హొ చి మిన్

20వ శతాబ్దపు వియత్నాం కమ్యునిస్టు నాయకుడు

హొ చి మిన్ (Ho Chi Minh) (మే 19, 1890 - సెప్టెంబరు 3, 1969) వియత్నాం సామ్యవాద నాయకుడు, ఫ్రెంచ్ వారి వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన వియత్నాం పోరాటంలో ముఖ్య సూత్రధారి. ఇతని అసలు పేరు గుయెన్ టాట్ థన్.

హొచిమిన్ (కుడి ప్రక్క), వో నిగుయెన్ గియాప్ (ఎడమ ప్రక్క)
హానోయ్ నగరంలో హొ చి మిన్ మౌసోలియమ్
హొ చి మిన్ విగ్రహం

హొ చి మిన్ 1890 మే 19న మధ్య వియత్నాం లోని కింలీన్ అనే గ్రామంలో జన్మించాడు. ఆ కాలంలో ఫ్రెంచి వారి వలస పాలనలో ఉన్న ఇండోచైనా ప్రాంతంలో వియత్నాం ఒక భాగంగా ఉండేది. సెకండరీ స్కూల్ విద్య పూర్తయిన తరువాత 1911లో ఒక ఫ్రెంచి స్టీమర్లో వంట పని సహాయకునిగా చేరి ఆ తరువాత లండన్, పారిస్‌ లలో పనిచేశాడు.

మొదటి ప్రపంచయుద్ధం ముగిసిన తరువాత ఫ్రెంచి కమ్యూనిష్టు పార్టీ స్థాపనలో పాలు పంచుకున్నాడు. ఆ తదుపరి శిక్షణ కొరకు మాస్కో వెళ్ళాడు. ఆ తరువాత 1924లో చైనా వెళ్ళి అక్కడ తన దేశ ప్రవాసులతో విప్లవోద్యమాన్ని నిర్మించాడు. 1930లో ఇండో చైనా కమ్యూనిష్టు పార్టీను చైనాలో స్థాపించాడు. హాంకాంగ్లో కమ్యూనిష్టు ఇంటర్నేషనల్ ప్రతినిథిగా ఉన్న సమయంలో 1931 జూన్ నెలలో బ్రిటిష్ పోలీసులు హొను అరెష్టు చేసి 1933 వరకు జైలులో ఉంచారు. విడుదలైన తరువాత మరలా సోవియట్ యూనియన్ వెళ్ళి తనకు సోకిన క్షయ వ్యాధి నయమయేంతవరకూ అక్కడే ఉన్నాడు. 1938లో మరలా చైనా వెళ్ళాడు.

1941లో జపాన్ వియత్నాంను ఆక్రమించినపుడు ఇండో చైనా కమ్యూనిష్టు పార్టీతో తిరిగి సంబంధాలు ఏర్పరచుకుని వియెత్ మిన్ అనబడే గెరిల్లా సైన్యాన్ని నిర్మించి జపాన్ సైన్యంతో పోరాడాడు. 1945 ఆగస్టులో రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్ లొంగిపోయిన తరువాత వియత్ మిన్ అధికారాన్ని హస్తగతం చేసుకుని హనోయ్ రాజధానిగా హొ చి మిన్ నాయకత్వంలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాంను ప్రకటించింది. ఈ యుద్ధ సమయంలో పెట్టుకున్న మారుపేరే హొ చి మిన్. ప్రకాశవంతమైనవాడు (Enlightener or He who shines) అని దీని అర్థం.

ఫ్రెంచ్ వారికి వారి వలసలను వదలుకోవటం ఇష్టంలేక పోవటంతో 1946 చివరలో ఇరుసేనల మధ్యన యుద్ధం ప్రారంభమైనది. 8సం.లు వియెత్ మిన్ గెరిల్లాలు ఫ్రెంచ్ దళాలతో పోరాడి చివరకు వారిని దీన్ బీన్ ఫు యుద్ధంలో 1954లో ఓడించాయి. తరువాత జెనీవాలో జరిగిన చర్చలలో దేశం విభజింపబడి ఉత్తర ప్రాంతం మాత్రమే వియత్ మిన్ ఉద్యమకారులకు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఏర్పడిన ఉత్తర వియత్నాంలో హొ చి మిన్ సామ్యవాద సమాజాన్ని నిర్మించటానికి పూనుకున్నాడు.

1960 వ దశకం ప్రారంభంలో సైగాన్ రాజధానిగా అమెరికా సహాయంతో దక్షిణ వియత్నాంను పరిపాలిస్తున్న కమ్యూనిష్టేతర ప్రభుత్వం మీద కమ్యూనిష్టు గెరిల్లాలు యుద్దాన్ని ప్రారభించారు. ఈ యుద్దమే చరిత్రలో వియత్నాం యుద్ధంగా పిలువ బడింది. ఉభయ వియత్నాంలను ఏకీకృతం చేయ తలపెట్టిన హొ ప్రభుత్వం దక్షిణ వియత్నాంలో అచటి ప్రభుత్వ సైన్యాలమీద, అమెరికా సైన్యాలమీద పోరాడుతున్న గెరిల్లాలకు సహాయంగా సైన్యాన్ని పంపినది.

హొచిమిన్ ఆరోగ్యం క్షీణించి సెప్టెంబరు 3, 1969లో మరణించాడు. ఇతని మరణానంతరం ఇతని అనుచరులు దక్షిణ వియత్నాం లోని కమ్యూనిష్టు గెరిల్లాలకు సహాయాన్ని కొనసాగించారు. హొచిమిన్ చనిపోయిన తరువాత ఆరేళ్ళకు 1975లో దక్షిణ వియత్నాంలో కమ్యూనిష్టులు అధికారంలోకి రావడంతో ఉభయ వియత్నాంలు కలిపివేయబడి సైగాన్ పట్టణానికి హొచిమిన్ సిటీగా నామకరణం జరిగింది.

సంతకము

మార్చు

 

మూలాలు

మార్చు
"https://te.wiki.x.io/w/index.php?title=హొ_చి_మిన్&oldid=4236388" నుండి వెలికితీశారు