ఇందిర భైరి
ఇందిర భైరి (1962, జూలై 7 - 2023, ఫిబ్రవరి 19) తెలంగాణకు చెందిన గజల్ కవయిత్రి, ఉపాధ్యాయిని. తెలంగాణ తొలి గజల్ కవయిత్రిగా పేరొందింది. 2018లో దక్కన్ గజల్ అకాడమీ స్థాపించింది. ఉపాధ్యాయురాలిగా పాఠాలు బోధిస్తూనే తీరిక సమయాల్లో గజల్స్ రాయడంతోపాటు తెలంగాణ గజల్ కావ్యం, సవ్వడి, గజల్ భారతం, మన కవులు పేరుతో గజల్స్ సంకలనాన్ని తీసుకొచ్చింది. బతుకమ్మ, తెలంగాణ అమరవీరులు, ఉద్యమ నేపథ్యం, సాయుధ పోరాటం, తెలంగాణ పండుగలపై కూడా అనేక గజల్స్ రాసింది.[1]
ఇందిర భైరి | |
---|---|
జననం | 1962, జూలై 7 ఇల్లెందు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ |
మరణం | 2023 ఫిబ్రవరి 19 హైదరాబాదు, తెలంగాణ | (వయసు 60)
వృత్తి | విశ్రాంత ఉపాధ్యాయిని |
ప్రసిద్ధి | గజల్ కవయిత్రి |
మతం | హిందూ |
భార్య / భర్త | రామశంకరయ్య (వి. 1980) |
పిల్లలు | ఇందుసాగర్, రఘురాం, హిమజా రామం |
తల్లిదండ్రులు | భైరి రామ్మూర్తి - వెంకటరమణ |
జననం, విద్య
మార్చుఇందిర 1962, జూలై 7న భైరి రామ్మూర్తి - వెంకటరమణ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందులో జన్మించింది.[2] ఎంఏ, బీఈడి, ఎంఫిల్ చదివింది.
ఉద్యోగం
మార్చుభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, కారేపల్లి తదితర ప్రాంతాల్లో పలు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యాయినిగా పనిచేసింది. ప్రభుత్వ ఉద్యోగం రాకముందు ఇల్లెందు పట్టణంలోని శాంతినికేతన్ అనే ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తించింది. ఆ తరువాత ఇల్లందులో 20 ఏళ్ళపాటు ప్రభుత్వ పాఠశాలలో సాంఘికశాస్త్రం ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. కొత్తగూడెం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో 2020లో ప్రధానోపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ పొందింది.[3]
వ్యక్తిగత జీవితం
మార్చు1980లో ఇందిరకు రామశంకరయ్యతో వివాహం అయింది. భర్త సింగరేణి ఉద్యోగి. వారికి ఇందుసాగర్, రఘురాం, హిమజా రామం సంతానం. హిమజా రామం గాయనిగా రాణిస్తోంది.[4]
సాహిత్య ప్రస్థానం
మార్చుబాల్యంలో తండ్రి నేర్పిన పుష్ప విలాపం, పోతన పద్యాలు, గబ్బిలం, మాలపల్లి వంటి కావ్య ప్రస్తావనలు అభ్యుదయ కవిత్వ దిశగా అడుగులు వేయించాయి. లోకం తెలుస్తున్న తరుణంలో తండ్రి పోత్సాహంలో కవిత్వం రాయడం ప్రారంభించి తొమ్మిదో తరగతిలో 'ఉక్కు పిడికిళ్లు' పేరుతో మొదటి కవిత రాసింది. ఆ తరువాత అప్పుడప్పుడు రాస్తుండేది. ఉద్యోగంలో చేరిన 1997 నుండి పూర్తిస్థాయి సాహిత్యరంగంలోకి అడుగుపెట్టింది. హైకూ, మినీ, నానో, వచన కవిత, గజల్, కథ, గేయం, పాట, అనువాదం, పరిశోధన మొదలైన ప్రక్రియలన్నింటిలో రచనలు చేసింది. అవన్నీ పలు దిన పత్రికలు, విద్యా వైజ్ఞానిక పత్రికలు, పుస్తకాలలో అచ్చయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో సాహితీ స్రవంతి కార్యకర్తగా ఖమ్మం, హైదరాబాద్‌లలో జరిగిన జనకవనం, సాహిత్య కార్యశాలలో కూడా పాల్గొన్నది.[5]
రచనలు
మార్చు- 2005: అలవోకలు (హైకూలు)
- 2007: అభిమతం (వచన కవిత్వం)
- 2015: తెలంగాణ గజల్ కావ్యం
- 2017: సవ్వడి (శతాధిక గజళ్లు)
- 2018: మనకవులు (గీతికలు)
- 2018: ఘనచరితలు (గేయ కవిత్వం)
అవార్డులు
మార్చు- 1998లో ఆస్ట్రేలియా పత్రిక 'తెలుగు పలుకు' వారిచే తొలి కవితా పురస్కారం
- 1999లో రాగమయి ఆర్ట్స్ అకాడమీ జాతీయ స్థాయి అవార్డు (కవిత్వం)
- 2004లో అంబేద్కర్ రాష్ట్ర(ఉమ్మడి) అవార్డు (కవిత్వం)
- 2010లో చిగురు సాహిత్య సంస్థ జాతీయ స్థాయి అవార్డు (నానో)
- 2015లో మానస సాహిత్య సంస్థ జాతీయ స్థాయి అవార్డు (కవిత్వం)
- 2016లో అనసూయ-రత్నావతి పురస్కారం (గజల్)
- 2018లో రావి రంగారావు సాహిత్యపీఠం వారి ‘జనరంజక కవితా పురస్కారం[6]
అంత్యక్రియల కవిత
మార్చుతన మృతదేహాన్ని ఎలా సాగనంపాలో, ఎలాంటి పనులు చేయకూడదో చెప్తూ ఇందిర ఓ కవితను రాసుకున్నది.
నేను పోయినప్పుడు
వస్త్రానికి బదులు
ఓ కాగితాన్ని కప్పండి
కవిత రాసుకుంటాను
సిరాబుడ్డినీ, పెన్నునొకదాన్ని
పెన్సిలు, రబ్బరు, కర్చీఫ్
బ్యాగులో ఉండేలా చూడండి
మనసులో ముల్లు గుచ్చుకున్నప్పటి పాటో
గాయపడిన గజలో
గుండెలోయలనుండి జాలువారొచ్చు
సెల్ మర్చిపొయ్యేరు
బోర్ కొట్టి చస్తాను
పసుపు గట్రా పూసి
భయంకరంగా మార్చకండి
పిల్లలు ఝడుసుకుంటారు
పైగా నన్ను గుర్తుపట్టాలి కదా!
దండలతో మూసెయ్యకండి
నాకు ఎలర్జీ!!
ఆ రేకులతో ఏదార్నైనా
మెత్తగా పరవండి
పుణ్యస్త్రీ, పాపపు స్త్రీ అని
పేర్లు పెట్టకండి
నచ్చదు
సామాన్లేవీ పారేయొద్దు అడిగినవాళ్లకిచ్చేయండి
బ్యాండ్ వాళ్ళను
ఓల్డ్ మెలొడీస్ వాయించమనండి
డ్యాన్సులాడి లేట్ చెయ్యకండి
టైమంటే టైమే!
మంగళవారమో! అమంగళవారమో!!
పాడెకు కోడిపిల్లను కట్టి హింసించకండి
బడికి కబురు పెట్టండి
నే బతికిన క్షణాలు తలుచుని
వాళ్లు సెలవిచ్చుకుంటారు
దింపుడుకళ్లం దగ్గర
చెవులు గిల్లుమనేలా పిలవకండి
తలుచుకునేవారెవరో నాకు తెలుసు
డబ్బుకు ఇబ్బందక్కరలేదు
పక్కవాళ్ల కొట్లో ఖాతాఉంది
పిట్టకు పెట్టేదున్నా లేకున్నా
అన్ని రోజులూ అందరు
ఇక్కడే ఉండండి
మళ్లీ మళ్లీ చస్తానా ఏంటి!
మట్టిలో కప్పెట్టకండి
మరీ గాలాడదు..
పురుగూ పుట్రా భయం!
కాస్త చూసి తగలబెట్టండే...
చుట్టుపక్కల మొక్కలుంటాయేమో!
గంధపుచెక్కలతో కాలడం కంటే
జ్ఞాపకమై పరిమళించడమే ఎక్కువ నాకు
పనిలో పని!
నా నవ్వులూ కన్నీళ్ళు ఆవిరైపోతున్న కాష్టం దగ్గర
కవిసమ్మేళనం పెట్టండి
నేనూ ఉన్నట్టుంటుంది
తనివితీరా విన్నట్టుంటుంది
మరణం
మార్చుకాన్సర్ వ్యాధికి చికిత్సను తీసుకుంటూ 2023, ఫిబ్రవరి 19న హైదరాబాదులో మరణించింది.[5] ఇందిర కవిత రాసుకున్న ప్రకారమే 2023 ఫిబ్రవరి 20న సోమవారం ఉదయం హైదరాబాదులోని నిజాంపేటలో అంత్యక్రియలు జరిగాయి.[3]
మూలాలు
మార్చు- ↑ డప్పు, రవి (2019-05-04). "జిందగీ: గజల్ పథంలో తల్లీకూతుళ్లు!". www.ntnews.com. Archived from the original on 2019-05-05. Retrieved 2023-02-20.
- ↑ ABN (2023-02-20). "Indira Bhyri : నా శవానికి పసుపు రాయకండి.. పిల్లలు జడుసుకుంటారు..!". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-02-20. Retrieved 2023-02-20.
- ↑ 3.0 3.1 "నా అంత్యక్రియలు ఇలాగే చేయండి.. ముందే రాసుకున్న బైరి ఇందిర..! మొబైల్ మర్చిపోవద్దు". News18 Telugu. 2023-02-20. Archived from the original on 2023-02-20. Retrieved 2023-02-20.
- ↑ Nadadhur, Srivathsan (2018-10-22). "'It's time Telangana ghazal got the respect it deserves'". The Times of India. ISSN 0971-8257. Archived from the original on 2018-10-22. Retrieved 2023-02-20.
- ↑ 5.0 5.1 telugu, NT News (2023-02-20). "ప్రముఖ గజల్ రచయిత్రి ఇందిరా భైరి కన్నుమూత". www.ntnews.com. Archived from the original on 2023-02-20. Retrieved 2023-02-20.
- ↑ "తెలంగాణ మరో విషాదం.. ప్రముఖ గజల్ దిగ్గజం ఇందిర భైరి ఇకలేరు". Samayam Telugu. 2023-02-19. Archived from the original on 2023-02-20. Retrieved 2023-02-20.