రామావతారము త్రేతాయుగములోని విష్ణు అవతారము. రాముడు హిందూ దేవతలలో ప్రముఖుడు. వాల్మీకి వ్రాసిన రామాయణం రాముని కథకు ప్రధానమైన ఆధారం. ఇంతే గాక విష్ణుపురాణములో రాముడు విష్ణువు ఏడవ అవతారము అని చెప్పారు. భాగవతం నవమ స్కంధములో 10, 11 అధ్యాయాలలో రాముని కథ సంగ్రహంగా ఉంది. మహాభారతంలో రాముని గురించిన అనేక గాథలున్నాయి. భారత దేశమంతటా వాల్మీకి రామాయణమే కాకుండా రామాయణానికి అనేక అనువాదాలు, సంబంధిత గ్రంథాలు, జానపద గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మధ్వాచార్యుని అనుయాయుల అభిప్రాయం ప్రకారం మూల రామాయణం అనే మరొక గ్రంథం ఉంది గాని ప్రస్తుతం అది లభించడం లేదు. వేదవ్యాసుడు వ్రాసినట్లు చెప్పబడే ఆధ్యాత్మ రామాయణం మరొక ముఖ్య గ్రంథం. 7వ శతాబ్దిలో గుజరాత్ ప్రాంతంలో నివసించిన భట్టి రచించిన "భట్టికావ్యం" రామాయణ గాథను తెలుపుతూనే వ్యాకరణ కర్త పాణిని రచించిన అష్టాధ్యాయిని, ప్రాకృత భాషకు సంబంధించిన అనేక భాషా విశేషాలను వివరిస్తున్నది. ఇతర భారతీయ భాషలలో ఉన్న కొన్ని ప్రధాన రచనలు - 12వ శతాబ్దికి చెందిన తమిళ కవి కంబర్ వ్రాసిన కంబరామాయణము; 16వ శతాబ్దికి చెందిన తులసీదాస్ రచన రామచరిత మానసము.
(ఇంకా…)
2వ వారం
మకర సంక్రాంతి
సంక్రాంతి లేదా సంక్రమణం అనగా "మారడం" అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 15 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఆంధ్రులకు, తమిళులకు పెద్ద పండుగ సంక్రాంతి.ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు ( భోగి, మకర సంక్రమణం, కనుమ) కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగోరోజు ముక్కనుమ ) జరుపుతారు కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతాయి. బుడబుక్కలవాళ్లు, పగటివేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. ఈ పండుగకు దాదాపు నెలరోజుల ముందునుంచే - ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మ లతో అలంకరిస్తారు. ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు.
(ఇంకా…)
3వ వారం
శ్రీ కృష్ణదేవ రాయలు
శ్రీకృష్ణదేవ రాయలు (1471 జనవరి 17 – 1529 అక్టోబరు 17) విజయనగర చక్రవర్తి. ఇతను 1509 ఫిబ్రవరి 4 న తన ఇరవై సంవత్సరాల వయసులో విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు, కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. ఆంధ్ర భోజుడుగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా, కన్నడ రాజ్య రమారమణగా అతడు కీర్తించబడినాడు. శ్రీకృష్ణదేవరాయలు సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించాడు. రాయలు తల్లి నాగలాంబ గండికోటను పాలించిన పెమ్మసాని నాయకులు ఆడపడచు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్, న్యూనిజ్ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4 న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలు నూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించాడు.
(ఇంకా…)
4వ వారం
భారత రాజ్యాంగ పీఠిక
భారత రాజ్యాంగానికి క్లుప్తమైన ప్రవేశికగా భారత రాజ్యాంగ పీఠికను రూపొందించారు. దీనినే రాజ్యాంగ ప్రవేశిక, ప్రస్తావన, మూలతత్వం, ఉపోద్ఘాతం, పరిచయం, ముందుమాట అని కూడా అంటారు. భారత రాజ్యాంగం ఈ పీఠికతోనే మొదలవుతుంది. భారతదేశ ప్రజలు దేశంపై ఉంచుకున్న ఆకాంక్షలు, ఆశయాలు, కోరికలు ఈ పీఠికలో స్పష్టమైన అక్షరాలలో తెలపబడ్డాయి. భారత రాజ్యాంగానికి ఆత్మగాను, హృదయంగాను పీఠికను పిలుస్తారు. మారుపేర్లలో ఒక పేరు మూలతత్వం, మరొకటి పరిచయం, ఇంకొకటి ఉపోద్ఘాతం - ఈ పదాలు వివరించిన విధంగానే పీఠిక రాజ్యాంగంలోని సర్వస్వానికి ఒక సారాంశంగా చెప్పుకోవచ్చు. 1949 నవంబర్ 26 న రాజ్యాంగ సభ పీఠికను ఆమోదించగా, 26 జనవరి 1950న అమలులోకి వచ్చింది. బేరూబారీ కేసు తీర్పులో భారత అత్యున్నత న్యాయస్థానం పీఠికను రాజ్యాంగంలో అంతర్గత భాగంగా గుర్తించరాదని చెప్పింది. అదే న్యాయస్థానం 1973లో కేశవానంద భారతి కేసులో అంతకు ముందు చెప్పిన తీర్పులోని వ్యాఖ్యను వెనక్కి తీసుకుంటూ రాజ్యాంగంలోని అయోమయాన్ని కలిగించే భాగాలలో స్పష్టత కోసం పీఠికను ఆధారం చేసుకోవాలని తీర్పు చెప్పింది. 1995లో భారత ప్రభుత్వం-ఎల్ఐసీ మధ్య నడిచిన కేసు తీర్పులో మరొకసారి, పీఠిక రాజ్యాంగంలో అంతర్గత భాగమని తెలిపింది. పీఠిక అసలు స్వరూపంలో సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారతదేశాన్ని గుర్తిస్తే, ఆ వాక్యానికి లౌకికవాద, సామ్యవాద పదాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి. పీఠిక పుటను, మిగతా రాజ్యాంగంతో సహా, ప్రసిద్ధ చిత్రకారుడు బెవహర్ రామ్మనోహర్ సింహా రూపొందించారు.
(ఇంకా…)
5వ వారం
బ్రోమిన్
బ్రోమిన్ రసాయన మూలకం. దీని సంకేతం Br, పరమాణు సంఖ్య 35. ఇది హలోజనుల గ్రూపులో మూడవ మూలకం. ఇది ఆవర్తన పట్టికలో 17వ గ్రూపుకు, 4వ పీరియడుకు చెందిన మూలకం. ఇది గది ఉష్ణోగ్రత వద్ద ఎరుపు-గోధుమ రంగులో గల ద్రవ పదార్థం. త్వరగా బాష్పీభవనం చెంది అదే రంగుగల వాయువుగా మారును. దీని లక్షణాలు క్లోరిన్, అయోడిన్ లకు మధ్యస్థంగా ఉంటాయి. ఇది ఇద్దరు రసాయన శాస్త్రవేత్తలైన కార్ల్ జాకబ్ లోవింగ్ (1825లో), ఆంటోనీ జెరోమి బాలార్డ్ (1826 లో) లచే స్వతంత్రంగా వేరుచేయబడింది. ఈ మూలక పేరు గ్రీకు పదమైన βρῶμος ("stench") నుండి వ్యుత్పత్తి అయినది. దీని అర్థం దాని పుల్లని, అంగీకరించని వాసనను సూచిస్తుంది. మూలక రూపంలోని బ్రోమిన్ చాలా చర్యాశీలతను కలిగి ఉంటుంది. ఇది ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో లభించదు. కానీ రంగులేని కరిగే స్ఫటికాకార ఖనిజ హాలైడ్ లవణాలలో, టేబుల్ ఉప్పుకు సమానంగా ఉంటుంది. భూపటలంలో ఇది చాలా అరుదుగా ఉన్నప్పటికీ, బ్రోమైడ్ అయాన్ (Br−) అధిక ద్రావణీయత సముద్రాలలో పేరుకుపోవడానికి కారణమైంది. వాణిజ్యపరంగా ఈ మూలకం ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్, చైనాలలోని ఉప్పునీటి కొలనుల నుండి సులభంగా తీయబడుతుంది. మహాసముద్రాలలో బ్రోమిన్ ద్రవ్యరాశి, క్లోరిన్ ద్రవ్యరాశిలో మూడు వందల వంతు ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద, ఆర్గానోబ్రోమైన్ సమ్మేళనాలు ఉచిత బ్రోమిన్ అణువులను ఇచ్చేందుకు విడదీయబడతాయి. ఈ ప్రక్రియ ఫ్రీ రాడికల్ రసాయన గొలుసు చర్యలను ఆపుతుంది. ఈ ప్రభావం ఆర్గానోబ్రోమైన్ సమ్మేళనాలను అగ్ని నిరోధకంగా ఉపయోగపడుతుంది.
(ఇంకా…)
6వ వారం
చార్లెస్ డార్విన్
చార్లెస్ రాబర్ట్ డార్విన్ (1809 ఫిబ్రవరి 12, – 1882 ఏప్రిల్ 19) ఇంగ్లాండుకు చెందిన ప్రకృతివాది. డార్విన్, ఒక ప్రకృతి శాస్త్రవేత్తగా, జియాలజిస్టుగా, బయాలజిస్టుగా, రచయితగా ప్రసిద్ధుడు. ఒక వైద్యుని వద్ద సహాయకుడిగాను, రెండేళ్ళ పాటు వైద్య విద్యార్థిగాను ఉన్న డార్విన్, ఆధ్యాత్మిక విద్య చదువుకున్నాడు. జంతు చర్మాల్లో గడ్డి లాంటి వాటిని కూరి వాటిని బ్రతికున్నవి లాగా కనబడేలా చేసే పనిలో శిక్షణ పొందాడు. ఇతను, భూమిపై జీవజాలము ఏ విధంగా పరిణామక్రమం చెందినది అనే విషయంపై పరిశోధనలు చేసి, జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అతని పేరును తలుచుకుంటే చాలు ఎవరికైనా సరే వెనువెంటనే గుర్తుకు వచ్చేది పరిణామ సిద్ధాంతం. ప్రకృతిలో జీవజాతులు తమ ఉమ్మడి పూర్వీకుల నుంచి క్రమానుగతంగా పరిణామం చెందుతూ ఏర్పడ్డాయని డార్విన్ వివరించాడు. ఈ సిద్ధాంతం సర్వత్రా ఆమోదం పొందింది. విజ్ఞాన శాస్త్రంలో ఇది ఒక మౌలికమైన భావనగా భావిస్తారు. ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ తో కలసి ప్రచురించిన పరిశోధనా పత్రంలో అతను, తన శాస్త్రీయ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం, ప్రకృతివరణం అని పిలిచే ఒక ప్రక్రియ వల్ల ఈ శాఖలుగా చీలడం జరుగుతూ వచ్చింది. చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం భూమి మీది జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. ఆధునిక జీవ శాస్త్రంలో డార్వినిజం చాలా మార్పు తెచ్చింది. మూఢ నమ్మకాలను వ్యతిరేకించడంలో కూడా డార్వినిజం కీలక పాత్ర పోషించింది. మనిషి ఒక రకమైన తోక లేని కోతి (వాలిడి) జాతి నుంచి పరిణామం చెందుకుంటూ వచ్చాడని, మనిషిని దేవుడు సృష్ఠించలేదన్న సిద్దాంతాన్ని తెర మీదకు తెచ్చింది.
(ఇంకా…)
7వ వారం
ఉత్తర ధ్రువం
ఉత్తరార్ధగోళంలో, భూమి భ్రమణాక్షం దాని ఉపరితలాన్ని కలిసే బిందువును ఉత్తర ధ్రువం అంటారు. దీన్ని భౌగోళిక ఉత్తర ధ్రువం అని, భూమి ఉత్తర ధ్రువం అనీ కూడా అంటారు. ఉత్తర ధ్రువం భూగోళంపై ఉత్తర కొనన ఉన్న బిందువు. ఇది దక్షిణ ధ్రువానికి సరిగ్గా అవతలి వైపున ఉంది. జియోడెటిక్ అక్షాంశం 90 ° ఉత్తరంను, అలాగే నిజమైన ఉత్తరం దిశనూ ఇది నిర్వచిస్తుంది. ఉత్తర ధ్రువం దగ్గర నుండి ఎటు చూసినా ఆ దిశలన్నీ దక్షిణమే; రేఖాంశాలన్నీ అక్కడ కలుస్తాయి, కాబట్టి, ఉత్తర ధ్రువ రేఖాంశం ఏది అంటే, ఏదైనా చెప్పవచ్చు. అక్షాంశ వృత్తాల వెంట, అపసవ్య దిశ తూర్పు, సవ్యదిశ పడమర అవుతాయి. ఉత్తర ధ్రువం ఉత్తర అర్ధగోళానికి మధ్యన ఉంది. దీనికి అత్యంత సమీపంలో ఉన్న నేల, గ్రీన్లాండ్ ఉత్తర తీరానికి 700 కి.మీ. దూరంలో నున్న కాఫెక్లుబ్బెన్ ద్వీపం అని అంటారు. అయితే, కొన్ని సెమీ శాశ్వత కంకర గుట్టలు ఇంకొంచెం దగ్గర లోనే ఉంటాయి. కెనడాలో, నూనావట్ లోని క్విక్తాలుక్ ప్రాంతంలోని అలెర్ట్, ధ్రువం నుండి అత్యంత దగ్గరలో మానవ నివాస స్థలం. ఇది ధ్రువం నుండి 817 కి.మీ. దూరంలో ఉంది. దక్షిణ ధ్రువం ఖండంలోని నేల ప్రాంతంలో ఉండగా, ఉత్తర ధ్రువం మాత్రం ఆర్కిటిక్ మహాసముద్రం మధ్యలో ఉంది. ఇక్కడి నీళ్ళు దాదాపుగా శాశ్వతంగా సముద్రపు మంచుతో కప్పబడి ఉంటాయి. ఈ మంచు కూడా కదులుతూ ఉంటుంది. ఉత్తర ధ్రువం వద్ద సముద్రం లోతు 4,261 మీటర్లని 2007 లో రష్యన్ మీర్ సబ్మెర్సిబుల్ కొలిచింది. 1958 లో USS నాటిలస్ కొలిచినపుడు ఇది 4,087 మీటర్లుంది.
(ఇంకా…)
8వ వారం
హ్యూస్టన్
హ్యూస్టన్ అమెరికాలో పెద్ద నగరాలలో నాల్గవది అంతేకాక టెక్సాస్ రాష్ట్రంలోని అతి పెద్ద నగరం. 2000ల జనాభా లెక్కల ప్రకారం 600 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో 22 లక్షల జనాభా ఉన్నట్లు అంచనా. హ్యూస్టన్ నగరం హర్రీస్ కౌటీ యొక్క నిర్వహణా కేంద్రం. గ్రేటర్ హ్యూస్టన్‌గా పిలవబడే ఈ నగరం 56 లక్షల జనాభాతో అమెరికాలోనే అతి పెద్ద మహా నగరమైన హ్యూస్టన్-షుగర్ లాండ్-బేటౌన్ లకు వ్యాపార కేంద్రం. హ్యూస్టన్ నగరం 1836 ఆగస్టు 30వ తారీఖున ఆగస్టస్ చాప్మెన్ అలెన్, జాన్ కిర్బ్య్ అలెన్ సోదరులచే స్థాపించ బడింది. 1837 జూన్ 5 నుండి గుర్తింపు పొంది రిపబ్లికన్ ఆఫ్ టెక్సాస్ ప్రెసిడెంట్ జ్ఞాపకార్ధం హ్యూస్టన్ పేరుతో వ్యవహరించబడసాగింది. శామ్ హ్యూస్టన్ జనరల్‌గా ఉన్న కాలంలో ఈ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో బాటిల్ ఆఫ్ శాన్ జాసిన్టో యుద్ధానికి నాయకత్వం వహించం విశేషం. హార్బర్, రైల్ పట్టాల కర్మాగారంతో 1901లో ఆయిల్ నిలువలు కనిపెట్టడం నగరజనాభా క్రమాభివృద్ధికి దోహదమైంది. ఆరోగ్య సంబంధిత పరిశోధనలకు, పరిశ్రమలకు అంతర్జాతీయ కేంద్రమైన టెక్సాస్ మెడికల్ సెంటర్ , మిషన్ కంట్రోల్ సెంటర్ ఉన్న ప్రాంతాలలో స్థాపించబడిన నాసాకు చెందిన స్పేస్ సెంటర్ ఈ నగరంలోనే మొట్టమొదటిగా ప్రారంభించబడ్డాయి. హ్యూస్టన్ నగరం ఆర్థికరంగం ఇక్కడ అధికంగా స్థాపించబడిన విద్యుత్, వస్తుతయారీ, ఏరోనాటిక్స్, రవాణా, ఆరోగ్య సంబంధిత వస్తు తయారీ కర్మాగారాలపై ఆధారపడి ఉంది. వాణిజ్య పరంగా ఇది గమ్మావరల్డ్ సిటీలలో ఒకటిగా గుర్తించబడింది. ఆయిల్ సంబంధిత వస్తు తయారీలో ఈ నగరం అగ్ర స్థానంలో ఉంది. ఈ నగరంలోని పోర్ట్ ఆఫ్ హ్యూస్టన్ హార్బర్ అమెరికాలో అంతర్జాతీయ జలరవాణాలో మొదటి స్థానంలో ఉంది.
(ఇంకా…)
9వ వారం
వాకాటకులు
వాకాటక రాజవంశం సా.శ. 3వ శతాబ్దం మధ్యలో దక్కనులో ఉద్భవించిన పురాతన రాజవంశం. వారి రాజ్యం ఉత్తరాన మాల్వా, గుజరాత్ ల దక్షిణపు అంచుల నుండి దక్షిణాన తుంగభద్ర నది వరకు, పశ్చిమాన అరేబియా సముద్రం నుండి తూర్పున ఛత్తీస్‌గఢ్ అంచుల వరకు విస్తరించి ఉందని భావిస్తున్నారు. వారు డెక్కన్‌లోని శాతవాహనుల వారసుల్లో అత్యంత ముఖ్యమైన వారు. ఉత్తర భారతదేశంలోని గుప్తులకు సమకాలికులు. వాకాటక వంశీకులు బ్రాహ్మణులు. ఈ వంశ మూలపురుషుడైన వింధ్యశక్తి గురించి చాలా తక్కువగా తెలుసు (సుమారు సా.శ. 250 – 270). అతని కుమారుడు మొదటి ప్రవరసేన పాలనలో రాజ్య విస్తరణ ప్రారంభమైంది. మొదటి ప్రవరసేనుడి తర్వాత వాకాటక రాజవంశం నాలుగు శాఖలుగా విడీపోయిందని భావిస్తున్నారు. వీటిలో రెండు శాఖల గురించి తెలియగా, రెండింటి గురించి తెలియదు. తెలిసిన శాఖలు ప్రవరపుర-నందివర్ధన శాఖ, వత్సగుల్మ శాఖ. గుప్త చక్రవర్తి రెండవ చంద్రగుప్తుడు తన కుమార్తెను వాకాటక రాజకుటుంబంలో వివాహం చేసాడు. వారి మద్దతుతో సా.శ. 4వ శతాబ్దంలో గుజరాత్‌ను శక సాత్రపుల నుండి స్వాధీనం చేసుకున్నాడు. వాకాటకుల తరువాత దక్కన్‌లో బాదామి చాళుక్యులు అధికారం లోకి వచ్చారు. వాకాటకాలు కళలు, వాస్తుశిల్పం, సాహిత్యాలకు పోషకులుగా ప్రసిద్ధి చెందారు. వారు ప్రజోపయోగ పనులు చేపట్టారు. వారు నిర్మించిన కట్టడాల్లో వారి వారసత్వం కనిపిస్తుంది.
(ఇంకా…)
తేజస్, భారతదేశం అభివృద్ధి చేసి, తయారు చేసిన యుద్ధ విమానం. డెల్టా వింగ్ కలిగిన ఏక ఇంజను తేజస్, మల్టీరోల్ లైట్ కాంబాట్ యుద్ధ విమానం. దీనిని భారత ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎడిఎ), హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) లు రూపొందించాయి. దీని ప్రధాన వినియోగదారులు భారత వైమానిక దళం, భారత నావికాదళాలు. పాతవై, వయసు పైబడుతున్న మిగ్ -21 యుద్ధ విమానాల స్థానాన్ని పూరించేందుకు, 1980 లలో మొదలుపెట్టిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సిఎ) కార్యక్రమం నుండి రూపుదిద్దుకున్న విమానమే తేజస్. 2003 లో, ఈ యుద్ధవిమానానికి అధికారికంగా "తేజస్" అని పేరు పెట్టారు.
తేజస్ తోక లేని సంయుక్త డెల్టా-వింగ్ కాన్ఫిగరేషన్‌ను, ఒకే డోర్సల్ ఫిన్‌తో కలిగి ఉంది. ఇది సాంప్రదాయ వింగ్ డిజైన్ల కంటే మెరుగైన హై-ఆల్ఫా పనితీరును అందిస్తుంది. దీని వింగ్ రూట్ లీడింగ్ ఎడ్జ్ 50 డిగ్రీల స్వీప్, బాహ్య వింగ్ లీడింగ్ ఎడ్జ్ 62.5 డిగ్రీల స్వీప్, వెనుక ఉన్న అంచు నాలుగు డిగ్రీల ఫార్వర్డ్ స్వీప్ కలిగి ఉంది. రిలాక్స్‌డ్ స్టాటిక్ స్టెబిలిటీ, ఫ్లై-బై-వైర్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్, మల్టీ-మోడ్ రాడార్, ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఏవియానిక్స్ సిస్టమ్, మిశ్రమ పదార్థ నిర్మాణాల వంటి సాంకేతికతలను తేజస్‌లో సమకూర్చారు. ఇది సమకాలీన సూపర్‌సోనిక్ పోరాట విమానాలలో అతి చిన్నది, అత్యంత తేలికైనది.హెచ్‌ఏఎల్ HF-24 మారుత్ తరువాత హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అభివృద్ధి చేసిన రెండవ సూపర్‌సోనిక్ ఫైటర్, తేజస్. 2016 నాటికి, తేజస్ మార్క్-1 భారత వైమానిక దళం (ఐఎఎఫ్) కోసం ఉత్పత్తి జరుగుతూ ఉంది.
(ఇంకా…)
11వ వారం
ఐరోపా సమాఖ్య
యూరోపియన్ యూనియన్ (ఇయు) ప్రధానంగా ఐరోపాలో ఉన్న 27 సభ్య దేశాల రాజకీయ, ఆర్థిక సమాఖ్య. దీని సభ్యదేశాల మొత్తం విస్తీర్ణం 42,33,255 చ.కి.మీ. మొత్తం జనాభా 44.7 కోట్లు. ఇయు ప్రామాణికమైన చట్టాల ద్వారా అన్ని సభ్య దేశాలలో అంతర్గత సింగిల్ మార్కెట్‌ను అభివృద్ధి చేసింది. సభ్యులు ఏ అంశాలపై కలిసి పనిచెయ్యాలని అనుకున్నారో ఆ అంశాలపై మాత్రమే ఈ చట్టాలు చేస్తారు. ఈ అంతర్గత మార్కెట్లో ప్రజలు, వస్తువులు, సేవలు, మూలధనం స్వేచ్ఛగా కదిలేలా చూడడం ఇయు విధానాల లక్ష్యం. న్యాయ, అంతర్గత రక్షణ వ్యవహారాలలో చట్టాన్ని రూపొందించడం, వాణిజ్యం, వ్యవసాయం, మత్స్యకార, ప్రాంతీయ అభివృద్ధిపై కామన్ విధానాలను ఏర్పరచడం కూడా ఇయు విధానాల లక్ష్యం. షెంజెన్ ప్రాంతంలో ప్రయాణించడానికి పాస్‌పోర్ట్ నియంత్రణలు రద్దు చేసారు. 1999 లో ఒక ద్రవ్య యూనియన్‌ను స్థాపించారు. ఇది 2002 లో పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. ఇందులో ఉన్న 19 సభ్య దేశాలు యూరో కరెన్సీని వాడతారు. 1993 లో మాస్ట్రిక్ట్ ఒప్పందం అమల్లోకి రావడంతో ఇయు, యూరోపియన్ పౌరసత్వం ఉనికి లోకి వచ్చాయి. ఇయు మూలాలు యూరోపియన్ బొగ్గు, ఉక్కు సంఘం (ECSC), యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ (EEC) లలో ఉన్నాయి. 1951 పారిస్ ఒప్పందం, 1957 రోమ్ ఒప్పందం ద్వారా పై సంఘాలు ఏర్పడ్డాయి.
(ఇంకా…)
12వ వారం
అతడు అడవిని జయించాడు
అతడు అడవిని జయించాడు, డా. పి. కేశవరెడ్డి రాసిన తెలుగు నవల. మొదట 1984 లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ధారావాహికగా ప్రచురితమైంది. నవలగా 1985 లో తొలిసారి విజయవాడ నవోదయ పబ్లిషర్స్ సంస్థ ప్రచురించింది. ఆ తరువాత పలు సంస్థలు ఈ నవలను ప్రచురించాయి. పరిమాణం రీత్యా చిన్న నవల అయిన దీన్ని నవలిక అనవచ్చు. నేషనల్ బుక్ ట్రస్టు వారు ఈ నవలను 14 భారతీయ భాషల్లోకి అనువదింపజేసి ప్రచురించారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దీన్ని రేడియో నాటకంగా ప్రసారం చేసింది. ఇద్దరు తెలుగు సినిమా దర్శకులు ఈ నవలను సినిమాగా రూపొందించాలని సంకల్పించారు. అడవిని, అందులోని చెట్లు, మొక్కలు, తీగలు, జంతువులు, పక్షులు మొదలైనవాటిని, వాటి స్వభావాలను, ప్రవర్తనలనూ సవివరంగా వర్ణించడం ఈ నవల ప్రత్యేకత. రచయిత స్వయంగా అడువుల్లో సన్నిహితంగా జీవించి ఉంటే తప్ప, ఇంత విపులంగా రాయడం సాధ్యం కాదని కొందరు అన్నారు. అదే విషయాన్ని నిజామాబాదు ఆకాశవాణి కేంద్రానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగినపుడు కేశవరెడ్డి, "ఈ ప్రశ్న చాలామంది అడిగారు. దాన్లో అంత గొప్పేముంది అని అనిపిస్తుంది. చిన్నప్పటినుండి మా పొలాల్లో తిరిగినవాణ్ణి. అక్కడే అనేక జంతువులు పక్షులనూ చూసాను, ఆ అనుభవాలను అడవికి అన్వయించాను, అంతే" అన్నాడు. పుస్తకంలో కథనపు భాష శైలి పత్రికా భాష లోనే సాగుతుంది. నిరక్షరాస్యుడైన ముసలివాని మాటలు, సహజం గానే, చిత్తూరు జిల్లా మాండలికంలో ఉంటాయి. అయితే ముసలివాని స్వగతం ఆ మాండలికంలో కాక, ప్రామాణికమైన పత్రికా భాష లోనే సాగుతుంది. అతడు అంతరంగంలో అనుకునే మాటలు అతని యాసలో కాకుండా ప్రౌఢమైన భాషలో ఉన్నాయెందుకు అనే వ్యాఖ్యకు సమాధానంగా కేశవరెడ్డి, "ముసలివాడు బయటికి చెప్పే మాటలు కావవి, అవి నిశ్శబ్ద సంభాషణలు, కేవలం ఆలోచనలే. ఆలోచనలకు భాషేమీ ఉండదు", అని చెప్పాడు.
(ఇంకా…)
13వ వారం
ఆస్ట్రలోపిథెకస్
ఆస్ట్రలోపిథెకస్ అనేది మానవ పూర్వీకుల్లో ఒకటి. ఆస్ట్రలో అనే లాటిన్ మాటకు "దక్షిణాదికి చెందిన" అని, పిథెకోస్ అనే గ్రీకు మాటకు "కోతి" అనీ అర్థం. వెరసి ఆస్ట్రలోపిథెకస్ అంటే దక్షిణాది కోతి అని చెప్పుకోవచ్చు. అధికారిక ఆస్ట్రలోపిథెసీన్ లేదా ఆస్ట్రలోపిత్ (ఆస్ట్రలోపిథెసిన్ అనే పదానికి ఆస్ట్రోలోపిథెసినా అనే సబ్‌ట్రైబ్‌లో భాగంగా విస్తృత అర్ధం ఉన్నప్పటికీ, ఇందులో ఈ జాతితో పాటు పారాంత్రోపస్, కెన్యాంత్రోపస్, ఆర్డిపిథెకస్, ప్రేయాంత్రోపస్ అనే జాతులు ఉన్నాయి). ఇది హోమినిన్లలో ఒక జీనస్. పాలియోంటాలజీ, పురావస్తు శాస్త్రాల ఆధారాలను బట్టి, ఆస్ట్రలోపిథెకస్ జీనస్ 40 లక్షల సంవత్సరాల కిందట తూర్పు ఆఫ్రికాలో ఉద్భవించి, ఆఫ్రికా ఖండమంతటా వ్యాపించి, చివరికి 20 లక్షల సంవత్సరాల క్రితం అంతరించిపోయింది. ఈ జీనస్‌కు నేరుగా ఆపాదించిన సమూహాల్లో ఇప్పటికి ఏదీ జీవించి లేనప్పటికీ, ఆస్ట్రలోపిథెకస్ అక్షరాలా అంతరించిపోయినట్లు అనిపించదు. కెన్యాంత్రోపస్, పారాంత్రోపస్, హోమో జెనరాలు ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్, ఆస్ట్రలోపిథెకస్ సెడీబా ల నుండి ఉద్భవించి ఉండవచ్చు. ఆ సమయంలో, ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్, ఎ. ఆఫ్రికానస్, ఎ. అనామెన్సిస్, ఎ. బహ్రెల్‌గజాలి, ఎ. డెయిరెమెడా (ప్రతిపాదిత), ఎ. గార్హి, ఎ. సెడీబా వంటి అనేక ఆస్ట్రాలోపిథెసీన్ జాతులు ఉద్భవించాయి.
(ఇంకా…)
14వ వారం
కాపీహక్కు
కాపీహక్కు అనేది ఒక రకమైన మేధో సంపత్తి. దీని ద్వారా హక్కుదారుకి, తాను చేసిన సృజనాత్మక పనిని ఇతరులు కాపీ చేయడానికి, పంపిణీ చేయడానికి, స్వీకరించడానికి, ప్రదర్శించడానికి, నిర్వహించడానికీ పరిమిత కాలం పాటు ప్రత్యేక హక్కు కలుగుతుంది. సృజనాత్మక పని సాహిత్య, కళాత్మక, విద్య లేదా సంగీత రూపాల్లో ఉండవచ్చు. కాపీహక్కు అనేది సృజనాత్మక పని రూపంలో వ్యక్తి తన ఆలోచనకు చేసిన ఒరిజినల్ వ్యక్తీకరణను రక్షించడానికి ఉద్దేశించబడినదే గానీ, ఆలోచనను రక్షించేందుకు కాదు. యునైటెడ్ స్టేట్స్‌లో కాపీహక్కు, సముచిత వినియోగ సిద్ధాంతం వంటి ప్రజా ప్రయోజన పరిమితులకు లోబడి ఉంటుంది.
కొన్ని న్యాయాధికార పరిధుల్లో కాపీహక్కు ఉన్న కృతులను ప్రత్యక్ష రూపంలో "పరిష్కరించాల్సిన" అవసరం ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ కర్తలున్నపుడు వారంతా వివిధహక్కులను పంచుకుంటారు. ఆ హక్కులను అనుసరించి వారికి ఆ పనిని వినియోగించడం లేదా లైసెన్సు ఇవ్వడం వంటివి చేస్తారు. వీరిని హక్కు దారులు అంటారు. ఈ హక్కులలో పునరుత్పత్తి, ఉత్పన్న పనులపై నియంత్రణ, పంపిణీ, బహిరంగ ప్రదర్శనలతో పాటు ఆపాదింపు వంటి నైతిక హక్కులు ఉంటాయి. ప్రజా చట్టం ద్వారా కాపీహక్కులను మంజూరు చేయవచ్చు. ఆ సందర్భంలో వీటిని "ప్రాదేశిక హక్కులు" అని పరిగణిస్తారు. దీనర్థం నిర్దుష్ట దేశపు చట్టం ద్వారా మంజూరైన కాపీహక్కులు ఆ దేశపు అధికార పరిధికి మించి విస్తరించవు. ఈ రకమైన కాపీహక్కులు దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి; అనేక దేశాలు, కొన్నిసార్లు పెద్ద సంఖ్యలో దేశాలు, తమతమ దేశాల మధ్య హక్కుల స్థితి అస్థిరంగా ఉన్నప్పుడు, వర్తించే విధానాలపై ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకున్నాయి.
(ఇంకా…)
15వ వారం
న్యుమోనియా
న్యుమోనియా (ఆంగ్లం: pneumonia) ఉపిరితిత్తుల వేగంగా శ్వాస తీసుకోవటం ప్లూరిటిస్ ప్లూరిసి ఇది, ప్రధానంగా అల్వియోలీ(వాయుకోశాలు) మంట కారణంగా ఇది సంభవిస్తుంది, వైరల్ బాక్టీరియా చిన్న గాలి సంచులను ఎగువ శ్వాస వ్యవస్థను ప్రభావితం చేసే వైరల్ అంటు వ్యాధి. లక్షణాలు సాధారణంగా పొడి పొడి దగ్గు, ఛాతీ నొప్పి, జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి ఉంటాయి, మనిషి మొత్తం వణుకుతూ ఉంటారు, గుండె దడగా ఉంటుంది, భయం భయంగా ఉంటుంది. పొడిదగ్గు ముదిరి ఎక్కువ అవుతున్నప్పుడు తేమడ ఉండలు ఉండలుగా నోటిలోకి వస్తుంది, ఎక్కువ సేపు నిలబడి ఉండలేరు, పెద్ద శబ్దాలను వింటే తల నొప్పిగా ఉంటుంది, గొంతు పట్టేయడం కనీసం మంచినీరు కూడా తరగడానికి కంఠనాళం నొప్పిగా ఉండడం చిన్నపిల్లల్లో శ్వాసలో గురక శబ్దం వస్తుంది, చాలా ముఖ్యమైన సంకేతం. అంతర్లీన కారణాలతో సంబంధం కలిగి ఉంటుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ తగ్గిన వారిలో నిమోనియా కొన్ని వైరస్ల వలన బలపడతాయి. న్యుమోనియా సాధారణంగా వైరస్లు బ్యాక్టీరియా సంక్రమణ వలన సంభవిస్తుంది, కొందరికీ వాహనాలు వెళుతున్నప్పుడు లేచే, ఇల్లు శుభ్రం చేస్తున్న సమయంలో లేచే దుమ్ము, ధూళి కణాలలో ఉండే బ్యాక్టీరియా అందులో నుండి ఇతర సూక్ష్మజీవులు జలుబుకు కారణం అవుతూ నంజులా మారీ న్యుమోనియాగా మారుతుంది. మరికొన్ని మందులు స్వయం ప్రతిరక్షక వ్యాధుల వంటి పరిస్థితుల ద్వారా సంభవిస్తుంది. ప్రమాద కారకాలలో సికిల్ సెల్ డిసీజ్చలి జ్వరం ఉబ్బసం డయాబెటిస్ గుండె పోటు ధూమపానం అలవాటు పోషకాహార లోపం దగ్గు పేలవమైన సామర్థ్యం బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నాయి.
(ఇంకా…)
16వ వారం
బ్రిటిషు భారతదేశంలో వెట్టి చాకిరీ వ్యవస్థ
భారతీయ వెట్టి చాకిరీ వ్యవస్థ బ్రిటిషు వారు 19 వ శతాబ్దంలో భారతదేశంలో ప్రవేశపెట్టిన నిర్బంధ కార్మిక వ్యవస్థ. ఒక పరిమిత కాలానికి చేసుకునే ఒప్పందం ప్రకారం కార్మికులు పనిచేస్తారు కాబట్టి దీన్ని ఒప్పంద కార్మిక వ్యవస్థ అనే వారు. ఒక పరిమిత కాలం పాటు సాగే బానిసత్వం లాంటి వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో పదహారు లక్షలకు పైబడిన సంఖ్యలో భారతీయులను శ్రామికులుగా వివిధ ఐరోపా వలస రాజ్యాలకు రవాణా చేశారు. బ్రిటిషు సామ్రాజ్యంలో 1833 లోను, ఫ్రెంచ్ వలస దేశాల్లో 1848 లోను, డచ్ సామ్రాజ్యంలో 1863 లోనూ బానిసత్వాన్ని నిర్మూలించిన తర్వాత ఈ వ్యవస్థ విస్తరించింది. ఈ వెట్టి చాకిరీ వ్యవస్థ 1920ల వరకు కొనసాగింది. ఈనాడు కరిబియన్ దేశాలు, నాటల్ (దక్షిణాఫ్రికా), తూర్పు ఆఫ్రికా, మారిషస్, శ్రీలంక, మలేషియా, మయన్మార్, ఫిజీ వంటి దేశాల్లో ప్రవాస భారతీయ సమాజం ఉందంటే దానికి మూలం ఈ కార్మిక వ్యవస్థే. ఇండో-కరిబియన్, ఇండో-ఆఫ్రికన్, ఇండో-ఫిజియన్, ఇండో-మలేషియన్, ఇండో-సింగపూర్ జనాభా పెరుగుదలకూ ఈ వ్యవస్థే దోహదం చేసింది. ఈ వ్యవస్థలో ఒప్పందం కుదుర్చుకున్న కార్మికులను హీనంగా కూలీ అని పిలిచేవారు. వివిధ వలస దేశాల్లో వారి పని పరిస్థితులు అధ్వాన్నంగా ఉండేవి. వేతనాలు చాలా తక్కువగా ఉండేవి. ఒప్పందంలో నియమాలు ఉన్నప్పటికీ వాటిని పాటించేవారు కాదు. ఒప్పంద కాలపరిమితి తీరిపోయాక కూడా ఏదో విధంగా వాళ్లను వెనక్కి పోనీయకుండా నిర్బంధంగా అక్కడే ఉంచేలా యజమానులు కుటిల ప్రయత్నాలు చేసేవాళ్ళు.
(ఇంకా…)
17వ వారం
గూగ్లి ఎల్మో మార్కోని
గుగ్లిఎల్మో జియోవన్ని మారియా మార్కోనీ ఇటాలియన్ ఆవిష్కర్త, ఎలక్ట్రికల్ ఇంజనీర్. అతను సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపుటకు, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధి చేయుటలో పితామహుడుగా గుర్తింపు పొందాడు. అతను రేడియో యొక్క ఆవిష్కర్త. 1909 లో కార్ల్ ఫెడ్రినాండ్ బ్రాన్ తో కలసి వైర్‍లెస్ టెలిగ్రాఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి తీసుకున్నాడు. 1897 లో బ్రిటన్ లో వైర్‍లెస్ టెలిగ్రాఫ్, సిగ్నల్ కంపెనీకి వ్యవస్థాపకునిగా ఉన్నాడు. అతను ఇతర భౌతిక శాస్త్రవేత్తల ప్రయోగాలను ఆధారంగా చేసుకొని రేడియో అనే కొత్త ఆవిష్కరణ చేసి వ్యాపార రంగంలో ఘనమైన విజయాన్ని సాధించాడు. 1929 లో మార్కోనీని మార్చీజ్ అనే అవార్డుతో విక్టర్ ఇమ్మాన్యుయేల్ III గౌరవించాడు. 1931లో అతను పోప్ పియస్ XI కోసం వాటికన్ రేడియోను ఏర్పాటు చేశాడు. యువకునిగా ఉన్న నాటి నుండి మార్కోని విజ్ఞానశాస్త్రం, విద్యుత్ పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. 1890 ల ప్రారంభంలో, అతను "వైర్‌లెస్ టెలిగ్రాఫీ" అనే ఆలోచనపై పనిచేయడం ప్రారంభించాడు, అంటే ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ ఉపయోగించిన వైర్లను కనెక్ట్ చేయకుండా టెలిగ్రాఫ్ సందేశాలను ప్రసారం చేయడం. ఇది కొత్త ఆలోచన కాదు; అనేక మంది పరిశోధకులు, ఆవిష్కర్తలు వైర్‌లెస్ టెలిగ్రాఫ్ టెక్నాలజీలను, విద్యుత్ ప్రసరణ, విద్యుదయస్కాంత ప్రేరణ , ఆప్టికల్ (లైట్) సిగ్నలింగ్ ఉపయోగించి 50 సంవత్సరాలుగా కొత్త వ్యవస్థలకోసం అన్వేషిస్తున్నారు. కానీ ఎవరూ సాంకేతికంగా, వాణిజ్యపరంగా విజయవంతం కాలేదు. కొత్త అభివృద్ధి హెన్రిచ్ హెర్ట్‌జ్ నుండి వచ్చింది. అతను 1888 లో, విద్యుదయస్కాంత వికిరణాన్ని ఉత్పత్తి చేయగలవచ్చునని, గుర్తించగలమని నిరూపించాడు.
(ఇంకా…)
18వ వారం
2020 భారత చైనా సరిహద్దు కొట్లాటలు
2020 భారత చైనా కొట్లాటలు, భారత చైనాల మధ్య కొనసాగుతున్న సైనిక ప్రతిష్ఠంభనలో భాగం. 2020 మే 5 నుండి, భారత, చైనా దళాలు వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ప్రదేశాలలో దొమ్మీలకు, ముష్టి యుద్ధాలకూ, కొట్లాటలకూ పాల్పడ్డాయి. లడఖ్‌లోని వివాదాస్పదమైన పాంగోంగ్ సరస్సుకు సమీపంలోను, సిక్కింకు, టిబెట్ అటానమస్ రీజియన్ కూ మధ్య గల సరిహద్దు వద్దా ఈ కొట్లాటలు జరిగాయి. తూర్పు లడఖ్‌లో కూడా వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వెంట ఘర్షణలు జరిగాయి. మే చివరలో, గల్వాన్ నది లోయలో భారతదేశం చేస్తున్న రహదారి నిర్మాణం పట్ల చైనా దళాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. భారత వర్గాల సమాచారం ప్రకారం, జూన్ 15/16 న జరిగిన కొట్లాట ఫలితంగా 20 మంది భారతీయ సైనికులు (ఒక అధికారితో సహా) మరణించారు. 43 మంది చైనా సైనికులు మరణించడం గాని గాయపడ్డం గానీ జరిగింది (ఒక అధికారితో కలిపి). ఇరువైపులా సైనికులను బందీలుగా పట్టుకొని, తరువాతి కొద్ది రోజుల్లో విడుదల చేసినట్లు మీడియా వార్తల్లో వచ్చాయి. భారత్ వైపు పది మంది సైనికులను బందీలుగా తీసుకున్నట్లు తెలిసింది, అయితే చైనా సంఖ్యలు ధృవీకరణ కాలేదు. తరువాత, భారత సైనికులను నిర్బంధించినట్లు వచ్చిన వార్తలను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత సైన్యం రెండూ ఖండించాయి. జూలై 25 న, గల్వాన్, గోగ్రా హాట్ స్ప్రింగ్స్ వద్ద కొట్లాటలు ఆగిపోయాయని వార్తలు వచ్చాయి. జూలై 30 నాటికి, పాంగోంగ్ త్సో (త్సో అంటే టిబెట్ భాషలో సరస్సు అని అర్థం) వద్ద, గోగ్రాలోని పిపి 17 ఎ వద్దా కొట్లాటలు పూర్తిగా ఆగలేదు. భారత, చైనాల మధ్య "పూర్తి విరమణ" ఇంకా మిగిలే ఉంది. విరమణ ప్రక్రియ పూర్తి కాకపోతే శీతాకాలంలో కూడా దళాల విస్తరణను కొనసాగిస్తామని భారత సైన్యం చెప్పింది.
(ఇంకా…)
19వ వారం
అన్నమయ్య
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు. అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని, అహోబిలము లోని నరసింహ స్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి. కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. (సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉంది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు). త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రం గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు.
(ఇంకా…)
20వ వారం
ఆర్య వైద్య శాల, కొటక్కల్
ఆర్య వైద్య శాల, కొట్టక్కల్ భారతీయ ప్రాచీన సాంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానంలో వారసత్వ వ్యవస్థకి, నైపుణ్యానికి ఒక ఉదాహరణ. ఇది భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో, మలప్పురం జిల్లా, కొట్టక్కల్ పట్టణంలో ఉన్న ఒక ఆరోగ్య సంరక్షణా కేంద్రం. ఇది మలప్పురం నుండి 16 కిలోమీటర్లు, కోజికోడ్ (కాలికట్) నుండి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని వైద్యరత్నం పి.ఎస్.వారియర్స్ ఆర్య వైద్య శాల, కొటక్కల్ అంటారు. వైద్యరత్నం పి.ఎస్. వారియర్, ఆయుర్వేదంలో ఒక ప్రఖ్యాత పండితుడు, విద్యావేత్త. ఇతని గౌరవార్థం భారత ప్రభుత్వం ఒక తపాలా స్టాంపును విడుదల చేసింది. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం వారియర్‌కు 1933 వైద్యరత్నం (వైద్యులలో రత్నం) అను బిరుదును ప్రదానం చేసింది. ఇతను 1902లో కేరళ రాష్ట్రం, మలప్పురం జిల్లాలోని తన స్వస్థలం అయిన కొట్టక్కల్ అనే చిన్న పట్టణంలో స్వంత ధనము వెచ్చించి ఆర్య వైద్యశాలను స్థాపించాడు. ఇది మొదట్లో బయట రోగుల చికిత్సకు, ఆయుర్వేద ఔషధాల విక్రయం కోసమూ ఒక చిన్న వైద్య శాలగా ప్రారంభమైంది. పదిహేనేళ్ల తర్వాత, పి.ఎస్. వారియర్ కోజికోడ్ పట్టణంలో గురుకుల పద్ధతి బోధనతో ఆర్య వైద్య పాఠశాల (ఆయుర్వేద వైద్య పాఠశాల)ను స్థాపించాడు. ఈ వైద్య పాఠశాలను తరువాత కొట్టక్కల్‌కు మార్చారు. ఇదే వైద్యరత్నం పి.ఎస్. వారియర్ ఆయుర్వేద కళాశాలగా రూపాంతరం చెంది, కాలికట్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. ఇక్కడ ఆయుర్వేదంలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. ఆర్య వైద్య శాల ఈ కళాశాలకు పరిపాలన, ఆర్ధిక వనరులలో సహకారం అందిస్తోంది.
(ఇంకా…)
21వ వారం
తబ్లీఘీ జమాత్
అల్లా మాటలను బోధించే వారిని తబ్లీఘీ అని పిలుస్తారు. జమాత్ అంటే సంస్థ. తబ్లీఘీ జమాత్ అంటే అల్లా మాటలను బోధించే సంస్థ అని అర్దం. సమావేశ స్థలాన్ని మర్కజ్ అంటారు. హరియాణా లోని మేవాట్ ప్రాంతంలో మౌలానా ఇలియస్ కాంద్లావి 1927 వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం మత బోధనలు ప్రచారం చేసే నిమిత్తం దీనిని ప్రారంభించాడు. తబ్లీఘీ జమాత్ యొక్క ఆవిర్భావం ఉద్యమం వ్యక్తిగత సంస్కరణ అంశాల తీవ్రతను సూచిస్తుంది. మరాఠా సామ్రాజ్యానికి ముస్లిం రాజకీయ ఆధిపత్యం పతనమైన నేపథ్యంలో, తరువాత బ్రిటిష్ రాజ్యపు ఏకీకరణ నేపథ్యంలో భారతదేశంలో ఇస్లామిక్ పునరుజ్జీవనం యొక్క విస్తృత ధోరణికి ఇది కొనసాగింపు. ఇస్లాం, క్రైస్తవ మతంలోకి మారిన హిందువులను తిరిగి మార్చడానికి ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో ప్రారంభించిన శుద్ధి (శుద్ధీకరణ), సంఘతాన్ (ఏకీకరణ) వంటి వివిధ హిందూ పునరుజ్జీవనాత్మక ఉద్యమాల పెరుగుదలతో తబ్లీఘీ జమాత్ ఆవిర్భావం దగ్గరగా ఉంది. తన గురువు రషీద్ అహ్మద్ గంగోహి చేయాలని కలలు కన్నట్లు, ఖురాన్ ఆదేశించినట్లుగా మంచిని ఆజ్ఞాపించే, చెడును నిషేధించే ఒక ఉద్యమాన్ని సృష్టించాలని తబ్లిఘీ జమాత్ వ్యవస్థాపకుడు ముహమ్మద్ ఇలియాస్ కోరుకున్నారు. 1926 లో మక్కాకు తన రెండవ తీర్థయాత్రలో దీనికి ప్రేరణ వచ్చింది. ముహమ్మద్ ఇలియాస్ సహారన్పూర్ లోని మద్రాసా మజాహిర్ ఉలూమ్ వద్ద తన బోధనా పదవిని వదలి ముస్లింలను సంస్కరించడానికి మిషనరీ అయ్యాడు.
(ఇంకా…)
22వ వారం
ఉదగమండలం
ఉదకమండలం (ఊటీ) (ooty) తమిళనాడు రాష్ట్రం, నీలగిరి జిల్లా, నీలగిరి పర్వతాలపై నెలకొని ఉన్న ఒక ప్రసిద్ధి గాంచిన పర్యాటక కేంద్రం, పట్టణం. ఇది నీలగిరి జిల్లాకు పరిపాలనా ప్రధాన పట్టణం. ఈ ప్రదేశంలో మొదటగా బడగ, తోడా తెగలు నివసించేవారు. 18వ శతాబ్దం చివరి నాటికి ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చింది. ఉదగమండలం అనేది దీని అధికారిక నామం. దీన్నే క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని కూడా అంటారు. వాతావరణం చల్లగా ఉన్నందున, వేసవికాలం మంచి విడిది కేంద్రంగా ఇది ప్రసిద్ధి గాంచింది. వేసవిలో ఇక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు కొద్దికాలం విశ్రాంతి కోసం, నీలగిరి కొండలపై ముఖ్యమైన ప్రదేశాలు దర్శించటానికి వస్తుంటారు. నీలగిరి ఘాట్ రోడ్డు, నీలగిరి రైల్వే లైన్లు ఇక్కడికి చేరుకోవడానికి ప్రధాన మార్గాలు. పర్యాటకం, వ్యవసాయం, ఔషధాలు, ఫోటోగ్రఫిక్ ఫిల్ముల ఉత్పత్తి ఇక్కడి ప్రధాన ఆర్థిక వనరులు. 2011 నాటికి ఇక్కడి జనాభా 88,430 మంది.
(ఇంకా…)
23వ వారం
తిరువణ్ణామలై
తిరువణ్ణామలై భారతదేశం, తమిళనాడు రాష్ట్రం, తిరువణ్ణామలై జిల్లా లోని ఒక నగరం. ఇది తిరువణ్ణామలై జిల్లాకు చెందిన ముఖ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్థిక కేంద్రంగా, తిరువణ్ణామలై జిల్లాకు పరిపాలనా కేంద్రంగా కూడా ఉంది. నగరంలో ప్రసిద్ధ అన్నామలైయార్ ఆలయం, అన్నామలై కొండ ఉన్నాయి. గిరివలం, కార్తికదీప ఉత్సవాలు ఈ నగరంలో జరుగుతాయి. ఇది భారతదేశం లోనే గణనీయమైన విదేశీ సందర్శకులను ఆకర్షిస్తున్న ప్రముఖ పర్యాటక కేంద్రం. లోన్లీ ప్లానెట్‌లో ఉన్న నగరాలలో ఈ నగరం ఒకటి. నగరం పరిధిలో చిల్లర వ్యాపార దుకాణాలు, విశ్రాంతి మందిరాలు, వినోద కార్యకలాపాలతో సహా అభివృద్ధి చెందుతున్న సేవా రంగ పరిశ్రమను కలిగిఉంది. సేవా రంగం కాకుండా, చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థ స్పిన్నింగ్ మిల్లులు, ప్రధాన విద్యాసంస్థలతో సహా అనేక పారిశ్రామిక సంస్థలకు నగరం కేంద్రంగా ఉంది. ఈ నగర పరిపాలన తిరువణ్ణామలై పురపాలక సంఘంచే నిర్వహించబడుతుంది. దీని పురపాలక సంఘం 1886లో స్థాపించబడింది. ఈ నగరం రహదారి మార్గాలు, రైల్వే ప్రయాణ సౌకర్యం లాంటి మంచి సదుపాయాలను కలిగిఉంది. తిరువణ్ణామలై చరిత్ర అన్నామలైయార్ ఆలయం చుట్టూ తిరుగుతుంది. ఆలయంలోని చోళ శాసనాలలో నమోదు చేయబడిన చరిత్ర ప్రకారం తిరువణ్ణామలై నగరం తొమ్మిదవ శతాబ్దానికి చెందిందని తెలుస్తుంది. తొమ్మిదవ శతాబ్దానికి ముందు చేసిన మరిన్ని శాసనాలు పల్లవ రాజుల పాలనను సూచిస్తాయి. దీని రాజధాని కాంచీపురం. ఏడవ శతాబ్దపు నాయనార్ సాధువులు సంబందర్, అప్పర్ వారి కవితా రచన తేవారంలో ఈ దేవాలయం గురించి రాశారు.
(ఇంకా…)
24వ వారం
హల్దీఘాటీ యుద్ధం
హల్దీఘాటీ యుద్ధం 1576 జూన్ 18న మహారాణా ప్రతాప్ నేతృత్వంలోని మేవార్ దళాలు, అంబర్ కు చెందిన మాన్ సింగ్ I నేతృత్వంలోని మొఘల్ దళాల మధ్య జరిగిన యుద్ధం. మొఘలులు మేవార్ దళాలకు గణనీయమైన ప్రాణనష్టం కలిగించి యుద్ధంలో విజయం సాధించారు. రాణా ప్రతాప్ తోటి సైనికాధికారుల బలవంతంపై యుద్ధరంగం విడిచి వెళ్ళిపోయాడు. దాంతో మొగలు సైన్యం అతన్ని పట్టుకోలేకపోయింది. 1568లో చిత్తోర్‌గఢ్ ముట్టడితో మేవార్ రాజ్యం లోని సారవంతమైన తూర్పు బెల్ట్‌ను మొఘల్‌ల హస్తగతమైంది. అయితే, చెట్లతో కొండలతో కూడిన మిగతా రాజ్యం సిసోడియాల నియంత్రణ లోనే ఉండిపోయింది. మేవార్ గుండా గుజరాత్ వెళ్ళేందుకు ఒక సుస్థిరమైన మార్గం కావాలని అక్బరు భావించాడు. 1572లో ప్రతాప్ సింగ్ రాజుగా (రాణా) పట్టాభిషిక్తుడైనప్పుడు అక్బరు, ఈ ప్రాంతం లోని అనేక ఇతర రాజపుత్ర నాయకుల మాదిరిగానే రాణాను సామంతుడిగా మారమని కోరుతూ అనేక మంది రాయబారులను పంపాడు. అయితే, ప్రతాప్ అలాంటి ఒప్పందం కుదుర్చుకోవడానికి నిరాకరించడంతో యుద్ధం అనివార్యమైంది. యుద్ధం జరిగిన ప్రదేశం రాజస్థాన్‌లోని గోగుండా సమీపంలోని హల్దీఘాటి వద్ద నున్న ఇరుకైన కనుమ మార్గం. ఇరు సైన్యాల సంఖ్యపై విభిన్న అభిప్రాయాలున్నప్పటికీ, మొఘలు సైన్యం మేవార్ సైన్యం కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని నిర్ధారించారు. తొలుత మేవారీలది పైచేయిగా ఉన్నప్పటికీ, పరిస్థితి నెమ్మదిగా వారికి వ్యతిరేకంగా మారింది. రాణా ప్రతాప్ గాయపడ్డాడు. మొఘలులు యుద్ధంలో గెలిచినందున, ఝాలా మాన్ సింగ్ ఆధ్వర్యంలో కొంతమంది వ్యక్తులు రక్షక వలయంగా ఉంటూ రాణా తప్పించుకునేందుకు సహకరించారు.
(ఇంకా…)
25వ వారం
జిడ్డు కృష్ణమూర్తి
జిడ్డు కృష్ణమూర్తి (11 మే 1895 - 17 ఫిబ్రబరి 1986) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక తత్వవేత్త, ఆధ్యాత్మిక వేత్త, రచయిత, ఉపన్యాసకుడు. ఈయనను చార్లెస్ లెడ్ బీటర్, అనీబిసెంట్ దివ్యజ్ఞాన సాంప్రదాయ ప్రకారం పెంచారు. ఆయన ఒక విశ్వ గురువుగా సమాజంలో జ్ఞానోదయానికి బాటలు వేస్తాడని భావించారు. 1922 నుంచి ఆయనను జీవిత గమనాన్ని మార్చిన అనేక సంఘటనలు, ఆధ్యాత్మిక అనుభవాల వల్ల కృష్ణమూర్తి తనపై మోపిన బాధ్యతను తిరస్కరించాడు. నెమ్మదిగా దివ్యజ్ఞాన సమాజం నుంచి వెలుపలికి వచ్చేశాడు. తర్వాత విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఆధ్యాత్మికం, సామాజిక విషయాల గురించి అనేక ప్రసంగాలు చేశాడు. ప్రతి ఒక్కరు ప్రవక్త, మతం, తత్వాలు మొదలైన వాటిని దాటి ఆధ్యాత్మిక స్వేచ్ఛను కలిగి ఉండాలని ఉద్బోధించాడు.
కృష్ణమూర్తి తన మిగిలిన జీవితాన్ని ప్రపంచ పర్యటనలు చేస్తూ, చిన్న పెద్ద జన సమూహాలతో మాట్లాడుతూ గడిపాడు. చాలా పుస్తకాలు రాశాడు. వాటిలో ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ (1954), కృష్ణమూర్తి నోట్‌బుక్ (1976) ముఖ్యమైనవి. ఆయన ప్రసంగాలు, సంవాదాలు చాలావరకు ప్రచురింపబడ్డాయి. ఆయన చివరి ప్రసంగం చనిపోవడానికి ఒక నెల ముందు 1986 జనవరి నెలలో అమెరికాలోని ఓహై లోని తన ఇంటిలో జరిగింది. ఆయన క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. ఆయన అనుయాయులు కొంతమంది ఆయన పేరు మీదుగా భారతదేశం, అమెరికా, బ్రిటన్ దేశాలలో స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు నడుపుతున్నారు. ఇవి ఆయన భావాలను, రచనలను వివిధ భాషల్లో, వివిధ మాధ్యమాల రూపంలో ప్రజల్లో వ్యాప్తి చేస్తున్నాయి.
(ఇంకా…)
మైసూరు రాజ్యం దక్షిణ భారతదేశంలోని రాజ్యం. దీన్ని 1399లో ఆధునిక మైసూరు నగరానికి సమీపంలో స్థాపించారని భావిస్తారు. 1799 నుండి 1950 వరకు, ఇది ప్రత్యేక రాజ్యంగా, సంస్థానంగా ఉండేది. 1947 వరకు బ్రిటిషు ఇండియాతో అనుబంధ కూటమిలో ఉండేది. 1831లో బ్రిటిషు వారు రాచరిక సంస్థానాలపై ప్రత్యక్ష నియంత్రణను చేపట్టినపుడు ఇది మైసూరు సంస్థానంగా మారింది. ఆ తరువాత విస్తరించబడి కర్ణాటకగా పేరు మార్చబడింది. మైసూరు పాలకుడు 1956 వరకు రాజప్రముఖ్‌గా కొనసాగాడు. ఆ తరువాత కర్ణాటక రాష్ట్రానికి మొదటి గవర్నర్ అయ్యాడు. ఇది ప్రారంభంలో విజయనగర సామ్రాజ్యానికి సామంత రాజ్యంగా ఉండేది. 17వ శతాబ్దంలో రాజ్యం బాగా విస్తరించింది. నరసరాజ వడయార్ I, చిక్క దేవరాజ వడయార్‌ల పాలనలో రాజ్యం, దక్కన్ పీఠభూమి దక్షిణ ప్రాంతంలో శక్తివంతమైన రాజ్యంగా మారింది. ఇప్పటి దక్షిణ కర్ణాటక, తమిళనాడు లోని కొన్ని ప్రాంతాలు ఈ సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. కొద్దికాలం పాటు సాగిన ముస్లిం పాలనలో, ఈ సామ్రాజ్యం సుల్తానేట్ పరిపాలనా శైలికి మారింది. మైసూరు రాజ్యానికి మరాఠాలు, హైదరాబాద్ నిజాం, ట్రావెన్‌కోర్ రాజ్యం, బ్రిటిషు వారితో ఘర్షణలు ఉండేవి. నాలుగు ఆంగ్లో-మైసూరు యుద్ధాలతో ఈ ఘర్షణలు ముగిసాయి. మొదటి ఆంగ్లో - మైసూరు యుద్ధంలో మైసూరు రాజ్యం విజయం సాధించగా, రెండవ దానిలో ఫలితం తేలలేదు. మూడవ, నాల్గవ యుద్ధాలలో పరాజయాల పాలైంది. శ్రీరంగపట్నం ముట్టడిలో (1799) జరిగిన నాల్గవ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించిన తరువాత, అతని రాజ్యంలోని పెద్ద భాగాలు బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. దీంతో దక్షిణ భారతదేశంపై మైసూరు ఆధిపత్యం ముగిసింది. బ్రిటిషు వారు సైన్య సహకార ఒప్పందం ద్వారా వడయార్లను సింహాసనంపై తిరిగి ప్రతిష్ఠించారు. క్షీణించిన మైసూరు రాజ్యం రాచరిక సంస్థానంగా మారింది. 1947 లో భారత స్వాతంత్ర్యం వచ్చే వరకు వడయార్లు రాష్ట్రాన్ని పాలించారు. ఆ తరువాత మైసూరు భారత యూనియన్‌లో చేరింది.
(ఇంకా…)
27వ వారం
సుమేరు నాగరికత
సుమేరు నాగరికత తామ్ర శిలా యుగం, మొదటి కంచు యుగ కాలాల్లో, సుమారు క్రీ.పూ. 5–6 సహస్రాబ్దుల్లో, దక్షిణ మిసొపొటేమ్యా (ఆధునిక దక్షిణ-మధ్య ఇరాక్) ప్రాంతములో మొదలైంది. ఇది మెసొపొటేమియాలోని నాగరికతల్లో మొదటిది. సింధూ నాగరికత, ప్రాచీన ఈజిప్టు, ఈలము, ప్రాచీన చైనా, కారలు నాగరికత, ఒల్మెక్ నాగరికతలతో పాటు ప్రపంచంలోని మొట్టమొదటి నాగరికతలలో ఇది కూడా ఒకటి. టైగ్రిసూ, యూఫ్రెటీసు లోయలలో నివసించిన సుమేరు రైతులు ధాన్యం, ఇతర పంటలను విస్తారంగా సాగుచేసారు. ఆ పంట మిగులు వారు పట్టణావాసాలు ఏర్పరిచేందుకు దోహదపడింది. క్రీ.పూ 3000 నాటికీ ఆదిలేఖన పద్ధతులు ఈ నాగరికతలో కనిపిస్తాయి. ఈ నాగరికత యొక్క అత్యంత పురాతన రచనలు ఉరుక్, జెమ్డెట్ నస్ఱ్ నగరాలలో లభించాయి. ఇవీ క్రీ.పూ 3500–3000 నాటివి. సుమేరు అనే పదాన్ని ఆంగ్లములో సూమర్ అని పలకబడుతుండగా, భారతీయ ఆంగ్ల ఉచ్చారణలో సుమేరుగా పలుకబడుతోంది. ఐతే ఉత్తర ఆఫ్రికాలోని అలనాటి పచ్చటి సహారాలో నివసించిన వారే మధ్యప్రాచ్యములోని సుమేరుకు వలస వచ్చి అక్కడ వ్యవసాయాన్ని వ్యాపింపజేసారని మరికొందరి పరిశోధకుల వాదన. కానీ వ్యవసాయము మొదట ఫెర్టైల్ క్రిసెంట్‌లోమొదలైందని బలమైన ఆధారాలున్నందున ఈ పరికల్పనకు పెద్దగా మద్దతు లభించలేదు. ప్రత్యేకించి సుమేరులను గూర్చి చెప్పనప్పటికీ, 2016లో లజరిడిస్ బృందము మధ్యప్రాచ్యములోని సెమిట సంస్కృతి మొదలవ్వడానికి ముందు నివసించిన వారిలో, ముఖ్యంగా నటూఫుల్లో, కొంత ఉత్తర ఆఫ్రికా సంతతి ఉందని ప్రతాపాదించారు.
(ఇంకా…)
28వ వారం
స్పెయిన్
స్పెయిన్ లేదా స్పెయిన్ సామ్రాజ్యం (అధికార నామం రెయినో దే ఎస్పాన్యా) ఐరోపా ఖండపు నైరుతి భాగంలో ఉన్న ఒక దేశము. దీని భూభాగం అట్లాంటిక్ సముద్రం లోనూ, ఆఫ్రికా ఖండపు ఉత్తర భాగంలో కూడా విస్తరించి ఉంది. ఈ దేశపు ఖండాంతర ఐరోపా భూభాగం ఐబీరియన్ ద్వీపకల్పంలో ఉంది. దాని ద్వీప భూభాగంలో మధ్యధరా సముద్రంలోని బలేరిక్ దీవులు, అట్లాంటిక్ మహాసముద్రంలోని కానరీ దీవులు, 29వ సమాంతరానికి దక్షిణంగా మరియు అల్బోరాన్ సముద్రంలో అనేక చిన్న ద్వీపాలు ఉన్నాయి. ఈ దేశపు ప్రధాన భూభాగానికి దక్షిణంగా జిబ్రాల్టర్ జలసంధి, దక్షిణం, తూర్పుగా మధ్యధరా సముద్రం, ఉత్తరంగా ఫ్రాంసు, అండోరా, బే ఆఫ్ బిస్కే, పడమరగా పోర్చుగల్, అట్లాంటిక్ మహా సముద్రం ఉన్నాయి. 5,05,990 చ.కి.మీ (1,95,360 చ.మై) విస్తీర్ణంతో దక్షిణ ఐరోపాలో స్పెయిన్ అతి పెద్ద దేశం. పశ్చిమ ఐరోపా, ఐరోపా సమాఖ్యలో రెండవ అతిపెద్ద దేశం. ఐరోపా ఖండంలోని నాల్గవ అతిపెద్ద దేశంగా ఉంది. జనాభాలో యూరోప్ ఐరోపాలో ఐదవ అతిపెద్ద, ఐరోపా సమాఖ్యలో ఐదో స్థానంలో ఉంది. స్పెయిన్ రాజధాని, అతిపెద్ద నగరం మాడ్రిడ్. బార్సిలోనా, వాలెన్సియా, సెవిల్లె, బిల్బావు, మాలాగా వంటి ఇతర ప్రధాన పట్టణ ప్రాంతాలు ఉన్నాయి. సుమారు 42,000 సంవత్సరాల క్రితం ఆధునిక మానవులు మొట్టమొదట ఐబెర్రి ద్వీపకల్పానికి వచ్చారు. ప్రాచీన ఫోనిషియన్ గ్రీకు, కార్తగినియన్ నివాసాలతో పాటు ఐబెరియన్ సంస్కృతులు ద్వీపకల్పంలో అభివృద్ధి చేయబడ్డాయి. ఇది సుమారు క్రీ.పూ 200 ప్రాంతంలో రోమన్ పరిపాలన కిందకు వచ్చింది.
(ఇంకా…)
29వ వారం
చంద్రయాన్-2
చంద్రయాన్-2, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపై పరిశోధన కోసం చేసిన రెండవ యాత్రకు ఉపయోగించిన నౌక. చంద్రుడిపై నిదానంగా, మృదువుగా దిగి (సాఫ్ట్ ల్యాండింగు), 14 రోజుల పాటు చంద్ర ఉపరితలంపై తిరుగుతూ, వివిధ ప్రయోగాలు చేసేందుకు అవసరమైన సాధన సంపత్తి ఈ నౌకలో భాగం. చంద్రయాన్-2 ను ఇస్రోకు చెందిన అత్యంత భారీ వాహనమైన జిఎస్‌ఎల్‌వి ఎమ్‌కె-3 వాహనం ద్వారా ప్రయోగించారు. చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ ఉండే ఆర్బిటరు, దాన్నుంచి విడివడి చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండిగయ్యే ల్యాండరు, ల్యాండరు నుండి బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై నడిచే రోవరు - ఈ మూడూ చంద్రయాన్-2 లో భాగాలు. భారతదేశపు చంద్రయాన్ కార్యక్రమంలో ఇది రెండవ యాత్ర. చంద్రయాన్-2 కార్యక్రమం ద్వారా వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి, చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలు చేయడానికీ ఇస్రో తలపెట్టింది. 6 చక్రాలు కలిగిన రోవరు చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ అక్కడి మట్టి, రాళ్ల నమూనాలను సేకరించి అక్కడే రసాయనిక విశ్లేషణ చేస్తుంది. ఈ సమాచారాన్ని ల్యాండరుకు అందజేయగా అది భూమిపై ఉన్న డీప్ స్పేస్ నెట్‌వర్కుకు చేరవేస్తుంది. చంద్రయాన్-1ను సాకారం చేసిన మైలస్వామి అన్నాదురై నేతృత్వంలోని బృందం చంద్రయాన్-2 పైన పనిచేస్తుంది. ఇస్రో రూపకల్పన ప్రకారం - ఇంతవరకు ఏ దేశం కూడా కాలూనని ప్రదేశంలో, చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్-2 ల్యాండరు దిగుతుంది. దాన్నుండి రోవరు బయటకు వచ్చి చంద్రుని ఉపరితలంపై తిరుగుతుంది.
(ఇంకా…)
30వ వారం
దేశీయ ఆర్యులు
పౌరాణిక కాలక్రమంపై ఆధారపడిన భారతీయ సాంప్రదాయిక దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తూ పాశ్చాత్యులు ప్రవచించిన, ప్రస్తుతం సాధారణంగా ఆమోదంలో ఉన్న కాలాన్ని త్రోసిరాజంటూ, వేదకాలం మరింత ప్రాచీనమైనదని ఈ సిద్ధాంతం చెబుతుంది. సింధు లోయ నాగరికతని కూడా చెబుతుంది. ఈ సిద్ధాంతం దృష్టిలో, "భారతీయ నాగరికత సా.పూ. 7000 - 8000 కాలం నాటి సింధు నాగరికత నాటి నుండి అవిచ్ఛిన్నంగా వస్తున్న సంఫ్రదాయం". ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న ఇండో యూరోపియన్ వలస నమూనాకు ఈ సిద్ధాంతం ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రాల మధ్య ఉన్న గడ్డిభూముల (స్టెప్పీలు) నుండి ఆర్యులు భారతదేశానికి వలస వచ్చారని, ఆ ప్రాంతమే ఇండో-యూరోపియన్ భాషలకు మూలస్థానమనీ ఇండో యూరోపియన్ వలస నమూనా (ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి కొత్త రూపం) ప్రతిపాదిస్తుంది. భారతీయ చరిత్ర, గుర్తింపుకు సంబంధించి సాంప్రదాయిక, మతపరమైన అభిప్రాయాలపై ఈ ప్రతిపాదన ఆధారపడి ఉంది. హిందుత్వ రాజకీయాల్లో ఈ సిద్ధాంతం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హిందూ మతం, భారతదేశ చరిత్ర, భారతీయ పురావస్తు శాస్త్రాలకు చెందిన పండితులు ఎక్కువగా ఈ సిద్ధాంతాన్ని సమర్ధిస్తారు. ప్రధాన స్రవంతి పండితుల్లో దీనికి అంతగా మద్దతు లేదు. దేశీయ ఆర్యులు అనేవారు భారతదేశ చరిత్రలో ఎక్కడ కనిపించలేదని ప్రధాన స్రవంతి పండితులు ఎక్కువగా నమ్ముతారు.
(ఇంకా…)
మూగమనసులు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున ప్రధాన పాత్రల్లో నిర్మించిన 1964 నాటి తెలుగు చిత్రం. అంతస్తుల కారణంగా విడిపోయిన జంట పునర్జన్మలో వివాహం చేసుకుని కలవడం కథాంశం. సినిమాని చిత్ర దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు బాబూ మూవీస్ పతాకంపై నిర్మించారు. ఆదుర్తి తాను చదివిన చిన్న కథను అనుసరించి తయారుచేసిన లైన్ కి, ఆదుర్తి కోరికపై ముళ్ళపూడి వెంకటరమణ మూగమనసులు పేరిట ఈ సినిమా స్క్రిప్ట్ రాశారు. సాధారణంగా అప్పటి సినిమాలు మద్రాసులోని వివిధ స్టూడియోల్లో చిత్రీకరణ జరుపుకునేవి, అయితే సినిమా మాత్రం చాలాభాగం భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరకూ ఉన్న గోదావరి పరిసరప్రాంతాల్లోనూ, గోదావరి మీదా అవుట్ డోర్ లో చిత్రీకరణ జరుపుకుంది. సినిమా పాటలు ఆత్రేయ, కొసరాజు, దాశరథి రాయగా, కె.వి.మహదేవన్ స్వరపరిచారు. విడుదలకు ముందే సినిమా బాగోలేదన్న పుకార్లను, గోదావరిపై జరిగిన పడవ ప్రమాదాలను తట్టుకుని 1964లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం పొందింది. ప్రేక్షకాదరణ, విమర్శల ప్రశంసలు పొందిన ఈ సినిమా 175 రోజులు ఆడింది. ఈ సినిమాని తారాచంద్ బర్జాత్యా, ఎల్.వి.ప్రసాద్ ల నిర్మాణంలో ఆదుర్తి సుబ్బారావు దర్శకునిగా, నూతన్, సునీల్ దత్ ప్రధాన పాత్రలలో హిందీలో మిలన్గా తీశారు. అక్కడా సినిమా విజయవంతమైంది.
(ఇంకా…)
32వ వారం
హనుమాన్ చాలీసా
హనుమాన్ చాలీసా రాముని ప్రసిద్ధ భక్తుడైన తులసీదాసు అవధి భాషలో వ్రాసిన 40 శ్లోకార రచన. "చాలీసా" అనే పదం "చాలీస్" అనే పదం నుండి వ్యుత్పత్తి అయింది. దీని అర్థం హిందీ భాషలో నలభై అని. అనగా హనూమన్ చాలీసాలో నలభై శ్లోకాలు ద్విపదులుగా ఉంటాయి. హనుమంతుడు రామ భక్తుడు. అతను రామాయణంలోని ప్రధాన పాత్రలలో ఒకడు. శైవ సంప్రదాయం ప్రకారం, హనుమంతుడు కూడా శివుని అవతారమే. జానపద కథలు హనుమంతుని శక్తులను కీర్తిస్తాయి. హనుమంతుని గుణాలు - అతని బలం, ధైర్యం, జ్ఞానం, బ్రహ్మచర్యం, రాముని పట్ల అతని భక్తి, అతనికి గల అనేక పేర్లు - హనుమాన్ చాలీసాలో వివరంగా ఉన్నాయి. హనుమాన్ చాలీసా పఠించడం లేదా జపించడం ఒక సాధారణ మతపరమైన ఆచారం. హనుమాన్ చాలీసా అనేది హనుమంతుని స్తుతించే అత్యంత ప్రజాదరణ పొందిన శ్లోకం, దీనిని ప్రతిరోజూ మిలియన్ల మంది హిందువులు పఠిస్తారు. శ్లోకం యొక్క చివరి పద్యంలో అతను తన పేరును పేర్కొన్నాడు. హనుమాన్ చాలీసా 39వ శ్లోకంలో ఎవరైతే హనుమంతునిపై పూర్తి భక్తితో జపిస్తారో వారికి హనుమంతుని అనుగ్రహం కలుగుతుందని చెప్పబడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులలో, చాలీసాను పఠించడం వలన తీవ్రమైన సమస్యలలో హనుమంతుని దైవిక జోక్యాన్ని ప్రేరేపిస్తుందని చాలా ప్రజాదరణ పొందిన నమ్మకం. హనుమాన్ చాలీసాలోని 40 శ్లోకాలలో ప్రారంభంలో 2 ద్విపదలు, ముగింపులో ఒక ద్విపద ఉన్నాయి.
(ఇంకా…)
టెర్రకోట, టెర్రా కోటా లేదా టెర్రా-కొట్టా ఇటాలీభాష: "కాల్చిన భూమి", ఒక రకమైన మట్టి పాత్రలు, మట్టి ఆధారిత మెరుస్తున్న సిరామికు. ఇక్కడ కాల్చిన పింగాణి. టెర్రకోట అనేది సాధారణంగా మట్టి పాత్రలలో తయారైన శిల్పకళకు, నాళాలు (ముఖ్యంగా పూలకుండీలు), నీరు, వ్యర్థ నీటి పైపులు, ఇంటికప్పుకు ఉపయోగించే పెంకులు, ఇటుకలు, భవన నిర్మాణంలో ఉపరితల అలంకారంతో సహా వివిధ ఆచరణాత్మక ఉపకరణాలుగా ఉపయోగిస్తారు. ఈ పదాన్ని టెర్రకోట సహజ గోధుమ నారింజ రంగును సూచించడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ పదప్రయోగంలో గణనీయంగా మార్పులు సంభవించాయి.
టెర్రకోట స్పందనను శిల్పకళలో ఒక మాధ్యమంగా, టెర్రకోట ఆర్మీ, గ్రీకు టెర్రకోట బొమ్మలు, నిర్మాణ అలంకరణలో పొందుపరుస్తుంది. ఆసియా, ఐరోపాలోని పింగాణీ శిల్పం కళ గురించి చెప్పడానికి ఈ పదప్రయోగం ఉపయోగించబడదు. 19 వ శతాబ్దంలో పశ్చిమ దేశాలలో ప్రాచుర్యం పొందటానికి ముందు కొన్ని శతాబ్దాలుగా ఆసియాలో భవనాల బాహ్య ఉపరితలాలుగా మెరుస్తున్న నిర్మాణ టెర్రకోట ఉపకరణాలు దాని మెరుస్తున్న రూపాన్ని తీసుకువచ్చేలా సంస్కరించబడి ఉపయోగించబడ్డాయి. ఆర్కిటెక్చరలు టెర్రకోటా యాంటిఫిక్సు, రివిట్మెంట్సు వంటి అలంకరించబడిన సిరామికు ఎలిమెంట్లను కూడా సూచిస్తుంది. ఇది ఐరోపా సంప్రదాయ నిర్మాణకళలో, అలాగే పురాతన నియరు ఈస్టులో దేవాలయాలు, ఇతర భవనాల రూపానికి పెద్ద సహకారం అందించింది.
(ఇంకా…)
34వ వారం
క్రెటేషస్-పాలియోజీన్ విలుప్తి ఘటన
క్రెటేషియస్-పాలియోజీన్ విలుప్తి ఘటన అనేది, సుమారు 6.6 కోట్ల సంవత్సరాల కిందట భూమ్మీద నాలుగింట మూడు వంతుల వృక్ష, జంతు జాతులు మూకుమ్మడిగా నశించిపోయిన సంఘటన. దీన్ని క్రెటేషియస్-టెర్షియరీ విలుప్తి అని కూడా పిలుస్తారు. ఈ ఘటన లోనే నేలపై నివసించే డైనోసార్లు అంతరించిపోయాయి. అంతేకాదు, సముద్ర తాబేళ్లు, మొసళ్ళ వంటి కొన్ని ఎక్టోథర్మిక్ జాతులు మినహా, 25 కిలోలకు పైబడి బరువున్న టెట్రాపోడ్స్ ఏవీ బతకలేదు. ఈ ఘటనతో క్రెటేషియస్ పీరియడ్ ముగిసింది. దానితో పాటే మెసోజాయిక్ ఎరా ముగిసి, సెనోజాయిక్ ఎరా మొదలైంది. ప్రస్తుతం జరుగుతున్నది సెనోజోయిక్ ఎరాయే.
భౌగోళిక రికార్డులో K -Pg ఘటనను, K -Pg సరిహద్దు అని పిలిచే పలుచని అవక్షేప పొర ద్వారా గుర్తించవచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా సముద్ర శిలలు, భూ శిలలు రెండింటి లోనూ కనిపిస్తుంది. ఈ సరిహద్దు పొర వద్ద ఉన్న బంకమట్టి సమ్మేళనంలో ఇరిడియం లోహం స్థాయి అసాధారణంగా ఎక్కువగా ఉంది. ఈ లోహం భూమి పైపెంకులో ఇంత స్థాయిలో ఎక్కడా ఉండదు. భూమిపై కంటే గ్రహశకలాలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. 1980 లో లూయిస్ అల్వారెజ్, అతని కుమారుడు వాల్టర్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ప్రతిపాదించినట్లుగా, K -Pg విలుప్తికి కారణం 6.6 కోట్ల సంవత్సరాల క్రితం 10 నుండి 15 కి.మీ. వెడల్పున్న భారీ తోకచుక్క లేదా గ్రహశకలం భూమిని గుద్దుకోవడమేనని ఇప్పుడు విస్తృతంగా భావిస్తున్నారు. దీని వలన ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం నాశనమైంది. ఈ గుద్దుడు వలన ఏర్పడిన కృత్రిమ శీతాకాలం సూర్యరశ్మిని అడ్డుకోవడంతో మొక్కల్లోను, పాచి లోనూ కిరణజన్యు సంయోగ క్రియ ఆగిపోయింది. అల్వారెజ్ పరికల్పన అని పిలిచే ఈ పరికల్పనకు, 1990 ల ప్రారంభంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో లోని యుకాటాన్ ద్వీపకల్పంలో 180 కి.మీ. వ్యాసమున్న చిక్సులూబ్ బిలాన్ని కనుక్కోవడంతో బలం చేకూరింది.
(ఇంకా…)
35వ వారం
సియాచెన్ హిమానీనదం
సియాచెన్ హిమానీనదం, హిమాలయాల్లోని తూర్పు కారకోరం శ్రేణిలో, భారత పాకిస్తాన్ల మధ్య నున్న నియంత్రణ రేఖ ముగిసే NJ9842 బిందువుకు ఈశాన్యంగా, సుమారు 35.421226°N 77.109540°E వద్ద ఉన్న హిమానీనదం. 76 కిలోమీటర్ల పొడవైన ఈ హిమానీనదం, కారకోరంలోకెల్లా అత్యంత పొడవైనది. ధ్రువేతర హిమానీనదాల్లో అత్యంత పొడవైన వాటిలో ఇది రెండవ స్థానంలో ఉంది. ఇది, చైనా సరిహద్దులోని ఇందిరా కల్ వద్ద, 5,753 మీటర్ల ఎత్తున పుట్టి, 3,620 మీ ఎత్తున అంతమౌతుంది. సియాచెన్ హిమానీనదమంతా, అక్కడి అన్ని ప్రధాన కనుమలతో సహా, 1984 నుండి భారత పరిపాలనలో ప్రస్తుత లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో భాగంగా ఉంది. పాకిస్తాన్, సియాచెన్ హిమానీనదం తనదని వాదిస్తూ ఉంటుంది. హిమానీనదానికి పశ్చిమాన ఉన్న సాల్టోరో శిఖరాలకు పశ్చిమాన ఉన్న ప్రాంతం పాక్ నియంత్రణలో ఉంది. ఈ ప్రాంతం లోని పాకిస్తాన్ పోస్టులు, 100 పైచిలుకు ఉన్న భారతీయ పోస్టుల కంటే 3,000 అడుగులు క్రింద ఉంటాయి. సియాచెన్ హిమానీనదం, యూరేసియన్ ప్లేట్‌ను భారత ఉపఖండాన్నీ వేరుచేసే గొప్ప విభజన రేఖకు దక్షిణాన ఉంది. ఇది కారకోరం శ్రేణిలో బాగా హిమానీనదాలున్న ప్రాంతంలో ఉంది. దీన్ని కొన్నిసార్లు "మూడవ ధ్రువం" అని కూడా పిలుస్తారు.
(ఇంకా…)
36వ వారం
సర్వేపల్లి రాధాకృష్ణన్
సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888 సెప్టెంబరు 5 - 1975 ఏప్రిల్ 17; స్థానికంగా రాధాకృష్ణయ్య ) 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. అతను గతంలో 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. అతను 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్‌లో భారతదేశానికి రెండవ రాయబారిగా ఉన్నాడు. అతను 1939 నుండి 1948 వరకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి నాల్గవ వైస్-ఛాన్సలర్‌గా, 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రెండవ వైస్-ఛాన్సలర్‌గా కూడా ఉన్నాడు. రాధాకృష్ణన్ తులనాత్మక మతం, తత్వశాస్త్రం యొక్క 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన, విశిష్టమైన పండితులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. అతను కలకత్తా విశ్వవిద్యాలయంలో కింగ్ జార్జ్ వి చైర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్‌లో 1921 నుండి 1932 వరకు, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని స్పాల్డింగ్ చైర్ ఆఫ్ ఈస్టర్న్ రెలిజియన్ అండ్ ఎథిక్స్ కు 1936 నుండి 1952 వరకు తన సేవలనందించాడు. భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టారని ప్రతీతి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో (చైనా, పాకిస్తాన్లతో యుద్ధ సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశాడు.
(ఇంకా…)
37వ వారం
భారత చైనా సరిహద్దు వివాదం
భారతదేశం, చైనా ల మధ్య రెండు పెద్ద భూభాగాల సార్వభౌమత్వం పైన, అనేక చిన్న చిన్న భూభాగాల పైనా కొనసాగుతున్న ప్రాదేశిక వివాదమే భారత చైనా సరిహద్దు వివాదం. వివాదాస్పదమైన ఆ రెండు పెద్ద భూభాగాల్లో మొదటిది, అక్సాయ్ చిన్. ఇది లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో భాగమని భారతదేశం పేర్కొంటుంది. తన జిన్జియాంగ్ ఉయ్‌గుర్ అటానమస్ రీజియన్, టిబెట్ అటానమస్ రీజియన్ లలో భాగమని చైనా వాదిస్తుంది. అక్సాయ్ చిన్ కాశ్మీరు, టిబెట్ ప్రాంతంలోని, జనావాసాలు అసలే లేని ఎత్తైన బంజరు భూమి. జిన్జియాంగ్-టిబెట్ హైవే ఈ ప్రాంతం గుండా పోతుంది. రెండవ వివాదాస్పద భూభాగం మెక్‌మహాన్ రేఖకు దక్షిణంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్. దీనిని గతంలో నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అని పిలిచేవారు. 1914 లో బ్రిటిషు ఇండియా, టిబెట్ ల మధ్య కుదిరిన 1914 సిమ్లా ఒడంబడికలో మెక్‌మహాన్ రేఖ ఒక భాగం. ఈ ఒప్పందంలో చైనా భాగం కాదు 2020 నాటి స్థితి ప్రకారం, మెక్ మహాన్ రేఖయే చట్టబద్దమైన తూర్పు సరిహద్దు అని భారతదేశం చెబుతోంది. సిమ్లా ఒప్పందంపై సంతకం చేసినప్పుడు టిబెట్ అసలు స్వతంత్రంగానే లేదని పేర్కొంటూ చైనా ఆ సరిహద్దును ఏనాడూ అంగీకరించలేదు. 1962 లో పై రెండు వివాదాస్పద ప్రాంతాలలో భారత చైనాల మధ్య యుద్ధం జరిగింది. చైనా దళాలు పశ్చిమాన లడఖ్‌లోని భారత సరిహద్దు పోస్టులపై దాడి చేసాయి.
(ఇంకా…)
38వ వారం
వినాయక జయంతి
వినాయక జయంతి హిందూ పండుగ. దీనిని మాఘ శుక్ల చతుర్థి, తిల్కుండ్ చతుర్థి, వరద్ చతుర్థి అని కూడా పిలుస్తారు. ఈ సందర్భంగా జ్ఞానానికి అధిపతి అయిన వినాయకుడి జన్మదినాన్ని జరుపుకుంటారు. ఇది భారతదేశంలోని మహారాష్ట్రలో ఒక ప్రసిద్ధ పండుగ, పంచాంగం ప్రకారం మాఘ మాసంలో శుక్లపక్ష చతుర్థి రోజు గోవాలో కూడా జరుపుకుంటారు. గ్రెగోరియన్ క్యాలెండర్ నెల జనవరి/ఫిబ్రవరి నెలల్లో ఈ పండుగ వస్తుంది. 2022, ఫిబ్రవరి 4న వినాయక జయంతి జరిగింది. వినాయక జయంతి, వినాయక చవితి పండుగల మధ్య వ్యత్యాసం ఏమిటంటే, వినాయక చవితి పండుగ ఆగస్టు/సెప్టెంబరు (భాద్రపద హిందూ మాసం)లో జరుపుకుంటారు. మరో సంప్రదాయం ప్రకారం, వినాయక చవితి కూడా వినాయకుడి పుట్టినరోజుగానే పరిగణించబడుతుంది. ఈ పండుగను ఉత్తరప్రదేశ్‌లో తిలో చౌత్ లేదా సకత్ చౌతీస్ అని కూడా పిలుస్తారు, ఇక్కడ ఒక కుటుంబంలోని కొడుకు తరపున వినాయకుడిని ఆరాధిస్తారు. దీనిని మహారాష్ట్రలో తిల్కుండ్ చతుర్థి అని కూడా అంటారు. ఈ పండుగ రోజున, పసుపు లేదా సింధూర పొడి లేదా కొన్నిసార్లు ఆవుపేడతో శంఖాకార రూపంలో వినాయకుడి ప్రతిమను తయారు చేసి పూజిస్తారు. పండుగ తర్వాత నాల్గవ రోజు ఆ ప్రతిమను నీటిలో నిమజ్జనం చేస్తారు.
(ఇంకా…)
39వ వారం
బేతాళ కథలు
బేతాళ పంచవింశతి కథల మూలాలు అత్యంత ప్రాచీనమైనవి. క్రీ. పూ. 1 వ శతాబ్దానికి చెందిన ఈ కథలు తొలిసారిగా శాతవాహనుల యుగానికి చెందిన గుణాడ్యుని బృహత్కథలో ఒక భాగంగా చోటుచేసుకొన్నాయి. మొట్టమొదట పైశాచి భాష (ప్రాకృత భాషా భేదం) లో రాయబడిన ఈ కథలు తరువాతి కాలంలో సంస్కృత భాషలోనికి అనువదించబడ్డాయి. అయితే పైశాచి భాషలోని బృహత్కథ మూలగ్రంధం అలభ్యం కావడంతో సంస్కృత భాషలో అనువదించబడిన కథలే మిగిలాయి. పైశాచి భాషలో వున్న బృహత్కథను సంస్కృతంలోకి పద్యరూపంలో బుద్ధస్వామి, క్షేమేంద్రుడు, సోమదేవసూరిలు అనువదించారు. అయితే బుద్ధస్వామి (సా.శ. 5 వ శతాబ్దం) ‘బృహత్కతా శ్లోక సంగ్రహం’లో ఈ బేతాళ కథలు లేవు. క్షేమేంద్రుడు (సా.శ. 11 వ శతాబ్దం) ‘బృహత్కథామంజరి’, సోమదేవసూరి (సా.శ. 11 వ శతాబ్దం) ‘కథాసరిత్సాగరం’ లలోనే ఈ బేతాళ కథలు చోటుచేసుకొన్నాయి. కాలక్రమేణా బేతాళ పంచవింశతి పేరుమీదుగా కథాగ్రంధ రూపంలో వెలువడినప్పటికీ బేతాళ పంచవింశతి సంస్కృత మూల గ్రంథం మాత్రం లభించలేదు. అప్పటివరకూ పద్య రూపంలోనే వున్న బేతాళ పంచవింశతి కథలను తొలిసారిగా శివదాసు (సా.శ. 11-14 వ శతాబ్దం) చంపూ మార్గంలో (పద్య గద్య మయం) సంస్కృతంలో రాసాడు.
(ఇంకా…)
40వ వారం
మహాత్మా గాంధీ
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటాడు. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితం చేసిన రాజకీయ నాయకునిగా అతన్ని కేబుల్ న్యూస్ నెట్వర్క్ జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. చిన్నతనమునుండి అబద్ధాలు చెప్పే పరిస్థితులకు దూరముగా ఉండే ప్రయత్నము చేశాడు. 13 ఏండ్ల వయసులో అప్పటి ఆచారము ప్రకారము కస్తూరిబాయితో వివాహము జరిగింది. వీరికి నలుగురు పిల్లలు (హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ). చదువులో గాంధీ మధ్యస్థమైన విద్యార్థి. పోర్ బందర్ లోను, రాజ్‌కోట్ లోను అతను చదువు కొనసాగింది. 19 సంవత్సరాల వయసులో (1888 లో) న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండు వెళ్ళాడు. తల్లికిచ్చిన మాట ప్రకారము అతను మాంసానికి, మద్యానికి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడు.
(ఇంకా…)
41వ వారం
క్రికెట్ ప్రపంచ కప్
క్రికెట్ ప్రపంచ కప్ (అధికారికంగా ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్) ఒక అంతర్జాతీయ వన్ డే మ్యాచ్ క్రికెట్ పోటీ. దీనిని క్రికెట్ అధికారిక సంఘమైన అంతర్జాతీయ క్రికెట్ సంఘం (ఐసిసి) ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి నిర్వహిస్తుంది. ఈ పోటీలను ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రేక్షకులు వీక్షిస్తారు. ప్రస్తుతం భారతదేశంలో 2023 ప్రపంచ కప్ జరుగుతోంది.
మొట్టమొదటి క్రికెట్ ప్రపంచ కప్ 1975 జూన్ లో ఇంగ్లాండులో జరిగింది. 2019 దాకా 12 సార్లు ఈ పోటీ జరిగితే 20 జట్లు ఇందులో పాల్గొన్నాయి. ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా ఐదు సార్లు కప్ గెలవగా, వెస్టిండీస్, భారత్ రెండు సార్లు, పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్ ఒక్కోసారి కప్పు గెలిచాయి. ప్రస్తుత విధానంలో పోటీ ముందు మూడు సంవత్సరాల కాలం అర్హత దశ ఉంటుంది. ఈ దశ నుంచి అసలైన టోర్నమెంటులో పాల్గొనే జట్లేవో నిర్ణయిస్తారు. టోర్నమెంటులో మొత్తం పది జట్లు కప్పు కోసం పోటీ పడతాయి. ఈ పది జట్లలో పోటీలకు ఆతిథ్యం ఇచ్చే జట్టుకు కచ్చితంగా పాల్గొనే అర్హత ఉంటుంది.
ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ ప్రపంచ కప్ కొరకు, 2023 క్రికెట్ ప్రపంచ కప్ చూడండి.
(ఇంకా…)
యుద్ధం లేదా సంగ్రామం రెండు లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తులు, సంస్థలు, లేదా దేశాల మధ్య పెద్ద యెత్తున జరిగే ఘర్షణ. మానవ సమాజంలో యుద్ధాలు అనాదిగా ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉన్నాయి. చరిత్ర పూర్వ యుగంలో తెగల మధ్య జరిగిన కొట్లాటల నుండి తరువాత నగరాల మధ్య లేదా దేశాల మధ్య లేదా సామ్రాజ్యాల మధ్య అనేక రకాలుగా ఈ ఘర్షణలు జరిగాయి, జరుగుతున్నాయి. "యుద్ధం" అనే పదాన్ని దేశాల మధ్య జరిగే సాయుధ పోరాటాలకే పరిమితంగా వాడడం లేదు. "మతోన్మాదం పై యుద్ధం", "ఉగ్రవాదంపై యుద్ధం", "దారిద్ర్యంపై యుద్ధం", "అవినీతిపై యుద్ధం" వంటి అనేక సందర్భాలలో "యుద్ధం" అనే పదాన్ని వాడుతారు. యుద్ధం అనే ప్రక్రియ మానవ సమాజాల మధ్య మాత్రమే జరుగదు. చీమల దండుల మధ్య, చింపాంజీ ల సమూహాల మధ్య కూడా యుద్ధాలు జరుగుతాయని జంతు శాస్త్రం అధ్యయనాల వల్ల తెలుస్తున్నది.
యుద్ధం చేసేవారు సైనికులు. భూమిపైన పోరాడే సైనికులను కాల్బలంగా వ్యవహరిస్తారు. సముద్రంలో పోరాడే సేనలు నౌకాదళం. ఆకాశంలో పోరాడేవి వైమానిక దళాలు. యుద్ధం ఒకే సమయంలో వివిధ రంగాలలోను, వివిధ ప్రాంతాలలోను జరుగవచ్చును. ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొనే సైనిక దళమే కాకుండా గూఢచారి వ్యవస్థ, సమాచార వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక వ్యవస్థకు చెందిన అనేక వర్గాలు యుద్ధంలో పాల్గొంటాయి. ఆధునిక సాంకేతిక విజ్ఞానం వల్ల అభివృద్ధి అయిన క్షిపణుల వంటి పరికరాలు, పేలుడు పదార్థాలు యుద్ధాల స్వరూపాన్ని గణనీయంగా మార్చివేస్తున్నాయి.
(ఇంకా…)
గుండమ్మ కథ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో 1962 లో విజయ వాహినీ సంస్థ నిర్మించిన చిత్రం ఇది. ఇందులో సూర్యకాంతం, ఎన్. టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్. వి. రంగారావు, సావిత్రి, జమున ప్రధాన పాత్రలు పోషించారు. చక్రపాణి, డి. వి. నరసరాజు ఈ చిత్రానికి రచయితలు. ఈ చిత్రంలో పాటలన్ని పింగళి రాయగా ఘంటసాల సంగీతాన్నందించాడు. 1958 లో కన్నడంలో విఠలాచార్య తీసిన మనె తుంబిద హెణ్ణు అనే చిత్రానికిది పునర్నిర్మాణం. కథలో షేక్స్‌పియర్ రాసిన ద టేమింగ్ ఆఫ్ ద ష్రూ అనే నాటకంలోని కొన్ని పాత్రల చిత్రణను వాడుకుంటూ, తెలుగు సాంప్రదాయం ప్రకారం కొన్ని మార్పులు చేశారు. అప్పటి దాకా పౌరాణిక చిత్రాలకే దర్శకత్వం వహించిన కామేశ్వరరావు ఈ సినిమాతో మొదటిసారిగా సాంఘిక చిత్రాన్ని తీశాడు. అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్, కాని "గుండమ్మ కథ" అని సూర్యకాంతం పాత్ర పేరుమీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యం. హాస్యం, సంగీతం ఈ చిత్రానికి విజయాన్ని సమకూర్చాయి.
(ఇంకా…)
ఇస్లామిస్ట్ ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా వ్యవస్థాపకుడు, దాని మొదటి నాయకుడు ఒసామా బిన్ లాడెన్ను పాకిస్తాన్లో 2011 మే 2 న స్థానిక సమయం అర్ధరాత్రి 1:00 (భారత సమయం 1:30) తరువాత అమెరికా దేశపు నావల్ స్పెషల్ వార్ఫేర్ డెవలప్మెంట్ గ్రూప్ కు చెందిన నేవీ సీల్స్ సైనికులు సంహరించారు. ఈ బృందాన్ని DEVGRU లేదా సీల్ టీం సిక్స్ అని కూడా అంటారు. సిఐఎ నేతృత్వం వహించిన, ఆపరేషన్ ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ అనే పేరున్న ఈ ఆపరేషనులో సిఐఎ తో పాటు, దాడిలో పాల్గొన్న స్పెషల్ మిషన్ యూనిట్లతో సమన్వయం చేస్తూ జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ (JSOC) కూడా పాల్గొంది. పాకిస్తాన్ భూభాగంలో చేసిన ఈ ఆపరేషన్ను పాకిస్తాన్ బలగాలతో కలిసి సంయుక్తంగా చేపడితే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా పరిశీలించారు. కానీ ఈ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, సైన్యాన్నీ విశ్వసించలేమని బరాక్ ఒబామా నిర్ణయించాడు. దాడి ముగిసాక, అమెరికా చెప్పేదాకా ఈ దాడి జరిగిన సంగతి పాకిస్తాన్‌కు తెలియదు. బిన్ లాడెన్ భౌతిక కాయాన్ని విమాన వాహక నౌకలో తరలిస్తూ, ఉత్తర అరేబియా సముద్రంలో ఖననం చేసారు. బిన్ లాడెన్ చేసిన సెప్టెంబరు 11 దాడుల తరువాత, అతడి కోసం దాదాపు 10 సంవత్సరాల పాటు అమెరికా జరిపిన అన్వేషణ ఈ ఆపరేషనుతో ముగిసింది.
(ఇంకా…)
45వ వారం
భావరాజు వేంకట కృష్ణారావు
భావరాజు వేంకట కృష్ణారావు ప్రఖ్యాత చరిత్రకారుడు, శాసన పరిశోధకుడు, రచయిత, న్యాయవాది. వెంకటకృష్ణారావు ఆంధ్రదేశీయేతిహాస పరిశోధక మండలికి వ్యవస్థాపక కార్యదర్శి. ఈ సంఘం వెలువరించిన పత్రికకు అనే సంవత్సరాల పాటు సంపాదకత్వం వహించాడు. తూర్పు చాళుక్య చక్రవర్తి అయిన రాజరాజ నరేంద్రుని పట్టాభిషేకపు 900వ సంవత్సరీకపు ఉత్సవాలను నిర్వహించాడు. ఈ సందర్భంగా వెలువడించిన రాజరాజ నరేంద్రుని పట్టాభిషేక సంచికకు సంపాదకత్వం వహించాడు. 1922లో రాజమహేంద్రవరంలో ఇతర ప్రముఖ చరిత్రకారులు చిలుకూరి వీరభద్రరావు, డా.చిలుకూరి నారాయణరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మలతో కలిసి ఆంధ్రదేశీయేతిహాస పరిశోధక మండలిని స్థాపించాడు. ఆయన చారిత్రిక పరిశోధన ప్రాముఖ్యత గురించి వ్యాఖ్యానిస్తూ డా.వి.వి.కృష్ణశాస్త్రి, "ఆంధ్రదేశ చరిత్ర వ్రాయబూనిన ప్రతివారు మూలస్తంభాల వంటి భావరాజువారి గ్రంథాలను పఠించకపోతే ఆ రచనలు అసంపూర్ణంగానే పరిగణింపబడతాయి" అని అన్నాడు.
ధర్మవరపు సుబ్రహ్మణ్యం (1954 సెప్టెంబరు 20 - 2013 డిసెంబరు 7) తెలుగు సినిమా హాస్యనటుడు. టీవీ రంగం నుండి సినిమా రంగం లోకి ప్రవేశించాడు. స్వస్థలం ప్రకాశం జిల్లాలోని కొమ్మినేనివారి పాలెం .వామపక్షభావాలు కలిగిన సుబ్రహ్మణ్యం గతంలో ప్రజా నాట్యమండలి తరఫున ఎన్నో నాటకాలు, ప్రదర్శనలు ఇచ్చారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ఆనందోబ్రహ్మ (యర్రంశెట్టి సాయి) ద్వారా మంచి గుర్తింపు పొందాడు. చిత్రరంగంలో హాస్యపాత్రలో తనదైన ముద్ర వేశాడు. తోకలేని పిట్ట అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ విజయానికి తన వంతు కృషి చేసాడు. 2004 నుండి 2013 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శిగా కొనసాగాడు. 2013 డిసెంబరు 7 న అనారోగ్య కారణాలతో మరణించాడు.
(ఇంకా…)
47వ వారం
నార్కెట్‌పల్లి - అద్దంకి - మేదరమెట్ల రహదారి
నార్కెట్‌పల్లి - అద్దంకి - మేదరమెట్ల రహదారి (నామ్ ఎక్స్‌ప్రెస్‌వే) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గుండా వెళ్ళే ప్రధానమైన నాలుగు వరుసల రహదారి. ఇది NH 65లో తెలంగాణలోని నార్కెట్‌పల్లి వద్ద ప్రారంభమై NH 16లో ఆంధ్రప్రదేశ్‌లోని మేదరమెట్ల వద్ద ముగుస్తుంది. దీని వలన హైదరాబాద్ నుండి చెన్నైకి దూరం తగ్గుతుంది. దీని మొత్తం పొడవు 212.5 కిలోమీటర్లు. ఇది 1998 వరకు ఒకే వరుస రహదారిగా వుండేది. 2001-2010 కాలంలో రెండు వరుసల రవాణా సౌకర్యంతో "రాష్ట్ర రహదారి 36" గా మార్చారు. రాష్ట్రం లోని రహదారుల అభివృద్ది కొరకు ఆంధ్రప్రదేశ్, ప్రపంచ బ్యాంకు నుండి US$ 32 కోట్లు అప్పు తీసుకుంది. దీనిని నాలుగు వరుసలకు విస్తరించడానికి 2010 లో ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా అభివృద్ధి సంస్థ, 24 సంవత్సరాలు రహదారి సుంకం వసూలు చేసుకొనే అనుమతితో, నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చుకొనడం, నిర్మించటం, నిర్వహించటం, చివరిగా బదిలీ చేయడం ప్రాతిపదికపై, పోటీపద్ధతిలో రామ్కీ సంస్థ, ఐఎల్‌ఎఫ్‌ఎస్ ల సంయుక్త సంస్థ అయిన నామ్ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ ను గుత్తేదారుగా ఎంపిక చేసింది. మొత్తం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు 1196.84 కోట్లు.
(ఇంకా…)
48వ వారం
సార్వభౌమిక దేశపు దివాలా
సార్వభౌమిక దేశ ప్రభుత్వం తన రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన సమయంలో పూర్తిగా తిరిగి చెల్లించడంలో వైఫల్యం చెందడం లేదా చెల్లించేందుకు నిరాకరించడాన్ని సార్వభౌమిక దేశపు దివాలా అంటారు. ఇంగ్లీషులో దీన్ని సావరిన్ డిఫాల్ట్ అంటారు. బకాయి చెల్లింపులు నిలిపివేసేటపుడు ఆ ప్రభుత్వం, రుణాలను చెల్లించలేమని గాని లేదా పాక్షికంగా మాత్రమే చెల్లిస్తామని గానీ ప్రకటన చెయ్యవచ్చు లేదా అసలు ప్రకటన చెయ్యకనే పోవచ్చు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ సార్వభౌమ రుణ పునర్నిర్మాణం కోసం రుణాలు ఇస్తుంది. సార్వభౌమ రుణంలో మిగిలిన భాగాన్ని చెల్లించడానికి నిధులు అందజేయడానికి అది కొన్ని షరతులు విధిస్తుంది. దేశంలో అవినీతిని తగ్గించడం, లాభాపేక్షలేని ప్రభుత్వ రంగ సేవలను తగ్గించడం వంటి పొదుపు చర్యలు, పన్నులు పెంచడం వంటి షరతులపై రుణాలు అందిస్తుంది. 2010 మే లో గ్రీకు బెయిలౌట్ ఒప్పందం దీనికి ఒక ఉదాహరణ.
(ఇంకా…)
49వ వారం
ఎం.వి.ఎస్. హరనాథరావు
ఎం. వి. ఎస్. హరనాథ రావు (1948 జూలై 27 - 2017 అక్టోబరు 9) నాటక రచయిత, సినీ మాటల రచయిత, నటుడు. 150 సినిమాలకు పైగా సంభాషణలు రాశాడు. ప్రతిఘటన, భారతనారి, అన్న, అమ్మాయి కాపురం ఆయన సంభాషణలు రాసిన కొన్ని సినిమాలు. ఈ నాలుగు సినిమాలకు ఆయనకు నంది పురస్కారాలు దక్కాయి. 20 కి పైగా సినిమాల్లో నటించాడు. ఈయన తమ్ముడు మరుధూరి రాజా కూడా సంభాషణల రచయిత. హరనాథ రావు తన స్నేహితుడైన టి. కృష్ణ ద్వారా సినీ పరిశ్రమలో 1985 లో రచయితగా అడుగుపెట్టాడు. ఒక్క సినిమా మినహాయించి ఆయన తీసిన అన్ని సినిమాలకూ హరనాథ రావే సంభాషణలు రాశాడు. మరో వైపు కొన్ని సినిమాలలో కూడా నటించాడు.
తన 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 80 చిత్రాలకు రచయతగా, నటుడిగా 40 చిత్రాలకు పనిచేసారు. కె.విశ్వనాధ్, కె.రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, ఎ.కోదండరామిరెడ్డి, సురేష్ కృష్ణ వంటి దిగ్గజ దర్శకులతో పనిచేసిన అనుభవం ఈయన సొంతం. రచయితగా సినిమాల్లో, రంగస్థలంలో ఎన్నో పురస్కరాలు అందుకున్నాడు.
(ఇంకా…)
50వ వారం
ఆరావళి పర్వత శ్రేణులు
ఆరావళి పర్వతాలు వాయవ్య భారతదేశంలోని పర్వత శ్రేణి. ఈ పర్వత శ్రేణి ఢిల్లీ వద్ద మొదలై నైరుతి దిశలో సుమారు 670 కి.మీ.(430మైళ్లు) పాటు, దక్షిణ హర్యానా రాజస్థాన్ గుండా వెళ్ళి, గుజరాత్‌లో ముగుస్తుంది. ఈ పర్వత శ్రేణిలో ఎత్తైన శిఖరం గురు శిఖర్ - ఎత్తు 1,722 మీటర్లు. మూడు ప్రధాన నదులు, వాటి ఉపనదులూ ఆరావళి శ్రేణి గుండా ప్రవహిస్తున్నాయి. అవి, యమునకు ఉపనదులైన బానస్, సాహిబి నదులు, అలాగే రాన్ ఆఫ్ కచ్ లోకి ప్రవహించే లూని నది. ఆరావళి శ్రేణి వన్యప్రాణులతో సమృద్ధిగా ఉంది. హర్యానాకు చెందిన ఐదు జిల్లాల్లోని 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 2017 లోమొట్టమొదటిగా చేసిన వన్యప్రాణి సర్వేలో చిరుతపులులు, చారల హైనా, బంగారు నక్క, నీల్గాయ్, పామ్ సివెట్, అడవి పంది, రీసస్ మకాక్, పీఫౌల్, ఇండియన్ క్రెస్టెడ్ పోర్కుపైన్ లు కనిపించాయి.
(ఇంకా…)
51వ వారం
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
వై.యస్.జగన్మోహనరెడ్డి వ్యాపారవేత్త, రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్(నవ్యాంధ్ర) రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. అతను భారతీయ రాజకీయ పార్టీ అయిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు. అతను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డి తనయుడు. జగన్మోహనరెడ్ది తన రాజకీయ ప్రస్థానాన్ని భారత జాతీయ కాంగ్రెస్ లో ప్రారంభించి, 2009 మే నెలలో తొలిసారిగా కడప లోకసభ నియోజకవర్గం నుండి భారతదేశ లోక్ సభ సభ్యునిగా గెలుపొందాడు. తన తండ్రి 2009 లో జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్ర చేపట్టాడు. తరువాత భారత జాతీయ కాంగ్రెసుతో విభేదాల కారణంగా పార్టీ కి రాజీనామా చేసి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తన పార్టీ 67 స్థానాలను సాధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు. తరువాత అతను రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువై 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో 175 స్థానాలలో 151 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాడు. జగన్మోహనరెడ్డి తండ్రి "వై.యస్.ఆర్" గా సుపరిచితుడైన వై.ఎస్.రాజశేఖరరెడ్ది 2004 నుండి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహనరెడ్డి కడప జిల్లాలోని 2004 ఎన్నికల సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కి ప్రచారం చేయడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు.
(ఇంకా…)
52వ వారం
మొదటి ఆదిత్యచోళుడు
మొదటి ఆదిత్యచోళుడు (క్రీ.పూ.870-907) చోళరాజాన్ని మధ్యయుగంలో పున:స్థాపించిన విజయాలయ చోళుని కుమారుడు. విజయాలయ చోళుడు పల్లవులను ఎదిరించి తంజావూరు చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్రమించాడు. ఆ విస్తరణను మొదటి ఆదిత్యచోళుడు కొనసాగించాడు. పల్లవుల అంతర్యుద్ధంలో అపరాజిత వర్మన్ పక్షానికి సహాయం చేసి, తర్వాత అదే అతనిపైనే దండెత్తి చోళ రాజ్యాన్ని విశేషంగా విస్తరించాడు. ఈ క్రమంలో చేసిన వీరకృత్యాలకు, పొందినవిజయాలకు తొండైనాడును గెలుపొందినవాడిగానూ, అపరాజితుడిని యుద్ధంలో ఏనుగెక్కి చంపినవాడిగానూ, తొండైమండలంలో పల్లవుల పరిపాలనకు ముగింపు పలికినవాడిగానూ నిలిచి పేరొందాడు. ఆదిత్యచోళుడు తన పాలనలో 108 శివాలయాలను నిర్మించాడు. దాదాపు 36 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేసిన ఆదిత్యుడు 907లో మరణించాడు. ఇతనికి వారసునిగా ఇతని కుమారుడు మొదటి పరాంతకచోళుడు సింహాసనాన్ని అధిష్టించాడు. ఆదిత్యచోళుడు మరణించిన ప్రదేశంలో అతని చితాభస్మం మీద నిర్మించిన ఆదిత్యేశ్వర దేవాలయం (లేక కోదండరామేశ్వరాలయం) ఈనాటి శ్రీకాళహస్తి సమీపంలోని బొక్కసంపాడులో ఉంది.
(ఇంకా…)