హిందూ కాలగణన
హిందూ కాలగణన (Hindu calendar) కాలక్రమాన అనేక మార్పులు చెందింది. ఫలితంగా ప్రస్తుతం వివిధ ప్రాంతీయ కాలగణనా విధానాలున్నాయి. అధికంగా హిందూ కాలగణన సూర్య సిద్ధాంతం ఆధారంగా ఉంది. ఇది సుమారుగా సా.శ.. 3వ శతాబ్దానికి ప్రామాణికంగా రూపొందినట్లు భావిస్తున్నారు. ఇది వేదాంగాలలో ఒకటైన జ్యోతిషం అనే భాగంగా పరిగణింపబడుతుంది. ఆర్యభట్టుడు (సా.శ.. 499), వరాహమిహిరుడు (6వ శతాబ్దం), భాస్కరాచార్యుడు (12వ శతాబ్దం) వంటి జ్యోతిశ్శాస్త్రవేత్తలు ఈ కాలగణనను మరింత అభివృద్ధి చేశారు. సంవత్సరాలు గణన చెయ్యడం కోసం శకాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. వివిధమైన శకాలు ఆచరణలో ఉన్నాయి. కలి శకం, (క్రీస్తుశకం+3101) శాలివాహన శకం, విక్రమార్క శకం, క్రీస్తు శకం, ఆది శంకర భగవత్పాదుల శకం, శ్రీకృష్ణదేవరాయల శకం మొదలైనవి.
- దక్షిణ భారత కాలగణన పద్ధతి - శాలివాహన శకం
- ఉత్తర భారత కాలగణన పద్ధతి - విక్రమార్క శకం

భారత ప్రభుత్వం స్వాతంత్ర్యం వచ్చాక శాలివాహన శకాన్ని కాలగణనానికి ప్రామాణికంగా తీసుకొంది. పంచాంగాలలో సంవత్సర కాలగణనం కలిశకం, శాలివాహనశకం లలో చేస్తారు.
రెండు సూర్యోదయాలమధ్య కాలం ఒక రోజు.