చౌదరి చరణ్ సింగ్ (1902 డిసెంబరు 23 - 1987 మే 29) భారతదేశానికి 5వ ప్రధానమంత్రిగా 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు తన సేవలనందించాడు. చరిత్రకారులు, ప్రజలు తరచూ అతనిని 'భారతదేశపు రైతుల విజేత' గా గుర్తించారు.[1]

గౌరవప్రదమైన చౌదరి చరణ్ సింగ్
చరణ్ సింగ్

1978 లో చరణ్ సింగ్


పదవీ కాలం
28 జూలై 1979 – 14 జనవరి 1980
రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి
డిప్యూటీ యశ్వంతరావు చవాన్
ముందు మొరార్జీ దేశాయి
తరువాత ఇందిరా గాంధీ

భారతదేశ ఆర్థిక మంత్రి
పదవీ కాలం
24 జనవరి 1979 – 28 జూలై 1979
ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయి
ముందు హరీభాయ్ పటేల్
తరువాత హేమవతి నందన్ బహుగుణ

3వ భారతదేశ ఉప ప్రధానమంత్రి
పదవీ కాలం
24 మార్చి 1977 – 28 జూలై 1979
ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయి
ముందు మొరార్జీ దేశాయి
తరువాత యశ్వంతరాయ్ జవాన్

భారతదేశ హోం మంత్రి
పదవీ కాలం
24 మార్చి 1977 – 1 జూలై 1978
ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయి
ముందు కాసు బ్రహ్మానందరెడ్డి
తరువాత మొరార్జీ దేశాయి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి
పదవీ కాలం
3 ఏప్రిల్ 1967 – 25 ఫిబ్రవరి 1968
గవర్నరు బిస్వంత్ దాస్
బెజవాడ గోపాలరెడ్డి
ముందు చంద్ర భాను గుప్తా
తరువాత రాష్ట్రపతి పాలన
పదవీ కాలం
18 ఫిబ్రవరి 1970 – 1 అక్టోబరు 1970
గవర్నరు బెజవాడ గోపాలరెడ్డి
ముందు చంద్ర భాను గుప్తా
తరువాత రాష్ట్రపతి పాలన

వ్యక్తిగత వివరాలు

జననం (1902-12-23)1902 డిసెంబరు 23
నూర్పీర్, యునైటెడ్ సంస్థానం,బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్)
మరణం 1987 మే 29(1987-05-29) (వయసు 84)
న్యూఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీ జనతా పార్టీ (సెక్యులర్) (1979–1987)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ (1967 కు ముందు)
భారతీయ లోక్ దళ్ (1967–1977)
జనతా పార్టీ (1977–1979)
జీవిత భాగస్వామి గాయత్రి దేవి (మరణం:2002)
సంతానం 6; అజిత్ సిం‍గ్ తో పాటు
పూర్వ విద్యార్థి ఆగ్రా విశ్వవిద్యాలయం

కేంద్ర ప్రభుత్వం చరణ్ సింగ్ కు భారతరత్న పురస్కారాన్ని 2024 ఫిబ్రవరి 9న ప్రకటించింది.[2][3]

జీవిత విశేషాలు

మార్చు

చరణ్ సింగ్ 1902లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రము, మీరట్ జిల్లాలోని నూర్‌పూర్ గ్రామంలోని జాట్ కులంలో జన్మించాడు.[4][5][6][7] అతను మహాత్మా గాంధీ అద్వర్యంలో జరిగిన భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు. అతను గజియాబాద్ జిల్లాలోని ఆర్యసమాజ్, అదే విధంగా మీరట్ జిల్లాలోని భారత జాతీయ కాంగ్రెస్ లలో 1931 నుండి క్రియాశీలకంగా ఉన్నాడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో రెండు సార్లు జైలు పాలయ్యాడు. భారత స్వాతంత్ర్యానికి ముందు అతను 1937 లో యునైటెడ్ ప్రొవిన్సెస్ శాసనసభలో సభ్యునిగా ఉన్నాడు. అతను గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే చట్టాలపై ఎక్కువ ఆసక్తిని కనబర్చేవాడు. భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా తన సైద్ధాంతిక, ఆచరణాత్మక విధానాన్ని నిర్మించాడు.

1962 - 1967 మధ్య కాలంలో అతను "రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలలోని ముగ్గురు ప్రధాన నాయకుల"లో ఒకనిగా ఉన్నాడు.[8] 1950లలో ఉత్తరప్రదేశ్ లోని అప్పటి ముఖ్యమంత్రి పండిట్ గోవింద్ వల్లబ్ పంత్ పర్యవేక్షణలో భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని అత్యంత విప్లవాత్మక భూ సంస్కరణల చట్టాలను రూపొందించడంలోను, వాటిని ఆమోదించడంలోనూ చరణ్ సింగ్ మంచి గుర్తింపు పొందాడు. మొదట పార్లమెంటరీ సెక్రటరీ గాను, తరువాత భూసంస్కరణలకు బాధ్యత వహించే రెవెన్యూ మంత్రిగాను అతను ఈ కార్యాలను సాధించాడు. 1959లో భారతదేశంలో తిరుగులేని నాయకుడు, భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ సామ్యవాద, సముదాయవాద భూ విధానాలను నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ సెషన్లో బహిరంగంగా వ్యతిరేకించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు.

వర్గాలుగా విడిపోయి ఉన్న ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ లో తన స్పష్టమైన విధానాలు, విలువలను స్పష్టం చేయగల సామర్థ్యాల కారణంగా అతను ప్రత్యేక గుర్తింపు పొందాడు.[8] ఈ కాలం తరువాత, చరణ్ సింగ్ 1967 ఏప్రిల్ 1 న కాంగ్రెస్ నుండి వైదొలగి, ప్రతిపక్ష పార్టీలోనికి చేరాడు. అపుడు ఉత్తర ప్రదేశ్ లో మొదటి కాంగ్రెసేతతర ముఖ్యమంత్రి అయ్యాడు.[8] 1967-1971 మధ్యకాలంలో భారతదేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు బలమైన శక్తిగా ఉండే కాలం.

జనతా కూటమిలో ప్రధాన భాగమైన భారతీయ లోక్ దళ్ పార్టీ నాయకునిగా, అతను 1977 లో జయప్రకాష్ నారాయణ్ ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ను ఎంపిక చేసాడు. ప్రధానమంత్రి పదవి తన కోసం కాదనీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆసక్తితో తన విప్లవాత్మక ఆర్థిక కార్యక్రమాలను అమలు చేయటానికి వీలు కల్పించటానికి ఉపయోగపడుతుందనీ ఆశించి ప్రధాని రేసులో నిలబడ్డాడు. కానీ తన ఆశయం నెరవేరనందున నిరాశ చెందాడు.

1977 లోక్‌సభ ఎన్నికల్లో, జనతా పార్టీతో కలసి ఎన్నికలలో పాల్గొనడానికి కొద్ది నెలల ముందు వరకు, అతను 1974 నుండి ఒంటరిగానే పోరాడుతూ ఉన్నాడు. రాజ్ నారాయణ చేసిన కృషి కారణంగా ఆయన 1979 లో ప్రధాని అయ్యాడు. రాజ్ నారాయణ్ జనతా పార్టీ (సెక్యులర్) ఛైర్మన్‌గా, చరణ్ సింగ్ ను ప్రధానమంత్రిగా నియమించాడు. ఉత్తరప్రదేశ్ లో 1967 లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండడానికి కూడా అతను సహాయం చేసాడు. అయితే, "ఇందిరా గాంధీ కాంగ్రెస్ పార్టీ" ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు కేవలం 24 వారాల తరువాత ఆయన పదవికి రాజీనామా చేశాడు.

1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు చరణ్ సింగ్ భారతదేశ 5వ ప్రధానమంత్రిగా పనిచేశాడు. ప్రధానమంత్రి కంటే ముందు ఈయన ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశాడు. చరణ్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలములో లోక్‌సభ ఎన్నడూ సమావేశం కాలేదు. లోక్ సభ సమావేశం ప్రారంభమవుతుందనగా, ముందురోజు ఈయన ప్రభుత్వానికి మద్దతునిచ్చిన కాంగ్రెసు పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో భారతీయ లోక్ దళ్ ప్రభుత్వం కూలిపోయింది. చరణ్ సింగ్ పదవికి రాజీనామా చేశాడు. 6 నెలల అనంతరం లోక్‌సభకు మళ్ళీ ఎన్నికలు జరిగాయి. చరణ్ సింగ్ 1987 లో తన మరణం వరకు లోక్‌దళ్ పార్టీకి నాయకత్వం వహిస్తూ ప్రతిపక్షంలో ఉన్నాడు.

ప్రారంభ జీవితం - స్వాతంత్ర్యానికి పూర్వం

మార్చు

చరణ్ సింగ్ పూర్వీకుడు, 1857 భారతీయ తిరుగుబాటుకు ప్రముఖ నాయకుడైన రాజ్‌నహర్ సింగ్ గ్రేటర్ పంజాబ్ (ప్రస్తుతం హర్యానా) లోని భల్లభ్‌గఢ్‌కు చెందినవాడు. నహర్ సింగ్ ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలో ఉరిశిక్షకు పంపబడ్డాడు. తమ ఓటమి తరువాత బ్రిటీష్ ప్రభుత్వం నుండి అణచివేతకు తప్పించుకోవడానికి, చరణ్ సింగ్ తాతతో సహా మహారాజ అనుచరులు ఉత్తర ప్రదేశ్లోని బులందర్షర్ జిల్లాకు తూర్పువైపుకు వెళ్లారు.

చరణ్ సింగ్ 1902లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రము, మీరట్ జిల్లాలోని నూర్‌పూర్ గ్రామంలో జన్మించాడు. 1923లో సైన్సులో పట్టా పుచ్చుకొని 1925లో ఆగ్రా విశ్వవిద్యాలయము నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ చేశాడు. 1926లో ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి న్యాయవిద్యను అభ్యసించి వకీలుగా ఘజియాబాదులో జీవితాన్ని ప్రారంభించాడు. 1929లో మీరట్ కి చేరి ఆ తదనంతరం కాంగ్రెసు పార్టీలో చేరాడు.

1937లో తన 34వ యేట ఉత్తర ప్రదేశ్ శాసనసభకు ఛత్రౌలి నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. ఆ నియోజక వర్గానికి 1946, 1952, 1962, 1967 లలో ప్రాతినిధ్యం వహించాడు. 1938 లో అతను అసెంబ్లీలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ బిల్లును ప్రవేశపెట్టాడు. ఇది 1938 మార్చి 31న హిందూస్థాన్ టైమ్స్ పత్రికలో ప్రచురితమైనది. వ్యాపారులు, రైతుల ప్రయోజనాలను కాపాడడానికి ఈ బిల్లు ఉద్దేశించబడింది. భారతదేశంలో చాలా రాష్ట్రాలచే ఈ బిల్లు తరువాత ఆమోదించబడింది. 1940 లో పంజాబ్ ఈ బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రం అయినది.

బ్రిటీష్ ప్రభుత్వం నుండి స్వాతంత్ర్యం కోసం అతను అహింసా పోరాటంతో మహాత్మా గాంధీని అనుసరించాడు. అనేక సార్లు జైలు శిక్ష అనుభవించాడు. ఉప్పు చట్టాల వివాదాల కారణంగా అతనిని 1930 లో బ్రిటీష్ వారు 6 నెలల పాటు జైలుకు పంపించారు. వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమం చేసినందుకు గాను 1940 నవంబరులో ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధించారు. 1942 ఆగస్టులో అతనిని బ్రిటిష్ వారు జైలుశిక్ష విధించి 1943 నవంబరులో విడుదలచేసారు.

స్వతంత్ర భారతదేశంలో

మార్చు

చరణ్ సింగ్ సోవియట్-శైలి ఆర్థిక సంస్కరణల పై జవహర్ లాల్ నెహ్రూను వ్యతిరేకించాడు. అతను 1947 తరువాత ఉత్తర భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను మార్చడానికి సహాయం చేసాడు.[8] భారతదేశంలో సహకార సేద్యం విజయవంతం కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. ఒక రైతు కుమారునిగా, ఒక రైతుకు సరైన యాజమాన్య హక్కు అతను వ్యవసాయదారునిగా ఉండడమేనని అభిప్రాయపడ్డాడు. అతను రైతు యాజమాన్య వ్యవస్థను సంరక్షించి స్థిరీకరించాలని కోరుకున్నాడు.[8]

నెహ్రూ ఆర్థిక విధానం గురించి బహిరంగ విమర్శలు చేసిన కారణంగా చరణ్ సింగ్ రాజకీయ జీవితానికి అడ్డంకిగా మారింది.

1946లో గోవింద వల్లభ్ పంత్ మంత్రివర్గములో పార్లమెంటరీ కార్యదర్శియై రెవెన్యూ, ఆరోగ్య, సాంఘిక పరిశుభ్రత, న్యాయ, సమాచర శాఖలలో పనిచేశాడు. 1951 జూన్ లో రాష్ట్రములో కేబినెట్ మంత్రిగా నియమితుడై న్యాయ, సమాచార శాఖ మంత్రిగా ఆ తరువాత 1952లో డా.సంపూర్ణానంద్ మంత్రివర్గములో రెవెన్యూ, వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశాడు. 1959 ఏప్రిల్ లో మంత్రి పదవికి రాజీనామా చేశాడు.

చరణ్‌సింగ్ 1960లో హోమ్, వ్యవసాయశాఖా మంత్రిగా, 1962-63లో వ్యవసాయ, అటవీ శాఖా మంత్రిగా పనిచేశాడు. 1965లో వ్యవసాయ శాఖను విడిచి 1966లో స్థానిక స్వయంపరిపాలనా శాఖకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.

1967లో చరణ్ సింగ్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి భారతీయ క్రాంతి దళ్ పార్టీని స్థాపించాడు. 1967లో రాజ్‌నారాయణ్, రామ్‌ మనోహర్ లోహియాల మద్దతుతో అతను ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెసు పార్టీ చీలిక తర్వాత, 1970 ఫిబ్రవరిలో కాంగ్రెసు మద్దతుతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రయ్యాడు. కానీ 1970 అక్టోబరు 2 న కేంద్రం ఈయన ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రములో రాష్ట్రపతి పాలన విధించింది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చరణ్‌సింగ్ భూసంస్కరణలు చేపట్టాడు. 1960 లాండ్ హోల్డింగ్ చట్టాన్ని తీసుకుని వచ్చాడు.

1975 లో ఇందిరాగాంధీచే జైలుకు పంపబడ్డాడు. ఆమె అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి రాజకీయ ప్రత్యర్థులను జైలుకు పంపించింది. 1977 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ప్రత్యర్థి పార్టీకి చౌదరి చరణ్ సింగ్ సీనియర్ నాయకునిగా పదవిలోకి వచ్చాడు. అతను మొరార్జీ దేశాయి ప్రధానమంత్రిగా ఉన్న జనతా పార్టీ ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రిగా, హోం మంత్రిగా పనిచేసాడు.

1984లో దళిత మజ్దూర్ కిసాన్ పార్టీని ప్రారంభించాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

సింగ్ కు భార్య గాయత్రీదేవితో పాటు ఆరుగురు పిల్లలు. అతని కుమారుడు అజిత్ సింగ్ ప్రస్తుతం రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీకి అధ్యక్షునిగా ఉన్నాడు. అజిత్ సింగ్ కేంద్రమంత్రిగానూ, అనేక సార్లు పార్లమెంటు సభ్యునిగానూ తన సేవలనందించాడు. అజిత్ సింగ్ కుమారుడు జయంత్ చౌదరి 2014 ఎన్నికలలో 15వ లోక్‌సభకు మధుర నియోజకవర్గం నుండి హేమామాలిని పై విజయం సాధించాడు.

చరణ్ సింగ్ 1985 నవంబరు 29 న గుండెపోటుకు గురయ్యాడు. అతనికి యు.ఎస్. లోని ఆసుపత్రిలో వైద్యం చేయించినప్పటికీ నయం కాలేదు. 1987 మే 28న వైద్యులు అతనికి శ్వాస ఆడటం లేదని న్యూఢిల్లీ లోని అతని నివాసానికి కబురు అందించారు. తరువాత రోజు ఉదయం 2.35 కు అతను మరణించినట్లు ప్రకటించారు.[9]

వారసత్వం

మార్చు

రైతు బంధుగా పేరుతెచ్చుకున్న చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు. అతని జన్మదినం డిసెంబరు 23 న కిసాన్ దివస్ (జాతీయ రైతు దినోత్సవం) గా భారతదేశంలో జరుపుతారు.[10][11] అతని మూడవ వర్థంతి (1990, మే 29) సందర్భంగా భారత ప్రభుత్వం అతని చిత్రంతో తపాలా బిళ్లను విడుదలచేసింది.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో ఉన్న అమృత్ సర్ విమానాశ్రయానికి "చౌధురి చరణ్ సింగ్ అంతర్జాతియ విమానాశ్రయం"గా నామకరణం చేసారు. మీరట్ లోని విశ్వవిద్యాలయానికి "చౌధురి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం"గా పేరు పెట్టారు. ఎటావా జిల్లాలోని కళాశాలకు "చౌధురి చరణ్ సింగ్ పోస్టు గ్రాడ్యుయేట్ కళాశాల"గా నామకరణం చేసారు. బులంద్‌షహర్ జిల్లాలో ఒక ఆసుపత్రికి అతని పేరు పెట్టారు.

పుస్తకాలు

మార్చు
  • Joint Farming X-rayed (1959)
  • India's Economic Policy - The Gandhian Blueprint (1978)
  • Economic Nightmare of India: Its Cause and Cure (1981)
  • Abolition of Zamindari
  • Co-operative Farming X-rayed
  • Peasant Proprietorship or Land to the Workers
  • Prevention of Division of Holdings Below a Certain Minimum

ఇతర వివరాలు

మార్చు

ఇతని పేరుమీద లోక్ దళ్ (చరణ్) అనే పార్టీ స్థాపించబడింది.

నోట్సు

మార్చు
  1. Byres, Terence J. (1988-01-01). "Charan Singh, 1902–87: An assessment". The Journal of Peasant Studies. 15 (2): 139–189. doi:10.1080/03066158808438356. ISSN 0306-6150.
  2. Andhrajyothy (9 February 2024). "ఒక్కసారి కూడా పార్లమెంట్‌కు వెళ్లని ప్రధానిగా చౌదరి చరణ్ సింగ్.. 'భారతరత్న' అవార్డు ప్రకటించిన వేళ విశేషాలు ఇవే." Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
  3. "తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న | PV Narasimha Rao Conferred Bharat Ratna By Indian Government - Sakshi". web.archive.org. 2024-02-09. Archived from the original on 2024-02-09. Retrieved 2024-02-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. Desk, India TV News (18 December 2014). "Chaudhary Charan Singh's birthday declared as a public holiday in UP". www.indiatvnews.com. Retrieved 28 July 2024.
  5. "Two more khaps extend support to Jats' Adhikar Rally on Dec 23". 21 December 2015. Retrieved 28 July 2024 – via The Economic Times - The Times of India.
  6. The Churchill Centre (2002). "India: Making headway with the critics". The Churchill Centre. Archived from the original on 23 June 2006. Retrieved 2006-07-11.
  7. Rediff.Com (27 November 2003). "The anti-reservation man". Rediff.Com. Retrieved 2006-11-18.
  8. 8.0 8.1 8.2 8.3 8.4 Brass, Paul R. (1993-01-01). "Chaudhuri Charan Singh: An Indian Political Life". Economic and Political Weekly. 28 (39): 2087–2090.
  9. "Charan Singh Dead". The Indian Express. 30 May 1987. Retrieved 26 February 2018.
  10. నవతెలంగాణ (23 December 2016). "జాతీయ రైతు దినోత్సవం". Archived from the original on 23 December 2018. Retrieved 23 December 2018.
  11. ఆంధ్రజ్యోతి, తెలంగాణా- కధనాలు (23 December 2015). "ఈ రోజు అన్నదాతది... నేడు రైతు దినోత్సవం". Archived from the original on 23 December 2018. Retrieved 23 December 2018.

మూలాలు

మార్చు

బయటి లంకెలు

మార్చు
రాజకీయ కార్యాలయాలు
అంతకు ముందువారు
చంద్రభాను గుప్తా
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి
1967–1968
తరువాత వారు
చంద్రభాను గుప్తా
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి
1970
తరువాత వారు
త్రిభువన్ నారాయణ్ సింగ్
అంతకు ముందువారు
మొరార్జీ దేశాయి
భారత ఉప ప్రధానమంత్రి
1977–1979
Served alongside: జగ్జీవన్ రాం
తరువాత వారు
యశ్వంతరావు చవాన్
అంతకు ముందువారు
కాసు బ్రహ్మానందరెడ్డి
భారతదేశ హోం మంత్రి
1977–1978
తరువాత వారు
మొరార్జీ దేశాయి
అంతకు ముందువారు
హరీభాయ్ పటేల్
భారతదేశ ఆర్థిక మంత్రి
1979
తరువాత వారు
హేమవతి నందన్ బహుగుణ
అంతకు ముందువారు
మొరార్జీ దేశాయి
భారతదేశ ప్రధానమంత్రి
1979–1980
తరువాత వారు
ఇందిరా గాంధీ
భారతదేశ ప్లానింగ్ కమిషన్ చైర్మన్
1979–1980
"https://te.wiki.x.io/w/index.php?title=చరణ్_సింగ్&oldid=4299323" నుండి వెలికితీశారు