సప్తపర్ణి (పుస్తకం)
సప్తపర్ణి వ్యాససంకలనాన్ని కాండ్రేగుల నాగేశ్వరరావు రాశారు. చిత్రకళ గురించిన పలు అంశాలను, సినిమాల గురించిన విశేషాలను నాగేశ్వరరావు వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలను ఈ పుస్తక రూపంలో సంకలనం చేశారు.
సప్తపర్ణి | |
కృతికర్త: | కాండ్రేగుల నాగేశ్వరరావు |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | చిత్రకళ |
ప్రచురణ: | |
విడుదల: | 2013 |
రచన నేపథ్యం
మార్చుకళలను ఆస్వాదించేందుకు కొంత అభినివేశం అవసరం. తెలుగువారిలో తమకు లోతైన అవగాహన ఉన్న కళల పట్ల పాఠకులకు అభిరుచి పెంచేలా కొందరు రచయితలు సాహిత్యం రచించారు. హిందుస్తానీ సంగీతం గురించి సామల సదాశివ, కొడవటిగంటి రోహిణీప్రసాద్ పుస్తకాలు, వ్యాసాలు రాశారు. పలువురు చిత్రకారుల జీవితం, వారి చిత్రకళ గురించి ప్రముఖ చిత్రకారుడు మోహన్ రాసిన పుస్తకాలు ఈ కోవలోనివే. ఈ నేపథ్యంలో పలు కళలపై అభినివేశం ఉన్న మిసిమి పత్రిక సహసంపాదకుడు కాండ్రేగుల నాగేశ్వరరావు చిత్రకళ గురించి, శిల్పకళ గురించి, సినిమాల గురించి రాసిన వ్యాసాల సంకలనం ఈ పుస్తకం.
అంశాలు
మార్చుపుస్తకంలోని 68 వ్యాసాల్లో 47కు పైగా వ్యాసాలతో చిత్ర కళకు సంబంధించిన వ్యాసాలది అతిపెద్ద వాటా. చిత్రకళలో అతిరథ మహారథుల గురించీ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పికాసో గుయెర్నికా లాంటి కళాఖండాల గురించి, క్యూబిజం, డాడాయిజం వంటి ధోరణులు, చిత్ర శిల్ప కళల్లో నగ్నత్వం లాంటి అంశాలపై వ్యాసాలున్నాయి. ఈ వ్యాసాల్లో ప్రముఖంగా డాడాయిజం, ఇంప్రెషనిజం, అధివాస్తవికత(సర్రియలిజం), విశిష్ట వాదం(క్లాసిక్) వంటి వివిధ చిత్రకళా శైలులు, తాత్త్వికతలలో, తెలుపు రంగు, భారతీయ సంప్రదాయ రంగులు వంటి వివిధ వర్ణాల్లో ప్రయోగాలు చేసి వాటికి ప్రతినిధులుగా నిలిచిన పాశ్చాత్య, భారతీయ వైతాళికులను ఎంచుకుని వ్యాసాలు రాశారు. చిత్రకళ వ్యాసాలే కాక సిటిజన్ కేన్, మిథునం వంటి సినిమాల గురించి వ్యాసాలు, శిల్పకళ గురించి కొన్ని వ్యాసాలు మొదలైనవి ఈ సంకలనంలో ఉన్నాయి.
కథనం
మార్చుచిత్రకళాంశాలను వివరించడంతో పాటు పాఠకునికి చిత్రకళ ఆస్వాదన, ఆసక్తి పెరిగేలా ఆ రంగానికి సంబంధించిన విశేషాంశాలు అందిస్తూ వ్యాసరచన చేశారు. ఈ క్రమంలో ప్రముఖ చిత్రకారుల గురించిన వ్యాసాల్లో వారి చిత్రాల్లో ప్రాముఖ్యత పొందిన కళాఖండాలు ఆస్వాదించేందుకు వీలుగా అందంగా ప్రచురించారు. ఆయా చిత్రాల గురించి కొన్నిచోట్ల విశ్లేషణలు, సూచనలు ఇచ్చారు. చివరి అట్టలోపల సిస్టెయిన్ చాపెల్ (బహుశా చర్చిలోని కుడ్యచిత్రం అనుకుంటా) మైకెలాంజిలో వేసిన కుడ్యచిత్రం, మొదటి అట్టలోపల చిత్రకారిణి బ్రిడెట్ రిలే డిజైన్ లతో అలంకరించారు. వివిధ సైజుల్లో, నాణ్యంగా అచ్చొత్తిన చిత్రాలు మూడంకెల సంఖ్యను దాటేసాయి.
శైలి, ఉదాహరణలు
మార్చుఇందులో రచయిత భాష సూటిగా, సరళంగా ఉంది. నాగేశ్వరరావు గారు చిత్రకళకు చెందిన సాంకేతికాంశాలను కూడా విషయంలోని స్పష్టత కోల్పోకుండా వీలైనంత తేలికగా అర్థమయ్యే వాడుక భాషలోనే రాశారు. మరీ క్లిష్టమైన అంశాలే తీసుకోకుండా వైవిధ్యమైన, వినోదభరితమైన విశేషాలు, అభిరుచిని పెంపొందించే అంశాలు తీసుకుని ఆసక్తికరంగా రాశారు.