శ్రీహర్షుడు

12వ శతాబ్దానికి చెందిన భారతీయ సంస్కృత కవి, తత్వవేత్త, భాషాశాస్త్ర పండితుడు.

శ్రీహర్షుడు 12వ శతాబ్దానికి చెందిన భారతీయ సంస్కృత కవి, తత్వవేత్త, భాషాశాస్త్ర పండితుడు. తన రాజు కోరికమీద నైషాధ చరిత అనే కావ్యం రాశాడు.

జీవిత విషయాలు

మార్చు

శ్రీహర్షుడు శ్రీహీరుడు,మామల్లదేవి దంపతులకు జన్మించాడు. మామల్లదేవి మంచి విదుషీమణి శ్రీహీరుడు మధ్యభారతదేశంలోని గహదవాల రాజు విజయచంద్ర ఆస్థానంలో కవిగా ఉండేవాడు.[1] శ్రీహర్షుని తండ్రి శ్రీహీరుడు ఒక పండితుడి చేతిలో ఓడిపోయినందుకు అవమానంతో మరణించాడు. దాంతో శ్రీహర్షుడి తల్లి మామల్లదేవి తన భర్తకు కలిగిన అవమానానికి తన కుమారుడి ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. శ్రీహర్షుడికి శివచింతామణి మంత్రాన్ని ఉపదేశించి అతడిని తన వడిలో కూర్చోబెట్టుకొని, కళ్ళు మూసుకొని ఆ మంత్ర జపించమని చెప్పి తాను కత్తితో పొడుచుకొని చనిపోయింది. తన తల్లి శవంపై కూర్చొని చింతామణి జపాన్ని చేయగా శ్రీహర్షుడికి మంత్రసిద్ధి కలిగి ప్రతీకారం తీర్చుకున్నాడు.[2]

నైషాధ చరిత

మార్చు

1174లో విజయచంద్ర కుమారుడు జయచంద్ర పాలనలో శ్రీహర్షుడు సంస్కృతంలో ఈ నైషాధ చరిత కావ్యాన్ని రాశాడు. ఆ కావ్యం మొదటిసారిగా శ్రీహర్షుడి తల్లి మామల్లదేవి చదివింది. చదివడానికి ఇది చాలా కష్టంగా ఉందని, మళ్ళీ రాయమని చెప్పంది. తల్లిమాట మేరకు రెండోసారి రాయగా, అది కూడా అలాగే ఉండడంతో మూడోసారి రాసినపుడు నలదమయంతుల కథతో అద్భుతమైన కావ్యం రూపుదిద్దుకుంది. రాజశేఖరుడు రాసిన ప్రబంధకోస ప్రకారం, నైషాధ చరితం విస్తృతంగా ప్రచారమైన తరువాత శ్రీహర్షుడు నరభారతి అనే బిరుదుతో గౌరవించబడ్డాడు.[1] శ్రీహర్షుడు రచించిన ఈ కావ్యాన్ని పండితులు విమర్శిస్తూంటే, చింతామణి మంత్రంతో కాశ్మీర దేశంలోని సరస్వతీదేవిని ఉపాసించి, అందరి ప్రశంసలూ పొందాడు. నైషాధ చరితలో శృంగార ఇతివృత్తాలు ఉన్నాయి, కానీ 15వ శతాబ్దపు జైన పండితుడు నాయచంద్ర సూరి ప్రకారం, శ్రీహర్షుడు నిజానికి బ్రహ్మచారి, అతను "తన జ్ఞానేంద్రియాలను జయించాడు" అని పేర్కొన్నాడు.[3]

వ్యాసభారతంలోని నలదమయంతి ఇతివృత్తం ఆధారంగా శ్రీహర్షుడు మంత్రయోగవేదాంత శాస్త్రాల రహస్య పీఠికగా దీనిని రచించాడని 1968లో వెలువడిన స్వర్ణహంసలో కవి గుంటూరు శేషేంద్ర శర్మ పేర్కొన్నాడు.[4] దీనిని శృంగార నైషధం పేరుతో కవి సార్వభౌమ బిరుదాంకితుడు శ్రీనాథుడు తెలుగులోకి అనువదించాడు.

ఇతర రచనలు

మార్చు

శ్రీహర్షుడు తన తరువాతి జీవితాన్ని గంగా నది ఒడ్డున సన్యాసిగా ప్రశాంతంగా గడిపాడు. శ్రీహర్షుడు అనేక ఇతర రచనలను రాశాడు కానీ, వాటిలో ఏవీ ఇప్పుడు అందుబాటులో లేవు. వాటిలో విజయప్రసస్తి, చిందప్రసస్తి, గౌదోర్విసాకులప్రసస్తి, సహస్కాకారిత, అర్నవర్ణన,అమరఖండన ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 M. Srinivasachariar 1974, p. 177.
  2. ఆంధ్రభూమి, ఇతర వివరాలు (27 June 2019). "భుక్తికి, ముక్తికి లలితోపాసనే". www.andhrabhoomi.net. Archived from the original on 7 July 2020. Retrieved 7 July 2020.
  3. Phyllis Granoff 2006, p. 37.
  4. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 February 2017). "ది గోల్డెన్‌ స్వాన్‌". www.andhrajyothy.com. Archived from the original on 6 July 2020. Retrieved 6 July 2020.

ఇతర లంకెలు

మార్చు