వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 16వ వారం
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/6/6c/View_of_fields_at_Araku_Valley.jpg/100px-View_of_fields_at_Araku_Valley.jpg)
అరకులోయ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. అరకు లోయ అందమైన అడవులతో కూడిన కొండల ప్రాంతం. సముద్ర మట్టము నుండి 900 మీటర్ల ఎత్తున ఉండి అణువణువున ప్రకృతి రమణీయతతో విలసిల్లుతున్న అద్భుత పర్వతపంక్తి. అనేక కొండజాతులు ఈ ప్రాంతముపై ఆధారపడి జీవనము సాగిస్తున్నారు. విశాఖ నుంచి రైలులో అరకు చుట్టివెళ్ళే ప్రయాణం ఒక అందమైన అనుభూతినిస్తుంది. ఈ ప్రాంతము ప్రతి సినిమాలలో ఏదో ఒక భాగములో కనిపిస్తుంది. నిత్యము సినిమా షూటింగులతో బిజీగా ఉండే ఈ ప్రాంతము చూడదగ్గ పర్యాటక ప్రదేశం. ఇది తూర్పు కనుమల లో ఉంది. ఇది విశాఖపట్నం నుండి 114 కి.మీ దూరంలో ఒడిషా రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉంది. అనంతగిరి మరియు సుంకరిమెట్ట రిజర్వు అడవి ఈ అరకులోయలో ఒక భాగము. ఇచట బాక్సైట్ నిక్షేపాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం అయిన గాలికొండ ఇచట ఉంది. దీని ఎత్తు 5000 అడుగులు (1500 మీటర్లు). ఇచట జూన్-అక్టోబరు నెలల మధ్య సరాసరి వర్షపాతం 1,700 మి.మీ (67 అంగుళాలు). ఈ ప్రాంతం సముద్రమట్టానికి 1300 ఎత్తున ఉన్నది. ఈ లోయ 36 కి.మీ విస్తరించి ఉంది. అరకు లోయకు ఘాట్ రోడ్డు మార్గం ద్వారా వెళుతున్నప్పుడు రోడ్డుకిరువైపుల ఉన్న దట్టమైన అడవులు కనువిందు చేస్తాయి. ఇక్కడ ట్రెక్కింగ్ భలే సరదాగా ఉంటుంది. మొత్తం 46 టన్నెళ్లు, బ్రిడ్జిలు ఉంటాయి. ఇక అరకులోయకు వెళ్లే మార్గమధ్యంలో దర్శనమిచ్చే అనంతగిరి కొండలు కాఫీ తోటలకు ప్రసిద్ధి. బొర్రా గుహలు అరకులోయకు సుమారు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
(ఇంకా…)