శ్రీ శుకబ్రహ్మాశ్రమం

శ్రీ శుకబ్రహ్మాశ్రమం శ్రీకాళహస్తిలో ఉన్న ఒక వేదాంత ఆశ్రమం, సేవా కేంద్రం. దీనిని మలయాళ స్వామి శిష్యుడైన శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి 1950 జనవరి 20 న స్థాపించాడు.[1] అన్ని వర్గాల ప్రజలకు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని పంచడం, సామాజిక సేవ లక్ష్యంగా ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. మలయాళ స్వామి వేద సంకలనకర్తయైన వ్యాసుడి పేర శ్రీ వ్యాసాశ్రమాన్ని స్థాపిస్తే ఆయన శిష్యుడైన విద్యాప్రకాశానందగిరి వ్యాస మహర్షి పుత్రుడైన శుక మహర్షి పేరుతో ఈ ఆశ్రమాన్ని ప్రారంభించాడు. ఈ ప్రారంభోత్సవం మలయాళ స్వామి చేతులమీదుగా జరిగింది. ఆశ్రమం ప్రారంభించినప్పటి నుండి 1998 లో విద్యాప్రకాశానంద మరణించే దాకా ఆయనే అధ్యక్షుడుగా వ్యవహరించాడు. ఆయన తదనంతరం ఈ ఆశ్రమానికి విద్యా స్వరూపానంద స్వామి అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నాడు.

శ్రీ శుకబ్రహ్మాశ్రమ ప్రవేశ ద్వారం

చరిత్ర

మార్చు

ఈ ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ విద్యాప్రకాశానంద గిరి స్వామి ఏర్పేడులోని శ్రీ వ్యాసాశ్రమంలోకి ప్రవేశించి, మలయాళ స్వామి చేతుల మీదుగా సన్యాసాశ్రమం స్వీకరించాడు. తర్వాత తానే స్వయంగా ఒక ఆశ్రమాన్ని స్థాపించ దలుచుకున్నాడు. దానికి తగిన స్థలం కోసం అన్వేషణ చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఆయన తొడపై ఒక కురుపు లేచింది. దానికి చికిత్స కొరకు శ్రీకాళహస్తికి చెందిన పి. వి. రామచంద్రరావుకు చెందిన ఒక తోటలో విడిది చేయగా, ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఒక వైద్యుడు వచ్చి క్రమం తప్పకుండా కట్టు కట్టి వెళుతుండేవాడు. ఒకరోజు రాత్రి పెద్ద వర్షం వచ్చింది. ఉదయం లేచి నడకకు వెళ్ళిన ఆయనకు బురద అంటని ఆ ఇసుక నేలను చూసి అక్కడే ఆశ్రమం నెలకొల్పాలని సంకల్పం కలిగింది.[2]

ఆశ్రమ ప్రాంగణం

మార్చు
 
ధ్యానమందిరం

ఈ ఆశ్రమం శ్రీకాళహస్తి ప్రధాన ఆలయానికి దక్షిణంగా ఒక కిలోమీటరు దూరంలో స్వర్ణముఖి నది ఒడ్డున విశాల ప్రాంగణంలో విస్తరించి ఉంది. తిరుపతి నుంచి సుమారు 41 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆశ్రమ ఆవరణలో అనేక రకాలైన పండ్ల చెట్లు ఉన్నాయి.

విద్యాప్రకాశానందగిరి స్వామి పరమపదించాక, ఆశ్రమంలోనే ఆయన సమాధిని నిర్మించారు. ఆ సమాధి వద్ద ఒక ధ్యానమందిరం నిర్మించారు. మందిరం పైకప్పు శివలింగం ఆకారంలో మలిచారు. ఇక్కడ నిర్ణీత సమయాల్లో ఎవరైనా వచ్చి ధ్యానం చేసుకోవచ్చు.

సేవలు

మార్చు

1993 వ సంవత్సరంలో పేదల కంటి వైద్యం కోసం ఆశ్రమ ప్రాంగణంలో భక్త కన్నప్ప (త్రినేత్ర) కంటి వైద్యశాలను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో 30 పడకలు ఉన్నాయి. 2015 జూలై నాటికి 19,300 మందికి కంటి శుక్లాల శస్త్రచికిత్స చేసి లెన్సులు అమర్చారు. సుమారు రెండు లక్షల మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఆసుపత్రి తరపున గ్రామాల్లో ప్రతి మంగళ వారం వైద్యశిబిరాలు నిర్వహిస్తారు. ఈ ఆసుపత్రిలో చికిత్స, మందులు, భోజనం, వసతి అన్నీ ఉచితం.[3]

2003 లో ఆశ్రమ అధ్యక్షుడు విద్యాస్వరూపానంద గిరి స్వామి సద్గురు సర్వసేవా ట్రస్టు అనే పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ తరపున నిరుపేదలైన వృద్ధులకు ఒక వృద్ధాశ్రమం ప్రారంభించారు. ఆశ్రమానికి వచ్చే భక్తులకు, కంటి ఆసుపత్రి రోగులకు, ఆశ్రమ వాసులకు నిత్యం భోజనం ఉచితంగా అందజేస్తున్నారు. ఆశ్రమంలో ఒక గోశాల కూడా ఉంది.

పుస్తకాలు

మార్చు
 
సరస్వతీ నిలయం, పుస్తక విక్రయశాల

ఈ ఆశ్రమం తరపున వేదాంత భేరి అనే మాసపత్రిక వెలువడుతున్నది.[3] ఆశ్రమ ఆవరణంలోనే ప్రవేశ ద్వారానికి సమీపంలో ఒక పుస్తక విక్రయశాల ఉంది. ఇందులో వేదాంతానికి సంబంధించిన అనేక రకాల పుస్తకాలు లభ్యమవుతాయి.

డిగ్రీ కళాశాల

మార్చు

ఈ ఆశ్రమం తరపున శ్రీ విద్యాప్రకాశానంద గిరి స్వామి ఇచ్చిన విరాళంతో 1966 లో శ్రీకాళహస్తిలో డిగ్రీ కళాశాల స్థాపించారు. 1982 లో ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలను కూడా ప్రారంభింపజేశారు.

దైనందిన కార్యక్రమాలు

మార్చు

ఆశ్రమంలో ప్రతిదినం కింది విధంగా కార్యక్రమాలు జరుగుతూంటాయి.

  • ఉదయం: 5.30 - 6.00 - సామూహిక ధ్యానం
  • ఉదయం: 6.00 - 7.15 - భగవద్గీతా పారాయణ, హారతి. యోగ తరగతులు
  • ఉదయం: 8.00 - అల్పాహార ప్రసాదం
  • ఉదయం: 9.30 - 11.30 - భగవద్గీతా తరగతులు, ఆశ్రమ శివాలయములో పూజ
  • మధ్యాహ్నం: 12.30 - మధ్యాహ్న భోజన ప్రసాదం
  • సాయంత్రం: 4.00 - 5.00 - సత్సంగము
  • సాయంత్రం: 6.30 - 7.30 - భజనలు, హారతి.
  • సాయంత్రం: 7.30 - రాత్రి భోజన ప్రసాదం

మూలాలు

మార్చు
  1. "స్వామి విద్యాప్రకాశానంద స్వామి గురించి". srisukabrahmashram.org. శ్రీ శుకబ్రహ్మాశ్రమం. Archived from the original on 17 November 2016. Retrieved 8 November 2016.
  2. శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి. శ్రీ శుకబ్రహ్మాశ్రమము. శ్రీకాళహస్తి: శ్రీ శుకబ్రహ్మాశ్రమం. p. 12.
  3. 3.0 3.1 "శ్రీ శుకబ్రహ్మాశ్రమంలో సేవలు". srisukabrahmashram.org. srisukabrahmashram. Archived from the original on 2 April 2017. Retrieved 8 November 2016.