వైఎస్‌ఆర్ జిల్లా

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా
(వైఎస్ఆర్ జిల్లా నుండి దారిమార్పు చెందింది)

వైఎస్‌ఆర్ జిల్లా[2] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి చెందిన జిల్లా. జిల్లా కేంద్రం కడప. 2022 లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ జిల్లాను విభజించి కొంత భాగంతో అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేశారు.

వైయస్ఆర్ జిల్లా
ఒంటిమిట్టలోగల 16 వ శతాబ్దపు కోదండరామ దేవాలయం
ఒంటిమిట్టలోగల 16 వ శతాబ్దపు కోదండరామ దేవాలయం
దేశంభారత దేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
ప్రాంతంరాయలసీమ
ప్రధాన కార్యాలయంకడప
విస్తీర్ణం
 • Total11,228 కి.మీ2 (4,335 చ. మై)
జనాభా
 (2011)[1]
 • Total20,60,700
 • జనసాంద్రత180/కి.మీ2 (480/చ. మై.)
భాషలు
 • అధికార భాషతెలుగు
Time zoneUTC+5:30 (IST)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 0( )
లోక్‌సభ నియోజక వర్గంకడప లోక్‌సభ నియోజకవర్గం

ఈ ప్రదేశం పల్లవులు, తెలుగు చోళులు, కాకతీయులు, విజయనగర రాజులు, గండికోట పెమ్మసాని నాయకులు, నిజాం నవాబులు, సిద్ధవటం నుంచి పరిపాలించిన మట్లి రాజులు, కడప నవాబులచే పరిపాలించ బడింది. చరిత్రలో ప్రముఖ కవులు, కవయిత్రులు, తత్వవేత్తలు ఈ జిల్లాకు చెందినవారే.

ఉమ్మడి జిల్లా చరిత్ర

పూర్వం ఈ జిల్లాకు హిరణ్యదేశం అని పేరు ఉంది.

క్రీ.పూ. 274-236 ప్రాంతంలో అశోక చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఆ తరువాత శాతవాహనులు పాలించారు. శాతవాహనుల నాణేలు పెద్దముడియం, దానవులపాడు గ్రామాల్లో దొరికాయి. సా.శ. 250-450 ప్రాంతంలో పల్లవరాజులు పాలించారు. ఇంకా రాష్ట్రకూటులు, చోళులు, కళ్యాణి చాళుక్యులు, వైదుంబులు, కాకతీయులు మొదలైన రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. సా.శ. 1336-1565 కాలంలో విలసిల్లిన విజయనగర సామ్రాజ్యంలో వైఎస్ఆర్ (కడప) జిల్లా ఒక భాగం. గండికోటను పాలించిన పెమ్మసాని నాయకులు విజయనగర రాజులకు సామంతులుగా విధేయులై పేరుప్రఖ్యాతులు పొందారు. నంద్యాల రాజులు, మట్లి రాజులు కూడా ఈ ప్రాంతం మీద పెత్తనం సాగించారు. విజయనగర పతనం తర్వాత గోల్కొండ నవాబులు, బీజాపూరు సుల్తానులు, ఔరంగజేబు మొదలైన మహమ్మదీయ రాజులు పాలించారు. సా.శ. 1710 ప్రాంతంలో అబ్దుల్ నబీ ఖాన్ కడపలో కోటను నిర్మించాడు. నవాబుల తర్వాత పాళెగాళ్ళు విజృంభించారు.ఆ తరువాత ఈస్టిండియా కంపెనీ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం వహించింది. సర్ థామస్ మన్రో వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టరుగా పనిచేశాడు. పాలెగాళ్ళను అణచాడు. రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ ప్రాంతపు అభివృద్ధికి బ్రిటీసు ప్రభుత్వంలో కొంతవరకు అభివృద్ధికి కృషి జరిగినట్లు భావించవచ్చు. మన్రో ఈ ప్రాంతపు దేవాలయాల అభివృద్ధికి మడిమాన్యాలిచ్చాడు. సి.పి.బ్రౌన్ తెలుగు భాషను సముద్ధరించాడు. మనుచరిత్ర, వసుచరిత్ర వంటి తెలుగు కావ్యాలను ముద్రించాడు. మూడు వేలకు పైగా వేమన పద్యాలను సేకరించాడు. వాటిని ఇంగ్లీషులోకి అనువదించి అచ్చు వేయించాడు. ఇక కోలిన్ మెకంజీ గ్రామాల చరిత్రను సేకరించి కైఫీయతుల పేరుతో భద్రపరిచాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2009 అక్టోబరు 5న విడుదల చేసిన G.O.Rt.No. 1480లో జిల్లా పేరును "డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి జిల్లా"గా ప్రతిపాదించి ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను ఆహ్వానించి, 2010 జూలై 8 నుండి ఈ జిల్లా పేరును వై.ఎస్.ఆర్. జిల్లాగా మారుస్తూ 2010 జూలై 7న తుది జి.ఒ.[3] విడుదల చేసింది.

2022 ఏప్రిల్ 4న జిల్లాను విభజించి అన్నమయ్య జిల్లా ఏర్పాటుచేశారు.[1]

భౌగోళిక స్వరూపం

తూర్పున శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పశ్చిమాన శ్రీ సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, దక్షిణాన అన్నమయ్య జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా, ఉత్తరాన నంద్యాల జిల్లా,ప్రకాశం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.

ఉమ్మడి జిల్లా వివరాలు

కొండప్రాంతం, నైసర్గికంగా పీఠభూమి, నల్లనేల భాగాలుగా చెప్పుకోవచ్చు. శేషాచలం కొండలు ఈ జిల్లాలో విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. వాటిని పాలకొండలని, నల్లమల కొండలని, వెలికొండలని, ఎర్రమల కొండలని పిలుస్తారు. జిల్లాలో నల్లరేగడి, ఎర్రరేగడి, ఇసకపొర నేలలు ఉన్నాయి.

వాతావరణం

ఉష్ణోగ్రతలు వేసవికాలంలో 30°సె. - 44°సె, చలికాలంలో 21°సె. - 30°సెగా వుంటాయి. సగటు వర్షపాతము: 695 మి.మీ[4]

కొండలు

  • పాలకొండలు (శేషాచలంకొండలు): వేంపల్లె దగ్గర వేంపల్లె గండి అనేచోట పాపఘ్ని నది కొండల మధ్యగా ప్రవహిస్తుంది.
  • నల్లమల, లంకమల కొండలు: ఇవి దట్టమైన అడవులతో వన్యమృగాలతో వున్నాయి. వీటి సగటు ఎత్తు 2500-3500 అడుగులు.

నదులు

పెన్న, చిత్రావతి, కుందేరు, పాపాఘ్ని, సగిలేరు, చెయ్యేరు జిల్లాలో ప్రవహించే ప్రధాన నదులు.[4]

అటవీ సంపద

అడవుల విస్తీర్ణం 4,96,672 హెక్టార్లు. ఇది జిల్లా విస్తీర్ణంలో 32.3 శాతం. పులివెందుల మండలంలో తప్ప నల్లచేవ, ఎర్రచేవ,ఎపి మొదలైన కలప జాతులు, విదేశీమారకం తెచ్చిపెట్టే ఎర్రచందనము లభ్యమవుతుంది. ప్రపంచంలో మరెక్కడా కనిపించకుండా ఆంతరించి పోయిందనుకున్న కలివికోడి ఇక్కడి శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో కనిపించింది. సింహాలు, చిరుతపులులు, మెదలయిన వన్యప్రాణులు ఈ అడవులలో నివసిస్తున్నాయి.

జలవనరులు

తుంగభద్ర నది మీద సుంకేశుల ఆనకట్ట వద్ద మొదలై "కర్నూలు కడప కాలువ" కడప, కర్నూలు జిల్లాల ద్వారా ప్రవహిస్తూ నాలుగు వేల హెక్టార్ల సాగుభూమికి నీటిని సమకూరుస్తుంది. సాగునీటి పారుదల కొరకు హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు, పులివెందల కాలువ నిర్మాణంలో ఉన్నాయి. బుగ్గవంక నది మీద ఇప్పపెంట గ్రామం వద్ద పుల్లల మడుగు జలాశ్రయం నిర్మించబడింది. గాలేరు-నగరి సుజల స్రవంతి కాలువ, జిల్లాలో త్రాగునీటికి ముఖ్య ఆధారము.

పశు పక్ష్యాదులు

లంకమలలో శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణాలయం ఉంది.

జనాభా లెక్కలు

2022 ఏప్రిల్ 4 నాడు సవరించిన జిల్లా పరిధి వరకు 2011 జనగణన ప్రకారం జిల్లా జనాభా 20.607 లక్షలు. జిల్లా విస్తీర్ణం 11,228 చ.కి.మీ.[1]

ఆర్థిక స్థితిగతులు

వ్యవసాయం

ఉమ్మడి జిల్లాలో వరి, సజ్జ, జొన్న, రాగి వంటి ఆహార ధాన్యాలు, మామిడి, చీనీ, బొప్పాయి వంటి పండ్ల తోటలు, చెఱకు, పసుపు వంటి వాణిజ్య పంటలు పండుతున్నాయి. చెన్నూరు తమలపాకులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మైదుకూరు ప్రాంతంలో పండే కె.పి.ఉల్లి విదేశాలకు ఎగుమతి అవుతుంది. కృష్ణాపురం గ్రామం పేరు మీదుగా ఆ వంగడానికి ఆ పేరు వచ్చింది.

ఉమ్మడి జిల్లాలో పెన్నానది, కె.సి.కాలువ ప్రధానమైన నీటి వనరులు. జిల్లా మొత్తంలో కాలువల క్రింద 24 వేల హెక్టార్లు, చెరువుల క్రింద 22 వేల హెక్టార్లు, బావుల క్రింద 66 వేల హెక్టార్లు, తక్కిన వనరుల క్రింద 11 వేల హెక్టార్లు సాగులో ఉన్నాయి. ఊటుకూరులో వ్యవసాయ పరిశోధనా కేంద్రము, కృషి విజ్ఞాన కేంద్రం, మైదుకూరులో జాతీయ ఉద్యనవనాల పరిశోధనాభివృద్ధి సంస్థ ఉన్నాయి.

ఖనిజాలు-పరిశ్రమలు

పులివెందుల ప్రాంతంలో రాతినార తీస్తున్నారు. నాప రాళ్ళకు కడప పెట్టింది పేరు. పులివెందుల నియోజకవర్గంలో యురేనియం నిక్షేపాలను కనుగొన్నారు. వేముల మండలంలోని తుమ్మలపల్లె గ్రామంలో యురేనియం శుద్ధి కర్మాగారం ఉంది. యర్రగుంట్ల ప్రాంతంలో సిమెంటు పరిశ్రమ, విస్తరిస్తోంది. జమ్మలమడుగులో ఉక్కు కర్మాగారం నిర్మాణంలో ఉంది. ముద్దనూరు దగ్గర ఏర్పాటైన ఆర్.టి.పి.పి. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు మెగాపవర్ ప్రాజెక్టు. కడప, ప్రొద్దుటూరులో పారిశ్రామిక వాడలున్నాయి. రాయలసీమ అభివృద్ధి పథకం కింద కడపలో చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ నెలకొల్పడం జరిగింది.

రెవెన్యూ డివిజన్లు, మండలాలు

  • రెవెన్యూ డివిజన్లు (4): కడప, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేలు

మండలాలు

  • మండలాలు (36). జిల్లా పునర్వ్యవస్థీకరణ తర్వాత పులివెందుల రెవెన్యూ డివిజన్ కొత్తగా ఏర్పాటు చేశారు.[5]


వైఎస్‌ఆర్ జిల్లా మండలాల పటం (Overpass-turbo)


నగరాలు, పట్టణాలు

జిల్లా కేంద్రం కడప నగరం కాగా, ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు పట్టణాలు.

రాజకీయ విభాగాలు

రవాణా సౌకర్యాలు

 
పులివెందుల-కడప నాలుగు వరసల రహదారి (పులివెందుల దగ్గర)
 
కడప విమానాశ్రయం

కర్నూలు-కడప-చిత్తూరు పట్టణాలను కలిపే 18వ నంబరు జాతీయ రహదారి, కడప-చెన్నై, కడప-బెంగుళూరు రాష్ట్ర రహదారులు. నెల్లూరు-బళ్ళారిలను కలిపే మరో ముఖ్యమైన రహదారి మైదుకూరు మీదుగా వెళ్తుంది.

దేశంలోని అతి ప్రధానమైన రైలు మార్గాల్లో ఒకటిగా 1854-1866 మధ్య కాలంలో వేయబడిన ముంబై-చెన్నై రైలు మార్గం ఈ జిల్లాలో ఉన్న ఏకైక రైలు మార్గం. రైల్వే కొండాపురం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, ఒంటిమిట్ట ఈ జిల్లాలో ఈ రైలు మార్గం కలిపే ముఖ్య పట్టణాలు. 1902 సెప్టెంబరు 12న భారీ వర్షాలకు ముద్దనూరు మండలం మంగపట్నం దగ్గర రైల్వే వంతెన కొట్టుకుపోవడం వల్ల భారతీయ రైల్వే చరిత్రలో మొట్టమొదటి రైలు ప్రమాదం జరిగి, 71 మంది చనిపోయినారు[6]. ఈ ఘోర ప్రమాదానికి గుర్తుగా ఏర్పాటు చేసిన స్థూపం గండికోట వెనుక జలాల్లో మునిగిపోనుంది[7].

ముఖ్య వాణిజ్య పట్టణమైన ప్రొద్దుటూరు మీదుగా ఎర్రగుంట్ల-నంద్యాల రైలు మార్గం పూర్తి అయింది.

బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన కడప విమానాశ్రయం 1990 దశకంలో మూతపడింది. 2014లో తిరిగి దీనిని ప్రారంభించారు.

విద్యా సౌకర్యాలు

ఉమ్మడి జిల్లాలో విద్యాశాలలకు సంబంధించిన గణాంకాలు 2011 జనగణన ఆధారంగా క్రింది పట్టికలో చూడండి. ఇవేకాకబోధనా, సార్వత్రిక విద్య, కంప్యూటర్ విషయాలకు సంబంధించి శిక్షణా సంస్థలు కూడా ఉన్నాయి.

వైఎస్ఆర్ జిల్లా విద్యాసంస్థల గణాంకాలు
విభాగం మొత్తం విద్యాశాలల సంఖ్య వ్యాఖ్య
పాఠశాల విద్య 4543 ,[8] 2010నాటికి 3322 ప్రాథమిక పాఠశాలలు, 490 ప్రాథమికోన్నత పాఠశాలలు,725 ఉన్నత పాఠశాలలు
పారిశ్రామిక శిక్షణ (ఐటిఐ) 18 ,[9] ప్రభుత్వసంస్థలు 3
ఇంటర్మీడియట్ 181 [10], 41వృత్తి ఇంటర్మీడియట్ కళాశాలలు [11]
పాలిటెక్నిక్ 15 [12]
కళాశాల విద్య (వృత్తేతర) (ఉన్నత విద్య) * [13] ప్రభుత్వ సంస్థలు:
వృత్తివిద్య (ఇంజనీరింగ్) * [14]
వృత్తి విద్య (ఎమ్.బి.ఎ.) * [15]
వృత్తి విద్య (ఫార్మసీ) * [16]
వృత్తి విద్య (ఎమ్.సి.ఎ.) * [17]
వైద్యవిద్య (సాధారణ వైద్యం) 1
వైద్యవిద్య (దంత వైద్యం) 1
వైద్యవిద్య (నర్సు) *
వైద్యవిద్య (వైద్య అనుబంధ) * [18]
‌విశ్వవిద్యాలయాలు లేక సమానస్థితిగలవి 2

కడపలో యోగి వేమన విశ్వవిద్యాలయం, వైఎస్సార్ శిల్ప, లలితకళల విశ్వవిద్యాలయం, రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ, కడప దంతవైద్య కళాశాల ముఖ్యమైనవి. ఇవి కాక పులివెందులలో జె.ఎన్.టి.యు (జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం) ఇంజినీరింగ్ కళాశాల, కడపలో క్రీడా పాఠశాల, ప్రభుత్వ హోమియో కళాశాల ఉన్నాయి. ఇక కడపలో సి.పి.బ్రౌన్ నివసించిన బంగళాలో ఆయన పేరిట నెలకొల్పిన బ్రౌన్ గ్రంథాలయం ప్రస్తుతం యోగి వేమన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా భాషా సాహిత్య పరిశోధనా కేంద్రంగా పనిచేస్తోంది.

ప్రసార సాధనాలు

1963 జూన్ 16న కడపలో ఆకాశవాణి కేంద్రం ఏర్పాటైంది. ఇక్కడి నుంచి ప్రసారాలు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, మహబూబ్ నగర్ జిల్లాలు, పొరుగు రాష్ట్రాల్లోని రాయచూరు, బళ్ళారి, బెంగుళూరు, కోలారు, చెన్నై తదితర ప్రాంతాల్లోనే కాక 900 కి.మీ. పరిధిలోని తెలుగు ప్రజలకు అందుతున్నాయి. ఇది కాక కడపలో దూరదర్శన్ రిలే కేంద్రం ఉంది.

ఆకర్షణలు

 
కోదండ రామాలయం, ఒంటిమిట్ట
 
సిద్ధవటం కోట

ప్రముఖులు

నాటక రంగం, సినిమా రంగం

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
  2. "కడప జిల్లా ప్రభుత్వ జాలస్థలం". Retrieved 2021-05-27.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. REVENUE (DA) DEPARTMENT G.O.Ms. No. 613 Dated:07-07-2010
  4. 4.0 4.1 "Cuddapah - Introduction". indiatravelite.com. Archived from the original on 2016-03-05. Retrieved 2015-04-09.
  5. "పులివెందుల వాసులకు గుడ్ న్యూస్.. ఇక అధికారికంగా... జగన్ సర్కారు ఉత్తర్వులు". సమయం. 2022-06-29. Retrieved 2022-06-30.
  6. "The Indian Railway Accident".
  7. "మొదటి రైలు ప్రమాద ఘటనకు 121 ఏళ్లు".
  8. "2010-11 సావంత్సరిక నివేదిక" (PDF). Archived from the original (PDF) on 2013-09-14. Retrieved 2012-05-14.
  9. "జాతీయ వృత్తిపర శిక్షణ సమాచార వ్యవస్థ". Archived from the original on 2012-05-04. Retrieved 2012-05-14.
  10. వైఎస్ఆర్లో సాధారణ ఇంటర్మీడియట్ కళాశాల వివరాలు[permanent dead link]
  11. వైఎస్ఆర్లో వృత్తి ఇంటర్మీడియట్ కళాశాల వివరాలు[permanent dead link]
  12. దొడ్ల నారపరెడ్డిw/SbtetinAP.aspx?districtid=5 వైఎస్ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలు[permanent dead link]
  13. "ఆంధ్ర ప్రదేశ్ కళాశాలలవివరాలు". Archived from the original on 2012-05-04. Retrieved 2012-05-14.
  14. "యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలో ఇంజనీరింగ్ కళాశాలలు". Archived from the original on 2012-05-12. Retrieved 2012-05-14.
  15. "యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలో ఎమ్.బి.ఎ. కళాశాలలు". Archived from the original on 2012-05-12. Retrieved 2012-05-14.
  16. "యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలో ఫార్మసీ కళాశాలలు". Archived from the original on 2012-05-12. Retrieved 2012-05-14.
  17. "యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలో ఎమ్.సి.ఎ. కళాశాలలు". Archived from the original on 2012-05-12. Retrieved 2012-05-14.
  18. "ఆంధ్ర ప్రదేశ్ లో పారామెడికల్ కళాశాలలు". Archived from the original on 2012-01-25. Retrieved 2012-05-14.

బయటి లింకులు