1809 అమృత్‌సర్ ఒప్పందం

1809 లో ఈస్టిండియా కంపెనీకి, రంజిత్ సింగ్‌కు కుదిరిన ఒప్పందం

1809 నాటి అమృతసర్ ఒప్పందం బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి, సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించిన సిక్కు నాయకుడు మహారాజా రంజిత్ సింగ్ కీ మధ్య జరిగిన ఒప్పందం. ఈ ఒడంబడిక కుదుర్చుకోవడంలో ఈస్టిండియా కంపెనీ ఉద్దేశ్యం - ఫ్రెంచ్ వారు భారతదేశాన్ని ఆక్రమించినట్లయితే సింగ్ మద్దతును పొందడం. సింగ్ ఉద్దేశ్యం - సట్లేజ్ నదికి దక్షిణంగా నదిని తమ సరిహద్దుగా స్థాపించిన తర్వాత తాను సాధించుకున్న భూభాగాలను మరింత ఏకీకృతం చేయడం. సట్లెజ్, యమునా నదుల మధ్య నివసించే మాల్వా సిక్కులను అధికారికంగా తన రాజ్యంలో కలుపుకోవాలని సింగ్ కోరుకున్నాడు, తద్వారా పంజాబ్‌లోని సిక్కులందరినీ తన రాజ్యంలో ఏకం చేయవచ్చునని అతని ఉద్దేశం.[1]

నేపథ్యం

మార్చు

రంజిత్ సింగ్ (1780-1839) అప్పటి ఉత్తర భారతదేశంలో రాజ్యాన్ని స్థాపించిన సిక్కు యోధుడు. అతను 1799లో లాహోర్‌లో రాజధానిని స్థాపించాడు. 1801లో తనను తాను పంజాబ్‌కు మహారాజాగా ప్రకటించుకుని, 1808 నాటికి జీలం, సట్లెజ్ నదుల సరిహద్దుల వరకు తన భూభాగాలను విస్తరించాడు. మాల్వా ప్రాంతంలోని సిక్కు అధిపతులు సింగ్ త్వరలో తమ రాజ్యాన్ని కలిపేసుకుంటాడనే భయంతో బ్రిటిష్ వారి రక్షణ కోసం విజ్ఞప్తి చేశారు. 1807లో టిల్సిట్ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత నెపోలియన్, రష్యాల నుండి తమపై దాడి జరిగే అవకాశం ఉందన్న పుకార్ల కారణంగా ఈస్టిండియా కంపెనీ వారి అభ్యర్థనను తిరస్కరించింది. వారి రాజ్యం రష్యాకు భారతదేశానికీ మధ్య ఉన్నందున, రష్యా దాడి నుండి సింగ్ రాజ్యం చక్కటి బఫర్‌గా పనిచేస్తున్నందున, సింగ్‌తో మైత్రి వారికి అవసరం పడింది.[2]

ఫ్రెంచివారు రష్యాపై దండయాత్ర చేయగల అవకాశాల గురించి చర్చించడానికి తమ దౌత్యవేత్త చార్లెస్ మెట్‌కాల్ఫ్‌ను కలవడానికి రమ్మని ఈస్టిండియా కంపెనీ పంపిన ఆహ్వానాన్ని సింగ్ అంగీకరించాడు. నెలల తరబడి జరిగిన చర్చల తర్వాత, సింగ్ మాల్వాపై దాడి చేసి యమునా నదిని తన సరిహద్దుగా స్థాపించి, ఈ ప్రాంతంపై తన పట్టు ఎలాంటిదో మెట్‌కాఫ్‌కు నిరూపించాడు. ఈస్టిండియా కంపెనీ ప్రతిస్పందిస్తూ సట్లెజ్ నది వద్దకు తమ దళాలను పంపి, దీనిని తమ సరిహద్దుగా ప్రకటించి, ఒప్పందానికి అంగీకరించేలా సింగ్‌ను బలవంతం చేసింది. అయితే, సింగ్ వారిని సవాలు చేస్తూ, ఈస్టిండియా కంపెనీ దళాలకు ఎదురుగా తన దళాలను నది దాటించాడు. [3]

ఈ సమయంలో, నెపోలియన్ దళాలు స్పెయిన్‌పై దాడి చేశాయి. భారతదేశంపై దాడి చేసే అవకాశం చాలా తక్కువగా కనిపించింది. ఆ విధంగా, ఈస్టిండియా కంపెనీ తమ దూకుడు విధానాన్ని మార్చుకుంది. ఎందుకంటే వారికిపుడు సింగ్‌తో పొత్తు అవసరం లేదు. మాల్వాలో సట్లెజ్‌కు దక్షిణాన సాధించిన భూభాగలను సింగ్ ఉంచుకోవచ్చని అనుమతించే కొత్త ఒప్పందాన్ని వారు ముందుకు తెచ్చారు. అయితే సట్లెజ్ వారి సరిహద్దుగానే ఉంటుంది. మారిన ఈస్టిండియా కంపెనీ దృక్పథం గురించి తెలియని సింగ్, తన సాపేక్ష సైనిక బలహీనతను గ్రహించి యుద్ధంలో పాల్గొనకపోవడమే ఉత్తమమని నిర్ధారించుకున్నాడు. కొత్త ఒప్పందంపై సంతకం చేయడానికి అంగీకరించాడు. [4]

సట్లెజ్‌కు దక్షిణాన తదుపరి భూభాగ విస్తరణ జరగకుండా ఒప్పందంలోని నిబంధనలు సింగ్‌ను నిరోధించినప్పటికీ, ఉత్తరాన దండయాత్ర చేయడానికి అతనికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఇది అతని ప్రత్యర్థి సిక్కు మిస్లపై తన పాలనను విస్తరించడానికి, చివరికి ఆఫ్ఘన్ దురానీ సామ్రాజ్యాన్ని ఓడించి పెషావర్, ముల్తాన్, కాశ్మీర్ వంటి ప్రాంతాలకు విస్తరించడానికీ వీలు కల్పించింది. అతని ఫ్రెంచ్ జనరల్స్ సహాయంతో తన సైన్యాలను పాశ్చాత్యీకరించుకుని ఈ భూభాగాల ఏకీకరించాడు. 1849లో బ్రిటిషు వారి అధీనంలోకి వచ్చే వరకు ఈ సిక్కు సామ్రాజ్యం కొనసాగింది.[5] [6]

ఇవి కూడా చూడండి

మార్చు
  • లాహోర్ ఒప్పందం

మూలాలు

మార్చు
  1. Singh, Kushwant (2008). Ranjit Singh: Maharaja of the Punjab. Penguin Books India. pp. 97–98. ISBN 9780143065432.
  2. Sheikh, Mohamed (September 8, 2022). Emperor of the Five Rivers: The Life and Times of Maharajah Ranjit Singh (in ఇంగ్లీష్). Bloomsbury Publishing. pp. 51–53. ISBN 9781350337138.
  3. Singh, Kushwant (2008). Ranjit Singh: Maharaja of the Punjab. Penguin Books India. pp. 86–93. ISBN 9780143065432.
  4. Barua, Pradeep (2005). The State at War in South Asia. University of Nebraska Press. ISBN 9780803213449.
  5. Grewal, J. S. (1998). The Sikhs of the Punjab. Cambridge University Press. pp. 102–104. ISBN 9780521637640.
  6. Adle, Chahryar; Habib, Irfan; Baipakov, Karl Moldakhmetovich, eds. (2003). Development in Contrast: From the Sixteenth to the Mid-nineteenth Century. UNESCO. p. 801. ISBN 9789231038761.