హరవిలాసము
హరవిలాసము కవిసార్వభౌమునిగా ప్రసిద్ధుడైన శ్రీనాథుడు రాసిన కావ్యం. ఈ గ్రంథం శైవభక్తుల జీవితాల్లో పరమేశ్వరుడైన శివుడు చేసిన పలు లీలల సంకలనం.శిరియాళుడు, చిరుతొండనంబి మొదలైన పలువురు శివభక్తుల జీవితగాథలు ఈ గ్రంథానికి ఇతివృత్తం.
హరవిలాసము | |
కృతికర్త: | శ్రీనాథుడు |
---|---|
ముద్రణల సంఖ్య: | 3 |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | శైవము |
విభాగం (కళా ప్రక్రియ): | ప్రబంధం |
ప్రచురణ: | వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ |
విడుదల: | 1916 |
![](http://up.wiki.x.io/wikipedia/te/thumb/2/2e/%E0%B0%B9%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B8%E0%B0%AE%E0%B1%81.jpg/220px-%E0%B0%B9%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B8%E0%B0%AE%E0%B1%81.jpg)
ఇతివృత్తం
మార్చుశ్రీనాథుడు పలువురు మహాశివభక్తుల జీవితాలను, వాటిలోని శివలీలలను ఈ గ్రంథం రూపంలో సంకలనం చేశారు. ఇందులో వర్ణించిన భక్తుల జీవితాల్లో ఈ క్రిందివారు వున్నారు:
- చిరుతొండనంబి
- ఒడయనంబి
ఇది 7 ఆశ్వాసముల ప్రబంధము . పైగ్రంథములలో నెయ్యెడ నిది పేర్కొనబడనందున గాశికాఖండమునకు బిదప రచించె ననవలసియున్నది. అన్ని గ్రంథములకన్న స్వాభావికమగుకవితాశైలియు నీవిషయమునే బలపఱుచుచున్నది. ఇయ్యది క్రీ. శ. 1370 సం. మొ 1391 సం. వఱకుఁ గొండవీటిసీమఁ బాలించిన వేమారెడ్డి కాలములో బాలుఁడై వేమారెడ్డిపుత్రుం డనపోతరెడ్డి సేనాధిపతియై యుద్ధములో మడియుటచే నాతనియనంతరముననే రాజ్యమునకు వచ్చిన కొమరగిరి భూపాలుని సుగంధద్రవ్యభాండాగారాధ్యక్షుఁడైన యనచి తిప్పసెట్టి కంకిత మీఁబడింది. హరవిలాసములో నీతడు 'మంటి బహువత్సరంబులు’ అని చెప్పుకొనుటచేఁ గృతినందునాఁటికి 65 సం. వయసువాఁడై యుం డును. ఇతనికి బాల్యసఖుఁడగు శ్రీనాథుఁడును 50 సం. వయసువాఁడై యుండును.
తిప్పసెట్టి వైశ్యుఁడు (బేరిసెట్టి) తండ్రి దేవయసెట్టి. తల్లి మాచమ్మ. జామిసెట్టి, తిరుమలనాథసెట్టియుఁ దమ్ములు. భార్య అన్నమ్మ, మాచన, విశ్వనాథుఁడు, చినమల్లన కుమారులు. ఇతనికిఁ ద్రిపురారియను సంస్కృతనామము గలదు. ఈతనివంశచరిత్రమంతయు హరవిలాసపీఠికవలనం దేటపడుచున్నది.
ఈ కావ్యమునందు 1,2 ఆశ్వాసముల సిరియాళచరిత్రమును, 3, 4 ఆ గౌరీకల్యాణమును, 5-వ ఆ. పార్వతీపరమేశ్వరులదారుకావిహారంబును, 6-వ ఆ. హాలాహలభక్షణంబును, 7-వ ఆ. కిరాతార్జునీయమును వర్ణింబడినవి. 5-వ యాశ్వాసముతుదిఁ గొన్నిపద్యము లశ్లీలములుగ నుండుటచే విడువంబడినవి. పూర్వకవిసంప్రదాయానుసారముగ నితరగ్రంథముల నుభయభాషాకవిస్తుతి చేయఁబడియున్నను నిందు కవిస్తుతి కాని కుకువినింద గాని చేయఁబడమికి కారణము దెలియదు. ఇయ్యది నైషధాదులవలె సంస్కృతపదప్రచురము గాక సమసంస్కృతాంధ్రపదవిలసితమై రసభావాలంకృతంబై యలరారుచున్నది. నైషధకాశీఖండములవలె సంపూర్ణసంస్కృతగ్రంథభాషాంతరీకరణము గాదుకాని యిందలిగౌరీకల్యాణము కాళిదాసకుమారసంభవమున కాంధ్రీకరణముగానే యున్నది స్థాలీపులాకన్యాయంబుగ నుదాహరించెద.
ఇట్లే దారుకావనవిహారము, హాలాహలభక్షణము, కిరాతార్జునీయము ప్రాయికముగా భారవికృతినుండియుఁ దక్కినకథలు పురాణములనుండియు గ్రహింపఁబడినవి. అచ్చటచ్చట నౌచితికిఁ దగినట్లు చంకదుడ్డును శరణార్జి, (ఆ-6. ప-1) మున్నగులోకోక్తుల నిమిడ్చి యున్నాఁడు. చాగు, ఉక్కెవడి, గగ్గోడువడు, చాయగోసులు, కుండవర్ధనములు, తోరహత్తము, గజ్జులాఁడు మున్నగు క్రొత్త పదములఁ బెక్కింటిఁ బ్రయోగించి యున్నాడు. 'వాగ్వీవాదము. (ఆ. 4.ప 70.) అంతర్వాణీసంస్థూయమాన, (పీఠిక. ప. 34) 'యనుప్రామాదిక ప్రయోగములు గనఁబడుచున్నవి. 6-వ యాశ్వాసము 5,6 పద్యము లేకార్థబోధకములై పునరుక్తములుగ నున్నవి.
ఇ ట్లేదోషములున్నను నల్పజ్ఞు లగులేఖకులవియై యుండును గాని సకలశాస్త్రపారంగతుఁడును మహాకవిసార్వభౌముఁ డగు శ్రీనాథునివై యుండవు. ఇట్టి జగత్ప్రసిద్ధంబగు ప్రౌఢపండితకవికవితామతల్లిం గుఱించి శాఖాచంక్రమణ మనవసరంబ కాఁ దలంచి యింతటితో విరమించుచున్నాఁడను.
ప్రచురణ, ముద్రణ
మార్చుఈ ప్రబంధాన్ని 1916, 1931, 1966 సంవత్సరాలలో మూడు సార్లు వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ చెన్నై నుండి ముద్రించారు.