
- రూపభేదం - ఆకారాల జ్ఞానం
- ప్రమాణం - కొలతలపై సరియైన అవగాహన
- భావం - ఆకారాల పై భావం యొక్క ప్రభావం
- లావణ్య యోగనం - కళలో లావణ్యాన్ని ఇనుమడింపజేయటం
- సదృశ్యం - సారూప్యత
- వర్ణికభంగ - కుంచెను రంగులను కళాత్మకంగా వాడటం
భీంభేట్కా శిలాగుహల పై చిత్రకళ
మార్చుమధ్య ప్రదేశ్ లోని భీమ్‌బేట్కా శిలా గుహలు పై చిత్రలేఖనాలు నవీన శిలా యుగంకు చెందినవని పురాతత్వ శాస్త్రజ్ఞులు తేల్చారు.[1] క్రీ.పూ 1200 నుండి 1000 వరకు ఈ చిత్రలేఖనాలు జరిగి ఉండవచ్చు. భాష లేని సమయంలో అప్పటి కాలం మానవుడు తన భావాలను వ్యక్తపరచటానికి, తన లోని సృజనాత్మకతను తెలుసుకొనటానికి ఈ చిత్రలేఖనాలు చేసి ఉండవచ్చు. మొదటి నాళ్ళలో అడవి దున్న, ఎలుగుబంటి, పులి వంటి జంతువులను చిత్రీకరించటం జరిగింది. ఇవి ప్రధానంగా ఎరుపు, తెలుపు రంగులలో చిత్రీకరించబడ్డా, అక్కడక్కడా ఆకుపచ్చ, పసుపు (రంగు)లు కూడా వాడబడ్డాయి. మగ పంది, ఏనుగు, ఖడ్గమృగం, జింక, పాము ఇతర పశువులను కూడా చిత్రీకరించటం జరిగింది.
తర్వాతి కాలంలో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించటం జరిగింది. ఒక క్రమమైన వరుసలో లేని మనుషులు నిలబడిన చిత్రలేఖనాలు కూడా ఉన్నాయి.
ఇవే కాక వేటాడే మనుషులు, నృత్యం, అలంకరణ వంటి చిత్రలేఖనాలను కూడా ఈ శిలా గుహలపై చూడవచ్చును. ఆదిమానవుడి సమయంలో ప్రాథమికంగా ఉన్న ఈ చిత్రలేఖనాలు, కాలానుగుణంగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి.
-
ఎరుపు రంగులో చిత్రీకరించిన ఒక మనిషిని తరుముతోన్న అడవి దున్న. అడవి దున్న పరిమాణం మనిషి కంటే పలుమార్లు ఎక్కువగా ఉండటం గమనించవచ్చు
-
తెలుపు రంగులో చిత్రీకరించబడ్డ ఒక ఏనుగు
-
గుర్రం పై స్వారీ చేస్తున్న ఒక మనిషి
-
ఒక యుద్ధ సన్నివేశం
అజంతా గుహలు
మార్చుక్రీ.పూ 0002 నుండి సా.శ. 0007 వ సంవత్సరం వరకు త్రవ్వక నిర్మాణం చేయబడ్డ అజంతా గుహలులో కుడ్య చిత్రాలు బౌద్ధ మతంకు సంబంధించినవి. మధ్య ప్రదేశ్ లోని సాంచి అనే ప్రదేశంలో శిల్పసంపదకు అనుగుణంగా గౌతమ బుద్ధుడు జీవిత చరిత్ర, ధ్యానం ద్వారా నిర్వాణాన్ని సాధించే మార్గాలు ఈ కుడ్య చిత్రాలలో చిత్రీకరించబడ్డాయి. భవిష్యత్తులో మరల మరల తిరిగి వచ్చే భారతీయ చిత్రలేఖన ప్రమాణాల (లయబద్ధమైన మానవ శరీర చిత్రీకరణ, చిత్రీకరణలో ప్రకృతి దృశ్యాల చేరిక, ప్రాముఖ్యతాధారిత పరిమాణం వంటి వాటి)ని ఈ కుడ్య చిత్రాలు స్థాపించినవి.[2]
-
బోధిసత్వ పద్మపాణి
-
బుద్ధుని జాతక చక్రం
-
ధ్యానిస్తోన్న బుద్ధుడు
-
కుడ్య చిత్రాలు
మధ్య యుగ చిత్రకళ
మార్చుఢిల్లీ సల్తనత్ కాలంలో రాజప్రాసాదాలలో, మసీదులలో పైకప్పు లోపలి భాగంలో వివిధ పుష్పాల, ఆకుల, మొక్కల చిత్రలేఖనాలు వేయబడ్డ దాఖలాలు ఉన్నాయి.[1] ఈ కాలంలో భారతీయ చిత్రకళ పై పర్షియన్/అరబిక్ చిత్రకళల ప్రభావం ఉండేది. అల్లావుద్దీన్ ఖిల్జీ (1296-1316) హయాంలో ఈ పైకప్పు చిత్రలేఖనాలతో బాటు సూక్ష్మచిత్రాలు, వస్త్రాల పై చిత్రలేఖనం కూడా చేయబడ్డవి. జైనుల సహాయ సహకారాల వలన 14-15 వ శతాబ్దంలో సూక్ష్మచిత్రాలు ఒక శక్తిమంతమైన ఉద్యమంగా ఎదిగి మధ్య, తూర్పు భారతదేశానికి పాకాయి.
మొఘల్ లు భారతదేశం పై దండెత్తిన సమయానికే ఇక్కడి చిత్రలేఖనానికి దానికంటూ ఒక ప్రత్యేక శైలి కలిగి ఉంది. అయితే అక్బర్ పర్షియన్ చిత్రకారులు అయిన మీర్ సయ్యద్ అలీ, అబ్దు సమద్ నాయకత్వంలో ముస్లిం పురాణాలు అయిన హంజానామ వంటి వాటిని 11,000 చిత్రలేఖనాలు చేయించాడు. ఈ చిత్రలేఖనాలలో పలు స్థానిక చిత్రకళాకారులు కూడా కృషి చేయటంతో ఒక సరిక్రొత్త కళ నెలకొంది. అక్బర్ స్థాయిలో కాకపోయినను అతని అనుయాయులు జహాంగీర్, షాజహాన్, దారసికోహ్ వంటి వారు కళను పెంచి పోషించారు. వీరు ప్రధానంగా సూక్ష్మచిత్రాల విస్తరణకు సహాయపడ్డారు. తర్వాత ఇవే మొఘల్ మినియేచర్స్ గా పేరెన్నిక గన్నాయి. మొఘల్ మినియేచర్స్ లో నిశితమైన వివరాలను చూసి పాశ్చాత్య చిత్రకారుడు రెంబ్రాండ్ట్ సైతం ముగ్ధుడైనాడు.[2] కళల పై ఏ మాత్రం ఆసక్తి లేని ఔరంగజేబు, కళలకు మద్దతును ఉపసంహరించుకోగా కళాకారులు జీవనోపాధికై రాజస్థాన్, హిమాలయాలు వంటి ఇతర ప్రదేశాలకు వలస వెళ్ళారు.
లడఖ్లో 15వ శతాబ్దంలో నిర్మించబడ్డ థిక్సె మొనాస్టరీలో బౌద్ధ మతానికి సంబంధించిన చిత్రలేఖనాలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలలో చిత్రలేఖనాలు దక్షిణ భారతదేశానికి కూడా విస్తరించాయి. కొట్టయం జిల్లా లోని పాండవుల గుడిలో పౌరాణిక చిత్రలేఖనాలు ఉన్నాయి. గుళ్ళలోనే కాకుండా ఇళ్ళ గోడల పై కూడా చిత్రలేఖనాలు వేయడం జరిగింది. బీహార్ లోని మధుబని జిల్లాలో వివాహ శుభకార్యానికి భార్యాభర్తల ఆదర్శానుబంధాన్ని సూచించుటకు, నూతన వధూవరుల గదుల గోడల పై సీతారాముల చిత్రపటాలను ఇప్పటికీ చిత్రీకరిస్తారు. మధ్య ప్రదేశ్ లోని రాథ్వా తెగకు చెందిన వారు కూడా వారి ఇళ్ళలోని గోడల పై ఇప్పటికీ చిత్రలేఖనాలు వేస్తారు.[2]
సూక్ష్మచిత్రాలు (మినియేచర్ పెయింటింగ్)
మార్చుచిన్నగా ఉన్ననూ, ప్రతి అంశాన్ని చూపుతూ ఏ విధమైన మాధ్యమాన్ని ఎంచుకొన్నదైననూ సూక్ష్మచిత్రంగా వ్యవహరించబడుతుంది.[4] వీటిని తాళ పత్రాలపై, వస్త్రాలపై, జంతు చర్మం, ఏనుగు దంతాలు, కాగితం వంటి వాటిపై చిత్రీకరించేవారు. తెల్లని ఉపరితలం పై మొదట రేఖాచిత్రం వేసి, దానికి రంగులు అద్దబడేవి. ఈ రంగులు సహజసిద్ధంగా పొందబడినవి, అనగా ఎరుపు రంగు లక్క నుండి, తెలుపు రంగు సున్నం నుండి, బూడిద నుండి నలుపు, పసుపు నుండి పసుపు రంగు, ఆకుల నుండి పసుపుపచ్చ రంగు, చివరగా చిత్రానికి బార్డర్లు వేసేవారు.
తూర్పు భారత చిత్రలేఖనం (పల చిత్రలేఖనం)
మార్చుబెంగాల్, బీహార్, ఒడిషా కేంద్రాలుగా 750వ సంవత్సరం నుండి 12వ శతాబ్దం వరకు పల రాజవంశపు హయాంలో వర్థిల్లిన చిత్రలేఖన శైలి.[4] బుద్ధుని జీవిత కథ అంశాలుగా ఈ శైలి చిత్రలేఖనాలు ఉండేవి. వీటినే అష్టసహస్రిక ప్రజ్ఞపరమిత అని వ్యవహరిస్తారు. కణతల వరకు పొడవైన కళ్ళు, వంపులు తిరిగిన, నల్లని ఔట్ లైన్లు, సరళమైన కూర్పులు, ప్రకాశవంతమైన రంగులు ఈ శైలి యొక్క ప్రధాన లక్షణాలు. 13వ శతాబ్దంలో ముస్లిం ఆక్రమణల వలన బౌద్ధారామాలపై దాడులు జరగటంతో ఈ శైలి మరుగున పడింది.
-
రెండు వేర్వేరు తాళ పత్రాలపై ఇరువైపులా శ్లోకాలతో కూడిన బుద్ధుని జీవిత ఘట్టాల చిత్రలేఖనాలు
-
బుద్ధుని ప్రసవించిన మహామాయ
-
బుద్ధిగా నడచుకొనువారికి వరాలను ప్రసాదిస్తున్న బోధిసత్వ
-
తన దేహాన్ని పున:సృష్టి చేస్తున్న బుద్ధుడు
-
త్రియస్తిమ స్వర్గం నుండి దిగివచ్చిన బుద్ధుని పలకరిస్తోన్న దేవతలు.
-
ధర్మచక్రం గురించి బోధిస్తోన్న బుద్ధుడు
-
ధ్యానిస్తున్న బుద్ధుని భంగపరచలేని మారాసురులు
-
బుద్ధుని పరినిర్వాణం
పశ్చిమ భారత చిత్రలేఖనం (జైన చిత్రలేఖనం)
మార్చు12-16వ శతాబ్దాలలో జైన మత గ్రంథాలను వివరిస్తూ గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాలు కేంద్రంగా చేయబడిన సాంప్రదాయిక చిత్రలేఖనాలను పశ్చిమ భారత లేదా జైన చిత్రకళగా గుర్తించబడింది.[5] ఈ శైలి చిత్రలేఖనం ఉత్తర ప్రదేశ్, మధ్య భారతదేశంలో కూడా కనబడతాయి. ఒడిషా వంటి రాష్ట్రాలలో ఈ శైలి ఈ నాటికి కూడా కనబడుతుంది. చాళుక్యులు ఈ శైలి చిత్రలేఖనం విస్తరణకు తోడ్పడ్డారు.[4] సరళమైన, ప్రకాశవంతమైన రంగులతో, సాంప్రదాయిక ఆకారాలతో, కోణాలు కలిగి ఉండటం ఈ శైలి ప్రధాన లక్షణాలు. పురాతన వాల్ పెయింటింగ్ ల లోని న్యాచురలిజం ఈ శైలిలో మచ్చుకైనా కనిపించదు. 13వ శతాబ్దంలో వేళ్ళూనుకొనిపోయి ఉన్న ఈ శైలి తర్వాతి 250 ఏళ్ళ వరకు ఎటువంటి మార్పులకు గురి కాలేదు. జైన మతం ప్రధానాంశంగా పార్శ్వనాథుడు, నేమినాథుడు, వృషభనాథుడు వంటి 20 తీర్థంకరుల చిత్రలేఖనాలు వేయబడినవి. ఇవి కూడా తాళపత్రాల పై, కాగితాల పై వేయబడ్డవి. వీటినే కల్పసూత్రగా వ్యవహరిస్తారు. ఈ శైలి చిత్రలేఖనంలో శరీరం ముందు వైపు నుండి, తల మాత్రం ఒక ప్రక్క నుండి చూపించబడుతుంది. ఈ చిత్రలేఖనాలలో కోటేరు లాంటి ముక్కు 8వ శతాబ్దానికి చెందిన శిల్పాలను పోలి ఉంటుంది. ముఖం ఒక ప్రక్క నుండి వేయబడ్డా, అవతలి వైపు కన్నును కూడా ముక్కుకు ముందువైపు చిత్రీకరించడం ఈ శైలిలో ఆనవాయితీ. ఆకారాలు వంపుకు గురి చేయటం, అతిశయించి చూపటం, (కళ్ళు, వక్షోజాలు, పిరుదులు పెద్దవిగా వేయటం), జానపద ప్రభావం ఎక్కువ కనబడటం ఈ శైలిలో ఇతర లక్షణాలు. ఈ శైలి చిత్రలేఖనం రాజస్థానీ చిత్రలేఖనానికి, మధ్య/పశ్చిమ భారతంలో పలు ఇతర శైలుల అభివృద్ధికి దోహద పడింది. 13వ శతాబ్దంలో ముస్లిం ఆక్రమణలతో ఈ శైలికి తెర పడింది.
-
మహావీరుని జన్మవృత్తాంతం
-
తండ్రి ఒడిలో బాల మహావీరుడు
-
దేవానందుడికి వచ్చిన 14 కలలు మహావీరుని జననం గురించి ముందే తెలిపిన దృశ్యం
-
మహావీరునికి నివాళులు అర్పిస్తున్న ఇంద్రుడు
-
కల్పసూత్రుల వీరోచిత గాథలు
పహారీ చిత్రకళ
మార్చుహిందీలో పహాడ్ అనగా కొండ. పహారీ చిత్రకళ హిమాలయాలు వద్ద ఉద్భవించిన పుస్తకాలలో వేయటానికి వీలుగా ఉండే ఒక సూక్ష్మ చిత్రలేఖన శైలి.[6] పహారీ శైలి చిత్రకళ, ప్రధానంగా బసోహ్లీ, కాంగ్రాలుగా విభజించవచ్చు.
బసోహ్లీ చిత్రకళ
మార్చురంగు, రేఖలలో బసోహ్లీ శైలి సాహసోపేతంగా ఉంటుంది.[7] 1690 లో నే రసమంజరి అనే పుస్తకంలో పరిపక్వత చెందిన బసోహ్లీ శైలి చిత్రలేఖనాలు ఉన్నాయి. ఎరుపు రంగు బార్డర్లు కలిగి, భవన నిర్మాణాల చిత్రలేఖనాలు కలిగి ఉండేవి. పెద్ద కన్నుతో ముఖం కుడి/ఎడమ వైపు చిత్రీకరించబడి ఉండేది. ప్రకాశవంతమైన రంగులను ఎంచుకోబడతాయి. ఉపరితలం పై ఎత్తుగా అనిపించే తెల్లని పెయింటుతో నగలు, ఆకు పచ్చ రంగుతో పచ్చలు వేయబడతాయి.
-
గణపతి
-
కాపరులతో సహా గోవులను కూడాఅ గుహలో దాచిన బ్రహ్మ
-
ద్వారకకు ఆకాశమార్గమున ఎగిరి వెళుతోన్న ప్రద్యుమ్న, మాయావతులు
-
మిత్రులతో వెన్నను దొంగలిస్తోన్న చిన్ని కృష్ణుడు
కాంగ్రా చిత్రకళ
మార్చుబాసోహ్లీ శైలిలో రంగులు తీవ్రంగా ఉంటే, కాంగ్రాలో సున్నితంగా ఉంటాయి.[6] రాజస్థానీ చిత్రకళ వలె పహారీ చిత్రకళలో కూడా కృష్ణుడు పై చిత్రలేఖనాలు ఉంటాయి. అతి ప్రాచీన కాంగ్రా చిత్రలేఖనాలు, బసోహ్లీ భాషలో 1690 లో నే ఉన్నాయి. అయితే మొఘల్ చిత్రకళలో శిక్షణ పొంది ఉన్న అనేక కళాకారులకు ఔరంగజేబు హయాంలో ఉద్వాసనకు గురి కావటంతో వారు జీవనోపాధికై ఢిల్లీ వదిలి ఇతర ప్రదేశాల (హిమాలయాల) కు బయలుదేరారు. బసోహ్లీ ముఘల్ చిత్రకళను వ్యతిరేకించిననూ, కాంగ్రా పై మాత్రం ఆ ప్రభావం అలాగే ఉండిపోయింది. కాంగ్రాలో రంగుల తీవ్రత తగ్గి ఉండటమే కాక, ప్రకృతి సన్నివేశాలు, దృక్కోణాలు సహజసిద్ధంగా ఉండటం, రేఖలు కూడా సున్నితంగా, చక్కగా ఉండటం గమనించవచ్చు. 1770 నాటికి కాంగ్రా శైలి చిత్రకళ పతాక స్థాయి చేరుకొంది. రాజా సంసార్ చంద్ మద్దతుతో ఒక వెలుగు వెలిగింది. కాంగ్రా ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా ఈ శైలి చిత్రకళ చుట్టుప్రక్కల ఉన్న ఇతర ప్రదేశాలకు వ్యాపించింది. భాగవత పురాణం, గీత గోవిందం లోని రాధా-కృష్ణుల చిత్రపటాలు, రాగమాల ధారావాహికలు, పర్వత అధినేతలు, వారి కుటుంబీకులు ఈ శైలిలో చిత్రీకరించబడేవి. 1800 తర్వాత ఈ శైలిలో చిత్రలేఖనం సన్నగిల్లింది.
-
కాళీయుని సంహరిస్తోన్న కృష్ణుడు
-
వంట చేస్తోన్న ఒక మహిళ
-
ఛిన్నామస్తకి
-
దాక్షాయని
-
పద్మాసనులు అయిన లక్ష్మి, విష్ణువులు
ఆధునిక చిత్రకళ
మార్చు1707 లో ఔరంగ జేబు మృతి తర్వాత, భారతదేశం లోకి అడుగు పెట్టేందుకు డచ్, ఫ్రెంచి, బ్రిటీషు వారికి అవకాశం దక్కింది.[3] 18వ శతాబ్దం అంతానికికల్లా కోల్‌కాతా కేంద్రంగా ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది. కంపెనీ ఉద్యోగులతో బాటు, పలు లలిత కళాకారులు కూడా భారత్ కు రావటం జరిగింది. థామస్ డేనియల్, విలియం డేనియల్ లు భారతదేశానికి చెందిన పలు స్కెచ్లు వేయగా, వీటిని కంపెనీ ఉద్యోగులతో బాటు, స్థానికులు కూడా కొన్నారు. ఈ విధంగా పాశ్చాత్య చిత్రలేఖన అంశాలైన దృక్కోణం, జలవర్ణ చిత్రకళ (water colors), ముద్రణ వంటివి భారతీయ కళాకారులకు పరిచయం అయ్యాయి.
కంపెనీ శైలి చిత్రకళ
మార్చుబలమైన రాజకీయ శక్తులుగా ఎదిగిన తెల్లదొరలు స్థానిక చిత్రలేఖనాలను వారి జ్ఞాపకాలుగా తమతో తీసుకెళ్ళాలి అనే కోరిక కలిగి ఉండే వారు. ఆర్థిక లాభం కోసం ఇటువంటి కళా ప్రేమికుల అభిరుచికి అనుసారం ఉద్భవించిన చిత్రకళనే తర్వాతి కాలంలో కంపెనీ శైలి చిత్రకళగా వ్యవహరించారు.[1] ఈ శైలి చిత్రకళకు ముషీరాబాద్, పాట్నా, కోల్‌కాతాలు కేంద్రాలుగా విలసిల్లాయి. 19వ శతాబ్దంలో థియోడర్ జెన్సన్ వద్ద తైలవర్ణ చిత్రలేఖనాలను, న్యాచురలిజం, దృక్కోణం వంటి పాశ్చాత్య చిత్రకళాంశాలను నేర్చుకొన్న రాజా రవివర్మ, పౌరాణిక దృశ్యాలను సైతం పాశ్చాత్య శైలిలో చిత్రీకరించాడు. పాశ్చాత్య కళాకారులు సైతం రవివర్మ చే చిత్రీకరించబడ్డ ఈ చిత్రపటాలను చూచి అసూయపడ్డారు. భారతీయులకు తమ ఆరాధ్య దైవాల ముఖాలను మొట్టమొదటగా క్యాలెండర్ల పై చూపబడటంతో ఈ చిత్రలేఖనాలు రవివర్మకు ఎనలేని ఖ్యాతిని తెచ్చాయి. అయితే ఈ చిత్రలేఖనాలలో భారతీయ భావం లోపించిందనే కళా విమర్శ కూడా ఉంది. ఒక వైపు భారతీయ చిత్రకళ పాశ్చాత్య ప్రభావానికి లోనైనను, ఇదే కాలావధిలో అభివృద్ధి చెందిన కాలిఘాట్ చిత్రకళ, నాథ్ ద్వారా చిత్రకళలు ఎలాంటి ప్రభావాలకు గురి కాకుండా, వేటికవి వాటి వాటి శైలులు అభివృద్ధి చేసుకొన్నాయి.[3] కంపెనీ శైలి చిత్రకళకు వ్యతిరేకత, బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనే సరిక్రొత్త శైలికి భాష్యం పలికింది.
-
బ్రిటీషు మిలిటరీకి చెందిన ఒక దొర
-
ఒక కంసలి
-
ముఘల్ వేషధారణలో ఒక పాశ్చాత్య స్త్రీ
-
కంపెనీ శైలిలో రాజారాం మోహన్ రాయ్
-
గంగా దేవి
బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్
మార్చు1850 లో కళను అభ్యసించటానికి బ్రిటీషు వారు మద్రాసు, బొంబాయి, కోల్‌కాతా నగరాలలో విశ్వవిద్యాలయాలు నెలకొల్పారు. సృజనాత్మకతను పెంపొందించే శైలికి మద్దతు పలకకుండా వారి పరిపాలనను విస్తృత పరచుకోవటానికి (జీవశాస్త్ర, సాంఘిక శాస్త్ర, సంస్కృతీ) దృశ్యాలను నమోదు చేసుకొనే దిశగా నే వారి ప్రేరణ సాగింది. 1896 లో కలకత్తా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కు ఇ.బి.హావెల్ ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టాడు. స్యయానా తానే చిత్రకారుడు అయిన హావెల్ దృష్టిలో భారతీయ చిత్రలేఖనం దృశ్య ప్రామాణికంగా కాకుండా, జ్ఞాపకాల ఆధారంగా సాగుతోందని అభిప్రాయపడ్డాడు. స్వాతంత్ర్య సమరం పతాక స్థాయిలో ఉన్న ఈ సమయంలోనే కళలలో భారతీయత ఎక్కడ ఉందనే ప్రశ్నకు మేధావుల బృందం రవీంద్రనాధ టాగూరుతో కలిసి సమాధానం వెదకసాగింది. ఈ మేధావుల బృందంలో టాగూరు కుటుంబానికి చెందిన అబనీంద్రనాథ్ ఠాగూరు కూడా ఒకరు. నిజమైన భారతీయ కళాకారుడు అబనీంద్రనాథ్ యే అని అభిప్రాయపడ్డ హవెల్ 1905 లో కలకత్తా స్కూల్ ప్రిన్సిపల్ నిర్వహణలో తనకు సహాయాన్ని అందించమని కోరాడు. హావెల్, అబనీంద్రనాథ్ సమష్టి కృషితో నే బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనే శైలి ఉద్భవించింది. 20వ శతాబ్దపు మొదటి రెండు దశకాలలో అబనీంద్రనాథ్ ఠాగూరు నాయకత్వంలో పాశ్చాత్య ప్రభావాలను ముమ్మాటికీ వ్యత్రిరేకించి, భారతీయ సంప్రదాలను ప్రతిబింబించే చిత్రకళా శైలి యే బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ గా వ్యవహరించబడింది. ఈ శైలి తూర్పు దేశాలకు కూడా విస్తరించి, అక్కడ కూడా కళలపై పాశ్చాత్య ప్రభావాలపై వ్యతిరేకతకు బీజం వేసింది. బెంగాల్ వాష్ టెక్నిక్ అనే సాంకేతికాంశం బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో ముఖ్యమైనది. దీనిని అబనీంద్రనాథ్ జపనీసు కళాకారుల మెళకువల నుండి గ్రహించాడు. దీని పై అబనీంద్రనాథ్ పలు ప్రయోగాలు చేసి, రంగులలో సున్నితత్వపు పాళ్ళు పెంపు, వెలుగు-నీడలను చిత్రీకరించే ప్రక్రియలో పరిపక్వత లను సాధించాడు.[3]
కాలిఘాట్ చిత్రకళ
మార్చుకాలిఘాట్ చిత్రకళ 19వ శతాబ్దంలో కోల్‌కాతా కేంద్రంగా ఉద్భవించిన ఒక చిత్రకళా శైలి.[8] విశాలమైన
కుంచె ఘతాలు, రంగుల వినియోగంలో నిర్మొహమాటం, అధిక ఉత్పత్తికి అనుకూలంగా ఉండే విధం ఈ శైలి యొక్క ప్రధాన లక్షణాలు. సాధారణంగా వీటి పరిమాణం 17/11 ఇంచిలు (43/28 సెం.మీలు) ఉంటుంది. నేపథ్యాలుగా ఎటువంటి రంగులు ఉండవు. దేవతల చిత్రలేఖనాలతో బాటు దైనందిన జీవిత దృశ్యాలను కూడా చిత్రీకరించబడతాయి. జైమిని రాయ్, అర్పితా సింగ్ వంటి వారి పై కాలిఘాట్ చిత్రకళ యొక ప్రభావం స్పష్టంగా కనబడుతుంది.
-
దుర్గా దేవి
-
ఝాన్సీ లక్ష్మీ బాయి
-
ఇరువురు సైనికులు
-
జాలరి చేతికి చిక్కిన మూడు చేపలు
ఇతర స్థానిక శైలులు
మార్చురెండవ ప్రపంచ యుద్ధం తర్వత భారత్ లో ప్రధానంగా మూడు స్థానిక శైలులు అభివృద్ధి చెందాయి.[3] అవి
- కలకత్తా గ్రూప్
- ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్ గ్రూప్ ఆఫ్ బాంబే
- మద్రాస్ ప్రోగ్రెసివ్ గ్రూప్
కలకత్తా గ్రూప్
మార్చురెండవ ప్రపంచ యుద్ధం, బెంగాల్ లో క్షామం నేపథ్యాలుగా ఈ బృందం ఏర్పడింది. గోపాల్ ఘోష్, నిరోధ్ మజుందార్, సుబ్రతో ఘో, రతన మైత్రా, పారితోష సేన్, రాం కింకర్ బైజ్ వంటి వారు ఈ బృంద సభ్యులు. దైవాల చిత్రీకరణకు కాలం చెల్లిందని, కళాకారులు కఠోర సత్యాలను ఎదుర్కోవాలని, మారుతోన్న సాంఘిక సత్యాలను ఆవిష్కరించాలని అభిప్రాయపడింది.
ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్ గ్రూప్ ఆఫ్ బాంబే
మార్చు1947 లో ఫ్రాన్సిస్ న్యూ డిసూజా, కె హెచ్ ఆరా, సయ్యద్ హైదర్ రజా, ఎం.ఎఫ్. హుసేన్, హెచ్ ఏ గాడే, సదానంద్ జీ కే బాక్రేలు బృంద సభ్యులుగా ఏర్పడింది. స్వతంత్ర భారతంలో ఏ భారతీయ చిత్రకారుడు, తన భారతీయతను ఋజువు చేసుకోవలసిన అవసరం లేదని, స్వదేశంలో నైనా, విదేశాలలో అయినా ఏ మూలం నుండైనా కళాకారుడు ప్రేరణ పొందవచ్చని చాటింది
మద్రాస్ ప్రోగ్రెసివ్ గ్రూప్
మార్చుమద్రాస్ ప్రోగ్రెసివ్ గ్రూప్ కే సీ ఎస్ పానికర్ స్థాపించాడు. 1950 నుండి ఈ బృందం క్రియాశీలకంగా ఉంది. జే సుల్తాన్ అలీ, ఎ కే సంతాన రాజ్, శ్రీనివాసులు దీని ఇతర సభ్యులు. కళాకారులందరూ కలిసి చోళమండల అనే ఒక గ్రామాన్నే నిర్మించుకొన్నారు.
భారతీయ చిత్రకారులు
మార్చు- సత్తిరాజు లక్ష్మీనారాయణ (బాపు)
- అంట్యాకుల పైడిరాజు
- అడివి బాపిరాజు
- ఆర్.కె.లక్ష్మణ్
- ఎం.ఎఫ్. హుసేన్
- కాపు రాజయ్య
- కొండపల్లి శేషగిరి రావు
- చింతపట్ల వెంకటాచారి
- దామెర్ల రామారావు
- నందికోళ్ల గోపాలరావు
- నందిని గౌడ్
- పాకాల తిరుమల్ రెడ్డి
- మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము
- రవీంద్రనాధ టాగూరు
- రాజా రవివర్మ
- లక్ష్మణ్ ఏలె
- లక్ష్మా గౌడ్
- వడ్డాది పాపయ్య
- సత్తిరాజు శంకర నారాయణ
- సి.ఎన్.వెంకటరావు
- రామ్‌కుమార్ (చిత్రకారుడు)
ప్రభావాలు
మార్చుకరోనా వైరస్
మార్చు- సాంప్రదాయిక భారతీయ చిత్రకళ పై కూడా 2020 లో కరోనా వైరస్ ప్రభావం చూపింది. ఇక్కడి చిత్రకారులు సృష్టించిన చిత్రపటాలలో మాస్కులు, సానిటైజేషన్, స్టే హోం థీంలు కనబడ్డాయి అంటే వైరస్ ప్రభావం కళ పైన ఏ మేరకు ఉందో బోధపడుతుంది.[9]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 Mallavarapu, Balalatha. "Origin of Painting in India". thehansindia.com. Retrieved 27 December 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 2.0 2.1 2.2 2.3 2.4 "Glimpses of Indian Painting (Part I - Traditions)". youtube.com. 2 April 2019. Retrieved 31 December 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 3.0 3.1 3.2 3.3 3.4 India, DD (Doordarshan) (3 April 2019). "Glimpses of Indian Painting: Search for Modernism (Part-II)". youtube.com. Retrieved 26 December 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 4.0 4.1 4.2 Group of Classes, Gati (17 June 2020). "CBSE CLASS XII PAINTING / FINE ARTS CHAPTER 1 || PALA AND JAIN SCHOOL OF ART || UNIT 1 CHAPTER 1". youtube.com. Retrieved 26 December 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Western Indian Painting". britannica.com. Retrieved 26 December 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 6.0 6.1 "Pahari painting". britannica.com. Retrieved 30 December 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Basohli Painting". britannica.com. Retrieved 30 December 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Kalighat Painting". britannica.com. Retrieved 30 December 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ భారతీయ చిత్రకళ పై కరోనా వైరస్ ప్రభావం