త్యాగరాజు (నటుడు)
Pagadala Tyagaraju Naidu తెలుగు సినిమా నటుడు. ఇతడు ఎక్కువ సినిమాలలో ప్రతినాయకుడిగా నటించాడు.
Pagadala Tyagaraju Naidu | |
---|---|
జననం | పగడాల త్యాగరాజు నాయుడు 1941 |
మరణం | 1991 ఫిబ్రవరి 24 హైదరాబాద్ | (వయసు 50)
మరణ కారణం | గుండెపోటు |
జాతీయత | భారతీయుడు |
విద్య | M A, M Phil, L L B |
వృత్తి | సినిమా నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1964 - 1991 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | దుష్టపాత్రలు, పోలీసు ఇన్‌స్పెక్టర్ పాత్రలు |
గుర్తించదగిన సేవలు | మంచి మనిషి అల్లూరి సీతారామరాజు |
తల్లిదండ్రులు | Yathirajamma, T R Narayanaswami Naidu |
జీవిత విశేషాలు
మార్చుఇతడు 1941లో వరంగల్ జిల్లా హన్మకొండలోన యతిరాజమ్మ, టి ఆర్ నారాయణస్వామి నాయుడుకు జన్మించాడు. ఇతని పూర్తి పేరు పగడాల త్యాగరాజు నాయుడు. ఇతని విద్యాభ్యాసం వరంగల్, హైదరాబాద్ నగరాల్లో జరిగింది. బాల్యం నుండే క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో ఆసక్తి కనబరచి కాలేజీ రోజుల్లో క్రీడల్లో ఆల్‌రౌండర్‌గా పేరు పొందాడు. ఇంటర్ కాలేజీ క్రీడోత్సవాల్లో పాలు పంచుకుని చాలా బహుమతులు పొందడమే కాక కాలేజీ తరపున క్రికెట్ టీముకు కెప్టెన్‌గా వ్యవహరించేవాడు. క్రీడల పట్ల ఎంత శ్రద్ధాసక్తులు ఉండేవో నటన పట్ల కూడా ఇతనికి అంతే ఆసక్తి ఉండేది. మొదటిసారిగా పదేళ్ల వయసులో సికిందరాబాద్ గవర్నమెంట్ హైస్కూల్‌లో చదువుతున్నప్పుడు పాఠశాల వార్షికోత్సవాల్లో ఒక నాటకంలో ఆడపిల్ల వేషం వేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ నాటకాన్ని చూసిన అప్పటి హైదరాబాదు స్టేట్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అభినందిస్తూ ప్రత్యేక బహుమతి అందజేశారు. తరువాత వరంగల్ కాలేజీలో చదువుతున్నప్పుడు చాలా నాటకాల్లో నటించి పేరు తెచ్చుకోవడమే గాక చాలా నాటకాలకు దర్శకత్వం వహించి జిల్లా స్థాయి నాటకాల్లో ఉత్తమ నటుడు అవార్డులందుకున్నాడు. కాలేజీలో చదివే రోజుల్లోనే నాటకాలంటే ఇతనికి ఒక వ్యసనంగా మారింది. తన మిత్రులతో కలిసి పగిలిన గోడలు అనే నాటకాన్ని అంతర్ విశ్వవిద్యాలయాల నాటకోత్సవాల్లో ప్రదర్శించాలనుకున్నాడు. కానీ ఇంతలో తనకు ఇవ్వవలసిన వేషం వేరొకరికి ఇచ్చి తనను తప్పించారు. అప్పటికే కాలేజీ సాంస్కృతిక విభాగానికి కన్వీనర్‌గా ఉన్న తనకు వేషం లేకపోవడమేమిటని అడగడంతో అదే నాటకంలో ఒక రిక్షావాడి వేషం ఇచ్చారు. ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన ఈ పోటీల్లో, వేంకటేశ్వర, ఉస్మానియా వర్సిటీలు కూడా పాల్గొన్నాయి. ఈ పోటీల్లో ఇతని 'పగిలిన గోడలు' నాటకానికి ఉత్తమ నాటకం, ఉత్తమ స్క్రిప్టు, ఉత్తమ నటుడు బహుమతులతో పాటు త్యాగరాజు పోషించిన రిక్షావాడి పాత్రకు ఉత్తమ సహాయనటుడి బహుమతి వచ్చింది. ఒక నాటకానికి అన్ని బహుమతులు రావడం ఆంధ్ర విశ్వవిద్యాలయ చరిత్రలో అదే మొదటిసారి. రిక్షావాడి పాత్ర పోషణను మెచ్చుకుంటూ ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ టెలిగ్రాం ద్వారా అభినందనలు తెలిపితే, రిజిస్ట్రార్ కూర్మా వేణు గోపాలస్వామి నాయుడు ఏకంగా తమ యూనివర్సిటీలోనే ఎం.ఎ.చదవమని అడిగాడు. కానీ త్యాగరాజు మాత్రం ఆ ప్రతిపాదనను సున్నితంగానే తిరస్కరించి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే ఎం.ఎ., ఎం.ఫిల్., ఎల్.ఎల్.బి. చేశాడు. త్యాగరాజు నాటకాల పట్ల ఉన్న ఆసక్తితో వరంగల్‌లో మిత్రులందరితో కలిసి కాకతీయ కళాసమితి అనే సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ పక్షాన చాలా నాటకాలు వేశాడు[1].
సినిమా రంగం
మార్చునాటక రంగంలో త్యాగరాజు కృషిని, నటుడిగా ప్రదర్శించే ప్రతిభను గుర్తించి ఇతని స్నేహితులు సినిమాలలో ప్రయత్నించమని ప్రోత్సహించారు. మద్రాసు వెళ్లి దర్శకుడు ప్రత్యగాత్మను కలిసి సినిమాలలో నటించాలనే తన అభిలాషను వ్యక్తం చేశాడు. ప్రత్యగాత్మ తాను దర్శకత్వం వహించిన మంచి మనిషి చిత్రంలో విలన్‌గా అవకాశం ఇచ్చాడు. ఆవిధంగా ఇతనికి 1964లో తొలి సినిమా అదీ ఎన్.టి.ఆర్.తో కలిసి నటించే అవకాశం లభించింది. ఆ వెంటనే గుత్తా రామినీడు 'పల్నాటి యుద్ధం' (1966)లో వీరభద్రుడి వేషం, రంగుల రాట్నం (1967)లో వాణిశ్రీ తండ్రి వేషంతో నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఆ తరువాత ఇతనికి పాతికేళ్లకు పైగా తన సినీజీవితంలో వెనక్కి తిరిగి చూసుకొనే అవసరమే కలుగలేదు. బందిపోటు దొంగ, పోలీస్ ఇన్‌స్పెక్టర్ వేషాలకు త్యాగరాజు పెట్టింది పేరుగా చలామణి అయ్యాడు. ప్రతినాయక పాత్రలో కరుడుగట్టిన విలన్ వేషాలు వేయడంలో తనకు తానే సాటి రాగలడనే పేరు తెచ్చుకున్న త్యాగరాజు 'పాప కోసం', 'శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం' వంటి చిత్రాల్లో సాత్విక పాతలు ధరించి ప్రేక్షకుల సానుభూతిని పొందాడు కూడా. ఇతడు కౌబాయ్, క్రైమ్ చిత్రాలతో పాటు జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో మొత్తం 400 చిత్రాలకు పైగా నటించాడు[1].
నటించిన సినిమాలు
మార్చుత్యాగరాజు నటించిన సినిమాల పాక్షిక జాబితా:
- ప్రేమ ఖైదీ (1991)
- వీరూ దాదా (హిందీ) (1990)
- అయ్యప్పస్వామి మహత్యం (1989)
- శ్రీరామచంద్రుడు (1989) - ఫణీంద్రరావు
- ఊరేగింపు (1988)
- నేనే రాజు – నేనే మంత్రి (1987)
- విశ్వనాథ నాయకుడు (1987)
- స్త్రీ సాహసం (1987)
- తాండ్ర పాపారాయుడు (1986)
- ధర్మపీఠం దద్దరిల్లింది (1986)
- పరశురాముడు (1986)
- శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
- మేరా జవాబ్ (హిందీ) (1985)
- బాబులుగాడి దెబ్బ (1984)
- అమాయకుడు కాదు అసాధ్యుడు (1983)
- ఆంధ్రకేసరి (1983)
- చండీరాణి (1983)
- ధర్మ పోరాటం (1983)
- పటాలం పాండు (1981)
- ధర్మం దారి తప్పితే (1980)
- మూగకు మాటొస్తే (1980)
- యముడు (1980)
- రామ్ రాబర్ట్ రహీమ్ (1980)
- శివమెత్తిన సత్యం (1980)
- సర్కస్ రాముడు (1980)
- సూపర్ మేన్ (1980)
- ఆడదంటే అలుసా (1979)
- గంగా భవానీ (1979)
- గంధర్వ కన్య (1979)
- పంచభూతాలు (1979)
- మూడు పువ్వులు ఆరు కాయలు (1979)
- రాముడే రావణుడైతే (1979)
- హేమా హేమీలు (1979)
- కరుణామయుడు (1978)
- కేడీ నంబర్ 1 (1978)
- దొంగల దోపిడీ (1978)
- పట్నవాసం (1978)
- ముగ్గురూ ముగ్గురే (1978)
- లాయర్ విశ్వనాథ్ (1978)
- చిల్లర దేవుళ్లు (1977)
- జడ్జిగారి కోడలు (1977)
- జీవిత నౌక (1977)
- మనవడి కోసం (1977)
- మనుషులు చేసిన దొంగలు (1977)
- ఇద్దరూ ఇద్దరే (1976)
- ఈ కాలపు పిల్లలు (1976)
- కొల్లేటి కాపురం (1976)
- దొరలు దొంగలు (1976)
- నా పేరే భగవాన్ (1976)
- నిజం నిద్రపోదు (1976)
- నేరం నాది కాదు ఆకలిది (1976)
- పాడవోయి భారతీయుడా (1976)
- భలే దొంగలు (1976)
- మా దైవం (1976)
- వేములవాడ భీమకవి (1976)
- సీతా కళ్యాణం (1976) - పరశురాముడు
- అందరూ మంచివారే (1975)
- అన్నదమ్ముల అనుబంధం (1975)
- ఆస్తికోసం (1975)
- నాకూ స్వతంత్రం వచ్చింది (1975)
- వయసొచ్చిన పిల్ల (1975)
- అల్లూరి సీతారామరాజు (1974) -బాస్టియన్
- కన్నవారి కలలు (1974)
- రామ్ రహీం (1974)
- ఒక నారి – వంద తుపాకులు (1973) - సర్దార్
- గాంధీ పుట్టిన దేశం (1973)
- జీవన తరంగాలు (1973)
- పంజరంలో పసిపాప (1973) - కిల్లర్
- మంచివాళ్ళకు మంచివాడు (1973)
- మేమూ మనుషులమే (1973)
- విచిత్ర వివాహం (1973)
- కలవారి కుటుంబం (1972)
- కొరడారాణి (1972)
- చిట్టి తల్లి (1972)
- నిజం నిరూపిస్తా (1972)
- పిల్లా? - పిడుగా? (1972)
- బుల్లెమ్మ బుల్లోడు (1972)
- భలే మోసగాడు (1972)
- మాయింటి వెలుగు (1972)
- మావూరి మొనగాళ్ళు(1972)
- రాజమహల్ (1972)
- శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (1972) - నరకాసురుడు
- అడవి వీరులు (1971)
- అనూరాధ (1971)
- కత్తికి కంకణం (1971)
- కిలాడి బుల్లోడు (1971)
- చలాకీ రాణి కిలాడీ రాజా (1971)
- జాతకరత్న మిడతంభొట్లు (1971)
- జేమ్స్ బాండ్ 777 (1971)
- దెబ్బకు ఠా దొంగల ముఠా (1971)
- నమ్మకద్రోహులు (1971) - రాజా
- మాస్టర్ కిలాడి (1971)
- మొనగాడొస్తున్నాడు జాగ్రత్త (1971)
- మోసగాళ్లకు మోసగాడు (1971)
- రివాల్వర్ రాణి (1971)
- విక్రమార్క విజయం (1971)
- శ్రీకృష్ణసత్య (1971)
- కథానాయిక మొల్ల (1970)
- కోడలు దిద్దిన కాపురం (1970)
- ఖడ్గవీర (1970)
- జన్మభూమి (1970)
- ద్రోహి (1970)
- పగ సాధిస్తా (1970)
- మాయని మమత (1970)
- రక్తసింధూరం (1970)
- రౌడీరాణి (1970)
- అగ్గి వీరుడు (1969)
- కదలడు వదలడు (1969) -డిండిమ వర్మ
- గండర గండడు (1969) - కాలకంఠుడు
- గండికోట రహస్యం (1969)
- టక్కరి దొంగ చక్కని చుక్క (1969) - ఇన్‌స్పెక్టర్ కామేశం
- పంచకల్యాణి దొంగలరాణి(1969)
- మహాబలుడు (1969)
- ఎవరు మొనగాడు (1968)
- దేవకన్య (1968)
- పాప కోసం (1968) - కిష్టయ్య
- బంగారు పంజరం (1968)
- బందిపోటు దొంగలు (1968) - పాపన్న
- భలే మొనగాడు (1968)
- మంచి మిత్రులు (1968)
- చిక్కడు దొరకడు (1967)
- పట్టుకుంటే పదివేలు (1967)
- మంచి కుటుంబం (1967)
- రంగులరాట్నం (1967)
- రక్తసింధూరం (1967)
- పల్నాటి యుద్ధం (1966) - వీరభద్రుడు
- హంతకులొస్తున్నారు జాగర్త (1966)
- మంచి మనిషి (1964)
మరణం
మార్చుఅతి తక్కువ కాలంలో అత్యధిక చిత్రాలలో నటించిన త్యాగరాజు తన 51వ ఏట 1991 ఫిబ్రవరి 24న హైదరాబాదులోని అశోక్‌నగర్‌లో ఉన్న తన సోదరుని ఇంట్లో హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో మృతి చెందాడు[1].