శ్రీరామరాజ్యం (సినిమా)

తెలుగు పౌరాణిక చలన చిత్రం - 2011

శ్రీరామరాజ్యం (Sri Rama Rajyam) 2011 నవంబరు 17 న విడుదలైన తెలుగు పౌరాణిక చిత్రం. దీనిని బాపు దర్శకత్వంలో యలమంచిలి సాయిబాబా నిర్మించారు. తెలుగు సినిమా చరిత్రలో లవకుశల చరిత్ర మూడవసారి. మొదటి రెండు సినిమాలు సి.పుల్లయ్య దర్శకత్వంలో లవకుశ (1934, 1963) పేరుతో విడుదల చేశారు.

శ్రీరామరాజ్యం
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
నిర్మాణం యలమంచిలి సాయిబాబు
చిత్రానువాదం బాపు
తారాగణం నందమూరి బాలకృష్ణ
నయనతార
మేకా శ్రీకాంత్
అక్కినేని నాగేశ్వరరావు
సాయి కుమార్
సంగీతం ఇళయరాజా
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, శ్రేయా ఘోషాల్
గీతరచన జొన్నవిత్తుల
సంభాషణలు ముళ్ళపూడి వెంకట రమణ
ఛాయాగ్రహణం పి.ఆర్.క్. రాజు
కూర్పు జి.జి.కృష్ణారావు
నిర్మాణ సంస్థ శ్రీ సాయిబాబా మూవీస్
విడుదల తేదీ 17 నవంబరు 2011
భాష తెలుగు
పెట్టుబడి 35 కోట్లు

చిత్రకథ

మార్చు

ఈ సినిమా హిందూ పురాణాల్లో ఉత్తర రామాయణం ఆధారంగా నిర్మించింది. రావణవధ తర్వాత పుష్పక విమానంలో అయోద్యకు తిరిగివచ్చిన శ్రీరామునికి కులగురువైన వశిష్టుడి చేత పట్టాభిషేకం జరుగుతుంది. రామరాజ్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా సస్యశ్యామలంగా ఎలాంటి ఈతి బాధలు లేకుండా సాగిపోతుంది. సీతాదేవి గర్భవతిగా ఉన్న శుఖసమయంలో రాముడు ఏదైనా కోరుకోమంటే ఆమె మునిపత్నుల ఆశీర్వాదం తీసుకోవాలను ఉందని అడుగుతుంది. అలాంటి సమయంలోనే అయోధ్య నలుదిక్కులా తిరిగి వచ్చిన గూఢచారులు శ్రీరాముని కలుస్తారు. అన్నీ శుభంగానే ఉన్నాయని చెబుతారు. ఒక్క భద్రుడు మాత్రం చెప్పకపోగా అతని ముఖంలోని ఆవేదనని కనుగొన్న రాముని కోరికమీద అసలు విషయం తెలియజేస్తాడు. ఒక చాకలివాడు తాగిన మైకంలో ఆలస్యంగా తిరిగివచ్చిన తన భార్యని నిందిస్తూ ఇంట్లోకి రానియ్యడు. నిలదీసిన మామయ్య, ఇతర పెద్దలతో ఏడాది పాటు లంకలో ఉన్న సీతను ఇంటికి రానిచ్చి ఏలుకొంటున్న వెర్రి రాముని వంటి వాడిని కాదని చెబుతాడు. ఈ విషయం తెలిసిన శ్రీరాముడు తమ్ముళ్ళను పిలిపించి, విషయాన్ని తెలిపి తన సీతను విడిచిపెట్టలేనని రాజ్యాన్ని వారిలో ఎవరైనా రాజ్యాన్ని ఏలుకోమని అడుగగా వారు సమ్మతించరు. ఇంక వంశ ప్రతిష్ఠ, ప్రజాసేవే ముఖ్యమైనవిగా భావించి సీతాదేవిని అడవిలో విడిచిరమ్మని లక్షణుడిని ఆజ్ఞాపిస్తాడు. ఎవరికీ ఈ విషయం తెలియకూడదని కూడా చెబుతాడు.

ఆ విధంగా లక్షణుడు సీతాదేవిని అడవిలో విడిచిపెడతాడు. చివరి క్షణంలో విషయం తెలిసిన సీతాదేవి మూర్చిల్లిపోతుంది; తెలివివచ్చి రోదిస్తున్న కూతుర్ని తల్లి భూదేవి తనతో రమ్మని పిలువగా ఆమె తిరస్కరిస్తుంది. అత్తవారింట అపనింద పడిన వనిత పుట్టిల్లు చేరరాదని చెబుతుంది. ఆమె విషయం తెలిసిన వాల్మీకి తన ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోమని ప్రార్ధిస్తాడు. హనుమంతుడు బాలరాజుగా ఆమెకు తెలియకుండా అక్కడే ఉంటాడు. ఆశ్రమంలోనే ఆమెకు లవకుశులు జన్మిస్తారు. నామకరణం చేసి వాల్మీకి వారికి తాను రచించిన రామాయణాన్ని గానం చేయడమే కాకుండా, అస్త్రశస్త్రాల ప్రయోగాల్ని కూడా నేర్పిస్తాడు. రామాయణాన్ని గానం చేస్తూ అయోధ్య చేరుకొని పురవీధుల్లో పాడుకొంటున్న వారిని అంతఃపురానికి పిలిపించి వారి మధుర గానాన్ని విని ఆనందిస్తారు. రాముని దర్శనం చేసుకొన్న వారు సీతామాతను చూడాలని వుందంటారు. రాముడు ఆమెను అడవికి వెళ్ళగొట్టాడని తెలుసుకొని రామున్ని ద్వేషిస్తారు.

ఆశ్రమానికి తిరిగివచ్చి తల్లియే సీతామాతని తెలియక రామున్ని దూషిస్తారు. కోపంతో సీతాదేవి వారిని కోపంతో మాట్లాడదు. బాలరాజు చేసిన రామగానంతో పిల్లలు తల్లి ఒడిని చేరతారు. అయోధ్య నుండి రాముడు పంపగా అశ్వమేధ యాగానికి వాల్మీకిని ఆహ్వానిస్తారు. సీతాదేవికి అనుమానం వచ్చి ఆశ్రమంలోని మునుల్ని యజ్ఞయాగాదులు భార్యలేకుండా చెయ్యవచ్చునా అని అడుగుతుంది. ఎట్టి పరిస్థితిలోను వీలుకాదని తెలుసుకొని రాముడు మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడేమోనని భావిస్తుంది. ఆమె మనసులోని అనుమాన బీజాన్ని గమనించిన వాల్మీకి తన తపోమహిమ చేత ఆమె మనస్సు అయోధ్యచేరుకొనేటట్లు చేస్తాడు. అక్కడ స్వర్ణసీతను, తనమీద రాముని మనసులోని ప్రేమను చూసిన ఆమె పులకిస్తుంది. మేలుకొన్న సీతాదేవి తాను రామున్ని అనుమానించి చాలా పెద్ద దోషం చేశానని, దానికి ప్రాయశ్చిత్తం తెలియజేయమని ప్రార్ధిస్తాడు. లలితా వ్రతం చేసి సహస్రపత్ర కమలాలతో 15 రోజులు పూజిస్తే అన్ని రకాల సమస్యలు తీరిపోతాయని వాల్మీకి చెప్పగా బాలరాజు ఆమెకు వలసిన పుష్పాలను ఏర్పాటుచేయడానికి సిద్ధమౌతాడు.

అశ్వమేధ యాగంతో లక్ష్మణుడి తోడుగా దేశమంతా తిరుగుతూ వాల్మీకి ఆశ్రమప్రాంతానికి వస్తుంది. దానిని లవకుశులు ధైర్యంగా బంధిస్తారు. లక్ష్మణునితో వాదించి, పోరాడి సమ్మోహనాస్త్రంతో నిర్వీర్యున్ని చేస్తారు. తప్పని పరిస్థితిలో శ్రీరాముడు అక్కడికి వచ్చి మునిబాలలైన లవకుశులని తెలిసి వాత్సల్యంతో ఎదిరించలేకపోతాడు. రాముడు కోపంతో రామబాణం ప్రయోగించే సమయానికి హనుమాన్ ద్వారా విషయం తెలుసుకొని సీతాదేవి అక్కడికి వచ్చి రాముడే వారి తండ్రి అని తెలియజేస్తుంది. తండ్రిని ఎదిరించినందుకు వారు క్షమించమనగా తండ్రిని మించిన తనయులని నిరూపించుకున్నందుకు తనకు సంతోషంగా ఉన్నదని రాముడు తెలియజేస్తాడు. పిల్లల్ని రామునికి అప్పగించి సీత భూమాతని పిలిచి తన అవతారాన్ని చాలిస్తుంది. పిదప రాముడు లవకుశులకు అయోధ్య రాజ్య పట్టాభిషేకం చేసి తాను వైకుంఠం చేరుతాడు.

నటీనటులు

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటలన్నింటినీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రచించారు.

విశేషాలు

మార్చు
  • 50 సంవత్సరాల తర్వాత తీసిన రామకథను పాత లవకుశ (1963) తో పోలిస్తే కొన్ని తేడాలు కనిపిస్తాయి. రమణారెడ్డి, సూర్యకాంతం పాత్రల్ని తొలగించారు. సీతాదేవికి శీమంతం జరిపించినట్లుగా చేర్చారు. పాతకథ కన్నా వాల్మీకి ఆశ్రమంలో హనుమంతుని పాత్రని లవకుశులకు తోడుగా పెంచారు. చాకలి తిప్పడు కుటుంబ కలహాల సమయంలోని కీలకమైన హాస్యగీతాన్ని చిత్రీకరించలేదు. సినిమా మొత్తం మీద పద్యాలు కారణాంతరాల వల్ల తొలగించి సంభాషణలుగా మార్చారు. రెండు పాటలలో శ్రీరాముని బాల్యంలో చందమామకు విషయాల్ని ఆంజనేయుని చిటికెల పందిరి కథను చాలా అందంగా సందర్భోచితంగా చేర్చారు. ఆధునిక కాలంలోని గ్రాఫిక్స్ ముఖ్యంగా వివిధ అస్త్రాలకు సంబంధించినవి, భూదేవి సీతాదేవిని తీసుకుపోతున్నప్పుడు చిత్రకథకు మంచిగా అతికాయి. కళాదర్శకత్వం అయోద్య సెట్టింగులు బాగున్నాయి.
  • ఈ సినిమాలో లవుడిగా నటించిన దాసరి గౌరవ్ ఇదివరకే సినిమాల్లో నటించాడు. ఇంతకు ముందు బళాదూర్, గణేష్, రైడ్, నచ్చావులే, డార్లింగ్, కింగ్, రైడ్, వీర మొదలైన పది సినిమాలలో నటించాడు.
  • అయితే కుశుడిగా నటించిన ఎస్. ధనుష్ కుమార్ కి ఇది మొదటి సినిమా.
  • బాలరాజు (బాల హనుమంతుడు) గా పొనుగుపాటి పవన్ శ్రీరామ్ నటించాడు. వీడు ఇదివరకు ప్రస్థానం, గాయం-2, సుందరకాండ, దూకుడు, దడ మొదలైన 35 సినిమాలలో నటించాడు.

పురస్కారాలు

మార్చు
సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
2011 నంది పురస్కారాలు[1] ఉత్తమ చిత్రం యలమంచిలి సాయిబాబు గెలుపు
2011 నంది పురస్కారాలు ఉత్తమ నటి నయనతార గెలుపు
2011 నంది పురస్కారాలు ఉత్తమ ఛాయాగ్రాహకుడు పి.ఆర్.కె.రాజు గెలుపు
2011 నంది పురస్కారాలు ఉత్తమ సంగీతదర్శకుడు ఇళయరాజా గెలుపు
2011 నంది పురస్కారాలు ఉత్తమ నృత్య దర్శకుడు శ్రీను గెలుపు
2011 నంది పురస్కారాలు ఉత్తమ మేకప్ కళాకారుడు పి.రాంబాబు గెలుపు
2011 నంది పురస్కారాలు ఉత్తమ డబ్బింగ్ కళాకారిణి ఉపద్రష్ట సునీత గెలుపు
2011 సైమా అవార్డులు ఉత్తమ నటి నయనతార విజేత
2011 సైమా అవార్డులు ఉత్తమ సినిమాటోగ్రాఫర్ పి.ఆర్.కె. రాజు విజేత

మూలాలు

మార్చు
  1. "2011 నంది పురస్కారాల జాబితా". Archived from the original on 2017-08-08. Retrieved 2018-01-19.

బయటి లంకెలు

మార్చు